పాతికేళ్ల కిందట ఇదే రోజు.. కుంబ్లే 10 వికెట్ల మాయాజాలం
ఫిబ్రవరి 7, 1999 అంటే సరిగ్గా పాతికేళ్ల కిందట.. ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా క్రికెట్ స్టేడియం.. భారత లెజండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే మహాద్భుతం చేశాడు.
ఫిబ్రవరి 7, 1999 అంటే సరిగ్గా పాతికేళ్ల కిందట.. ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా క్రికెట్ స్టేడియం.. భారత లెజండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే మహాద్భుతం చేశాడు.. అది అలాంటి ఇలాంటి అద్భుతం కాదు.. ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లూ తీసిన అద్భుతం. దాదాపు 150 ఏళ్ల చరిత్ర కలిగిన టెస్టుల్లో ఆ ఫీట్ సాధించిన రెండో బౌలర్ మన జంబోనే. ఆ తర్వాత పాతికేళ్లు గడిచినా ఇప్పటికీ మళ్లీ దాన్నెవరూ అందుకోలేకపోయారంటే అదెంత అరుదైన ఘనతో అర్థం చేసుకోవచ్చు.
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై స్వీట్ మెమరీ
ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా క్రికెట్ స్టేడియం (ఇప్పుడు అరుణ్ జైట్లీ స్టేడియం)లో చిరకాల ప్రత్యర్థితో పాకిస్థాన్‌తో టెస్ట్ మ్యాచ్. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ చితక్కొట్టేస్తోంది. సయీద్ అన్వర్, షాహిద్ అఫ్రిదిల జోడ ఓపెనింగ్ పార్టనర్ షిప్ 100 దాటేసింది. అప్పడు మొదలైంది కుంబ్లే మాయాజాలం. అన్వర్, అఫ్రిదిలతోపాటు ప్రతి పాకిస్థాన్ వికెట్టూ తానే తీసి చరిత్ర సృష్టించాడు. 212 పరుగులకే పాకిస్థాన్‌ను కుప్పకూల్చి దస్ కా ధమ్ చూపించాడు.
చరిత్రలో ఇద్దరు
కుంబ్లే కంటే ముందు ఇంగ్లాండ్ బౌలర్ జిమ్ లేకర్ 1956లో ఆస్ట్రేలియాపై ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి ఈ ఘనత సాధించాడు. తర్వాత 43 ఏళ్లకు కుంబ్లే ఆ ఫీట్ చేయగలిగాడు. ఆతర్వాత మరో పాతికేళ్లు గడిచినా ఎవరూ ఆ రికార్డు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు.