భారత్ తో పోరుకు ఘటోత్కచ ఆల్ రౌండర్!
భారత్ తో తలపడే వెస్టిండీస్ టెస్టుజట్టులో భారీకాయుడు రకీం కార్న్ వాల్ కు చోటు దక్కింది. రెండేళ్ల విరామం తర్వాత ఈ మహాఆల్ రౌండర్ తిరిగి టెస్టు బరిలోకి దిగనున్నాడు.
భారత్ తో తలపడే వెస్టిండీస్ టెస్టుజట్టులో భారీకాయుడు రకీం కార్న్ వాల్ కు చోటు దక్కింది. రెండేళ్ల విరామం తర్వాత ఈ మహాఆల్ రౌండర్ తిరిగి టెస్టు బరిలోకి దిగనున్నాడు....
ఐసీసీ టెస్టు ( 2023-25 ) లీగ్ చాంపియన్షిప్ లో భాగంగా భారత్ తో ఈనెల 12 ప్రారంభంకానున్న రెండుమ్యాచ్ ల సిరీస్ లో పాల్గొనే వెస్టిండీస్ జట్టులో ప్రపంచంలోనే అత్యంత బరువైన ఆల్ రౌండర్ కు చోటు కల్పించారు.
అత్యంత 'బరువైన' ఆల్ రౌండర్....
ఆరున్నర అడుగుల ఎత్తు, 140 కిలోల బరువుతో ప్రస్తుత ప్రపంచ క్రికెట్లోనే అత్యంత బరువైన క్రికెటర్ గా పేరున్న రకీం కార్నివాల్ కు ఉపయుక్తమైన ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ గా గుర్తింపు ఉంది. 2021 సీజన్లో చివరిసారిగా విండీస్ టెస్టుజట్టుకు ప్రాతినిథ్యం వహించిన రకీం రెండేళ్లవిరామం తర్వాత టెస్టు బరిలో నిలువనున్నాడు.
13 దశాబ్దాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆస్ట్ర్రేలియాకు చెందిన వార్విక్ ఆర్మ్ స్ట్ర్రాంగ్ పేరుతో ఉన్న 139 కిలోల రికార్డును 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు కలిగిన రకీం 140 కిలోల బరువుతో అధిగమించాడు.
కరీబియన్ దేశవాళీ క్రికెట్లో నంబర్ వన్ ఆఫ్ స్పిన్నర్ గా పేరున్న రకీం 260 వికెట్లు సాధించడంతో పాటు నిలకడగా రాణించడం ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. చివరకు...కింగ్స్ టన్ సబైనాపార్క్ వేదికగా భారత్ ప్రత్యర్థిగానే టెస్ట్ అరంగేట్రం చేశాడు. అంతేకాదు...తన అరంగేట్రం టెస్ట్ లోనే బౌలింగ్ కు దిగిన రకీం తన మూడోఓవర్ లోనే భారత వన్ డౌన్ ఆటగాడు చతేశ్వర్ పూజారాను పెవీలియన్ దారి పట్టించాడు. రకీం తొలిరోజుఆటలో మొత్తం 27 ఓవర్లు బౌల్ చేసి 8 మేడిన్ ఓవర్లతో 69 పరుగులిచ్చి ఒక వికెట్ సాధించాడు. ఐదురోజుల సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ ఆడాలంటే మితిమీరిన బరువు ఏమాత్రం అవరోధం కాదని..రెండు క్యాచ్ లు పట్టడం ద్వారా రకీం నిరూపించాడు.లోయర్ ఆర్డర్ లో వీరబాదుడు బ్యాట్స్ మన్ గా కూడా రకీం కార్న్ వాల్ కు గుర్తింపు ఉంది.
తిరిగి రెండేళ్ల విరామం తర్వాత భారత్ తోనే పోటీపడబోతున్నాడు.
ఇద్దరు యువఆటగాళ్లకు చోటు...
క్రెగ్ బ్రాత్ వెయిట్ నాయకత్వంలోని వెస్టిండీస్ జట్టులో ఇద్దరు యువఆటగాళ్లకు సైతం చోటు కల్పించారు. జమైకాకు చెందిన కిర్క్ మెకంజీ, డోమనికాకు చెందిన అలెక్ అత్నాజే లకు తొలిసారిగా టెస్టు జట్టులో అవకాశం కల్పించారు.
ఈ ఇద్దరూ ఎడమచేతి వాటం బ్యాటర్లే కావడం విశేషం. టాపార్డర్లో బ్యాటింగ్ తో పాటు ఆఫ్ స్పిన్ బౌలర్ గానూ అలిక్ అత్నాజే తనజట్టుకు సేవలు అందించనున్నాడు.
వెస్టిండీస్ -ఏ జట్టు తరపున నిలకడగా రాణిస్తూ వచ్చిన ఈ ఇద్దరి ఆటగాళ్లను ప్రతిభను గుర్తించి టెస్టుజట్టులో చేర్చినట్లు కరీబియన్ క్రికెట్ బోర్డు చీఫ్ సెలెక్టర్ డెస్మండ్ హేన్స్ ప్రకటించారు.
లెఫ్టామ్ స్పిన్నర్ జోమెల్ వారీకాన్ కు సైతం జట్టులో చోటు దక్కింది. రెండుమ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్టుకు డోమనికాలోని విండ్సర్ పార్క్, రెండోటెస్టుకు ట్రినిడాడ్ లోని క్వీన్స్ పార్క్ ఆతిథ్యమివ్వనున్నాయి.
తొలిటెస్టు జులై 12 నుంచి 5 రోజులపాటు జరుగనుంది. రెండోటెస్టు జులై 20 నుంచి 24 వరకూ నిర్వహిస్తారు.
ఇదీ వెస్టిండీస్ టెస్టు జట్టు...
క్రెగ్ బ్రాత్ వెయిట్ ( కెప్టెన్ ), జెర్మీన్ బ్లాక్ వుడ్ ( వైస్ కెప్టెన్ ), అలెక్ అత్నాజే, తేజ్ నరైన్ చంద్రపాల్, రకీం కార్నివాల్, జోషువా డా సిల్వా, షేనన్ గేబ్రియెల్, జేసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కిర్క్ మెకెంజీ, రేమోన్ రీఫర్, కేమర్ రోచ్, జోమెల్ వారికాన్, రిజర్వు ఆటగాళ్లుగా టెవిన్ ఇమ్లాక్, అకీమ్ జోర్డాన్.
భారతజట్టు తన కరీబియన్ టూర్ లో భాగంగా రెండుమ్యాచ్ ల టెస్టు, మూడుమ్యాచ్ ల వన్డే, ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ల్లో పాల్గోనుంది.
మూడుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండువన్డేలను బార్బోడోస్ వేదికగాను, ఆఖరి వన్డేను ట్రినిడాడ్ వేదికగాను నిర్వహిస్తారు.
ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి మూడు టీ-20 మ్యాచ్ లను ట్రినిడాడ్, గయానా వేదికలుగాను, ఆఖరి రెండు టీ-20 మ్యాచ్ లను అమెరికాలోని ఫ్లారిడా ( లాడెర్ హిల్ ) ఆగస్టు 12, 13 తేదీలలో నిర్వహిస్తారు.
భారత టెస్టు, వన్డే జట్లకు రోహిత్ శర్మ, టీ-20 జట్టుకు హార్థిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నారు.