వారిని ఇలా చూడటం చాలా కష్టంగా ఉంది - టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్
వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీ ఫైనల్లో ఓడిపోవడంతో జట్టు సభ్యులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారని, వారిని అలా చూడటం చాలా కష్టంగా అనిపించిందని కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపారు.
ప్రపంచకప్ కోసం భారత జట్టు సభ్యులు ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారని, ఎన్నో త్యాగాలు చేసి ఇక్కడి వరకు వచ్చారని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పారు. వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీ ఫైనల్లో ఓడిపోవడంతో జట్టు సభ్యులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారని, వారిని అలా చూడటం చాలా కష్టంగా అనిపించిందని తెలిపారు. మ్యాచ్ ఫలితంపై ఆయన్ని మీడియా ప్రశ్నించగా.. పైవిధంగా స్పందించారు. రోహిత్ శర్మ సూపర్ కెప్టెన్ అని, వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌ను అద్భుతంగా నడిపించాడని ద్రవిడ్ తెలిపారు. మైదానంలోనూ, డ్రెస్సింగ్ రూమ్‌లోనూ ఆటగాళ్లలో ఉత్తేజం నింపాడన్నారు. ఎప్పుడు అవసరమైనా తక్షణమే అందుబాటులో ఉంటాడని చెప్పారు. చర్చకైనా, సమావేశాలకైనా వచ్చేస్తాడని తెలిపారు. ప్రతి మ్యాచ్ కోసం ముందే పక్కాగా ప్లానింగ్ ఉంటుందని వివరించారు.
ముగిసిన ద్రవిడ్ పదవీ కాలం...
వరల్డ్ కప్‌లో అజేయంగా ఫైనల్‌కి చేరుకున్న భారత్ చివరి మెట్టుపై ఓటమిని చవిచూడటం సగటు భారత అభిమానిని తీవ్రంగా కలచివేసింది. ఇక ఆ జట్టులో విజయం కోసం శ్రమించిన ఆటగాళ్ల పరిస్థితి ఎంత బాధాకరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ టీమ్‌కి కోచ్‌గా వ్యవహరించిన ద్రవిడ్ పదవీకాలం కూడా ఈ మ్యాచ్‌తో అధికారికంగా పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. తన రెండేళ్ల పనితీరుపై బయట నుంచి ఎన్ని వ్యాఖ్యలు వచ్చినా పట్టించుకోనని, తన బాధ్యతలను ఎలా నిర్వర్తించానని స్వయంగా విశ్లేషించుకుంటానని చెప్పారు. ఇలాంటి జట్టుతో పనిచేసినందుకు గర్వపడుతున్నానని ద్రవిడ్ తెలిపారు. అన్ని ఫార్మాట్లలో ఆటగాళ్లతో కలిసిపోయి పనిచేయడం ఆనందంగా ఉందని, దీనిని ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.
2027 ప్రపంచకప్ గురించి ఇప్పుడే ఆలోచించడం సరికాదు...
వచ్చే ఏడాది యూఎస్‌ఏ, వెస్టిండీస్ దేశాల ఆతిథ్యంలో టీ20 ప్రపంచకప్ జరగనుంది. దీంతో ఆ టోర్నీకి కూడా జట్టుకు కోచింగ్ వ్యవహారాలు చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నారా? అనే ప్రశ్నకు ద్రవిడ్ సమాధానం ఇచ్చారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఎవరూ చెప్పలేరని, ఇప్పటికైతే ఎలాంటి ప్రణాళికలూ లేవని తెలిపారు. అలాగే 2027 ప్రపంచకప్ గురించి కూడా ఇప్పుడే ఆలోచించడం సరికాదన్నారు. ఎవరు వెళ్తారు.. ఎవరు వెళ్లరనేది చెప్పడం కష్టమని, దానికి చాలా సమయం ఉందని వ్యాఖ్యానించారు.