ఆసీస్ ప్రధాని నివాసంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్..హాజరైన భారత్ ఆటగాళ్లు
ఆస్ట్రేలియా ప్రధాని నివాసంలో న్యూ ఇయర్ వేడుకలకు టీమిండియా ఆటగాళ్లు హాజరయ్యారు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ కోసం ఆసీస్‌లో పర్యటిస్తున్న భారత్ ఆటగాళ్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ నివాసంలో ఏర్పాటు చేసిన న్యూతన సంవత్సర వేడుకలకు పార్టీకి హాజరయ్యారు. ఈ పార్టీకి టీమిండియా ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ విందు కార్యక్రమం దాదాపు గంటన్నర పాటు సాగింది. ఆసీస్ ప్రధాని అల్బనీస్ టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో ముచ్చటించడం కనిపించింది. ఈ సందర్భంగా అల్బనీస్ ఎంతో సరదా వ్యాఖ్యలు చేశారు. "బుమ్రా... నువ్వు బౌలింగ్ కు వస్తున్నావంటే ఎంతో ఆసక్తి గా అనిపిస్తుందన్నారు.
అందుకే ఓ చట్టం చేయాలనుకుంటున్నాం... నువ్వు ఎడమ చేత్తోనే బౌలింగ్ చేయాలి, లేదా, ఒక అడుగు కూడా వేయకుండా బౌలింగ్ చేయాలి" అంటూ ప్రధాని చమత్కరించారు. ప్రధాని అల్బనీస్ నివాసంలో జరిగిన ఈ న్యూ ఇయర్ వేడుకలో ఆసీస్ ఆటగాళ్లు కూడా పాల్గొన్నారు. ఆసీస్ యువ ఆటగాడు సామ్ కొన్ స్టాస్ తన ఆరాధ్య ఆటగాడు విరాట్ కోహ్లీతో ఓ ఫొటో కూడా దిగినట్టు తెలుస్తోంది. మెల్బోర్న్ టెస్టుతో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన యువ ఆటగాడు కొన్ స్టాస్... దూకుడుగా ఆడి అలరించాడు. అయితే, కోహ్లీ ఉద్దేశపూర్వకంగా కొన్ స్టాస్ ను ఢీకొట్టి జరిమానాకు గురయ్యాడు.