2024 టీ-20 ప్రపంచకప్ లో తొలి హ్యాట్రిక్!

2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో తొలి హ్యాట్రిక్ నమోదయ్యింది. సూపర్- 8 తొలిరౌండ్ మ్యాచ్ లో ఆస్ట్ర్రేలియా కెప్టెన్ ఈ ఘనత సాధించాడు.

Advertisement
Update: 2024-06-21 08:08 GMT

2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో తొలి హ్యాట్రిక్ నమోదయ్యింది. సూపర్- 8 తొలిరౌండ్ మ్యాచ్ లో ఆస్ట్ర్రేలియా కెప్టెన్ ఈ ఘనత సాధించాడు.

టీ-20 ప్రపంచకప్ హ్యాట్రిక్ జాబితాలోకి సరికొత్తగా మరో రికార్డు వచ్చి చేరింది. అంటీగా లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన సూపర్-8 తొలిరౌండ్ మ్యాచ్ లో ప్రపంచ రెండోర్యాంకర్ ఆస్ట్ర్రేలియా కెప్టెన్ కమ్ ఓపెనింగ్ బౌలర్ పాట్ కమిన్స్ ఈ అరుదైన ఘనత సాధించాడు.

ప్రపంచకప్ చరిత్రలో 7వ హ్యాట్రిక్...

2007లో ప్రారంభమైన ఐసీసీ టీ-20 ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో 7వ హ్యాట్రిక్ నమోదు చేసిన బౌలర్ గా ఆస్ట్ర్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ నిలిచాడు. ప్రపంచ 9వ ర్యాంక్ జట్టు బంగ్లాదేశ్ తో జరిగిన సూపర్-8 రౌండ్ మ్యాచ్ లో..2వ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియా తరపున పాట్ కమిన్స్ ఓ ఓవర్ నాలుగు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా తన జట్టు విజయంలో ప్రధానపాత్ర వహించాడు.

భారత్, అప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న సూపర్ -8 గ్రూపు తొలిరౌండ్ పోరులో కీలక టాస్ నెగ్గిన కంగారూ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొని..బంగ్లాదేశ్ ను 20 ఓవర్లలో 8 వికెట్లకు 140 పరుగుల స్కోరుకే కట్టడి చేసింది.

బంగ్లా బ్యాటర్లలో సాంటో 41, తౌహీద్ హృదయ్ 40 పరుగుల మినహా మిగిలిన బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. లిట్టన్ దాస్ 16, స్టార్ ఆల్ రౌండర్ షకీబుల్ 8 పరుగుల స్కోర్లకే వెనుదిరిగారు. చివరకు బంగ్లాజట్టు 140 పరుగుల స్కోరు మాత్రమే చేయగలిగింది.

డెత్ ఓవర్లలో కమిన్స్ మ్యాజిక్....

డెత్ ఓవర్లలో బౌలింగ్ కు దిగిన కమిన్స్ ఆట 18వ ఓవర్ చివరి రెండు బంతుల్లో మహ్మదుల్లా, మెహిదీ హసన్ లను ..20వ ఓవర్ తొలి బంతికే తౌహిత్ హృదయ్ ను పడగొట్టడం ద్వారా ప్రపంచకప్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన ఆస్ట్ర్రేలియా రెండో ఫాస్ట్ బౌలర్ గా రికార్డుల్లో చేరాడు.

2007 ప్రారంభ ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ ప్రత్యర్థిగా బ్రెట్ లీ హ్యాట్రిక్ సాధించిన తరువాత..ప్రస్తుత 2024 ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ ప్రత్యర్థిగానే పాట్ కమిన్స్ సైతం హ్యాట్రిక్ నమోదు చేయడం విశేషం.

28 పరుగులతో నెగ్గిన ఆస్ట్ర్రేలియా..

141 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఆస్ట్ర్ర్రేలియాకు ఓపెనర్లు వార్నర్- హెడ్ మొదటి వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.

హెడ్ 28, మార్ష్ 1 పరుగు స్కోర్లకు అవుటయ్యారు. చివరకు వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి కంగారూజట్టు 11.2 ఓవర్లలో 2 వికెట్లకు 100 పరుగులతో పటిష్టమైన స్థితిలో నిలిచింది.

కుండపోతగా వానపడడంతో..మ్యాచ్ విజేతను డక్ వర్త్ - లూయిస్ విధానం ద్వారా మ్యాచ్ రిఫరీ నిర్ణయించారు. ఆస్ట్ర్రేలియా 28 పరుగుల తేడాతో తొలివిజయం నమోదు చేసింది. కంగారూజట్టు విజయంలో ప్రధానపాత్ర వహించిన హ్యాట్రిక్ హీరో కమిన్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

సూపర్-8 మిగిలిన రెండుమ్యాచ్ ల్లో అప్ఘనిస్థాన్, భారత్ జట్లతో ఆస్ట్ర్రేలియా పోటీపడాల్సి ఉంది.


Tags:    
Advertisement

Similar News