చీరలతోనే భారత మహిళా అథ్లెట్ల ఒలింపిక్ కవాతు!
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభవేడుకల కవాతులో భారత బృందంలోని మహిళా అథ్లెట్లు సాంప్రదాయ చీరకట్టుతో పాల్గోనున్నారు.
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభవేడుకల కవాతులో భారత బృందంలోని మహిళా అథ్లెట్లు సాంప్రదాయ చీరకట్టుతో పాల్గోనున్నారు.
భారత మహిళలకు చీరకట్టుకు అవినాభావ సంబంధం ఉంది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే మనదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళల చీరకట్టులోనూ వైవిద్యం కనిపిస్తుంది. చీరకట్టు లేని భారత మహిళలను ఊహించడం అసాధ్యం.
భారత సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే చీరలతో భారత మహిళా అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్ ప్రారంభవేడుకల్లో ప్రత్యేక ఆకర్షణకానున్నారు.
బ్లేజర్లు పోయే..చీరలు వచ్చే...
2018 కామన్వెల్త్ గేమ్స్ నుంచి భారత మహిళా అథ్లెట్లు చీరకట్టును పక్కనపెట్టి..బ్లేజర్లు, ట్రౌజర్లతో అంతర్జాతీయ క్రీడల ప్రారంభవేడుకల్లో పాల్గొంటూ వస్తున్నారు.
భారత్ కు ప్రాతినిథ్యం వహించే చాలామంది మహిళా అథ్లెట్లకు చీరసింగారింపు అలవాటు లేకపోడం, సమయం వృధా అన్న భావనతో గత ఎనిమిదేళ్లుగా చీరకట్టును పక్కన పెట్టారు.
అయితే..మరికొద్ది వారాలలో ప్రారంభంకానున్న పారిస్ ఒలింపిక్స్ ప్రారంభవేడుకల్లో పాల్గొనే భారత మహిళా అథ్లెట్ల బృందం' ఇకత్ ప్రింట్' చేనేత చీరెలు ధరించి పాల్గొంటారని భారత ఒలింపిక్స్ సంఘం ప్రకటించింది.
జాతీయ పతాకంలోని మువ్వన్నెలు ప్రతిబింబిచేలా..మూడురంగులతో ప్రత్యేకంగా నేసిన చేనేత చీరెలను భారత మహిళా అథ్లెట్ల కోసం సిద్ధం చేశారు. జులై 26 నుంచి మూడువారాలపాటు సాగే పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకే చీరకట్టుతో భారత మహిళా అథ్లెట్లు ప్రత్యేక ఆకర్షణకానున్నారు.
టై అండ్ డై టెక్నితో చెయ్యితిరిగిన నేతపనివారు..ఈ చీరెలను ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దినట్లు భారత బృందం ప్రతినిధి వివరించారు. భారత చరిత్ర, సంస్కృతి, పురాతన సాంప్రదాయలకు ఆధునికతను మేళవించి ఈ చీరెలను తయారు చేసినట్లు చెబుతున్నారు.
సీన్ నదీ తీరంలో ప్రారంభవేడుకలు...
ఒలింపిక్స్ లో పాల్గొనే 120 మంది సభ్యుల భారత అథ్లెట్ల బృందంలో 40 మందికి పైగా మహిళా అథ్లెట్లు ఉండే అవకాశం ఉంది. ఫ్రాన్స్ర్ రాజధాని పారిస్ నగరంలోని సీన్ నదీ తీరంలో 2024 ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలను నిర్వహించనున్నారు.
సాధారణంగా ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకలను ఇండోర్ స్టేడియాలలో నిర్వహించడం గత 100 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే ..ప్రస్తుత 2024 ఒలింపిక్స్ లో ఆ ఆనవాయితీని తప్పించి..నదీతీరంలో ప్రారంభవేడుకలను వినూత్నంగా నిర్వహించాలని ఫ్రెంచ్ ఒలింపిక్స్ సంఘం భావిస్తోంది.