వరల్డ్ కప్ ఫైనల్‌లో మెస్సీ చేసిన గోల్‌పై వివాదం.. ఇప్పుడు ఏం జరుగబోతోంది!

మ్యాచ్ 108వ నిమిషంలో మార్టినెజ్ కొట్టిన బంతిని ఫ్రాన్స్ గోల్ కీపర్ హుగో లోరిస్‌ను తాకి వెనక్కు వచ్చింది. అయితే అక్కడే ఉన్న మెస్సీ దాన్ని తన్ని గోల్‌ పోస్టులోకి పంపాడు.

Advertisement
Update:2022-12-20 21:24 IST

ఫిఫా వరల్డ్ కప్-2022 ఫైనల్స్ ఆదివారం రాత్రి అర్జెంటీనా-ఫ్రాన్స్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన విషయం తెలిసిందే. నువ్వా నేనా అన్న రీతిలో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు పెనాల్టీ షూటౌట్ ద్వారా విశ్వవిజేతగా నిలిచింది. 36 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనా.. కప్పుతో స్వదేశానికి చేరుకున్నది. అయితే, ఈ మ్యాచ్‌లో మెస్సీ చేసిన రెండో గోల్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. నిర్ణీత సమయంలోగా రెండు జట్లు 2-2 గోల్స్‌తో సమానంగా ఉండటంతో అదనపు సమయాన్ని కేటాయించారు.

ఎక్స్‌ట్రా టైం రెండో అర్థ భాగంలో మెస్సీ అర్జెంటీనాకు మూడో గోల్ అందించారు. ఇది మ్యాచ్‌లో మెస్సీకి రెండో గోల్. మ్యాచ్ 108వ నిమిషంలో మార్టినెజ్ కొట్టిన బంతిని ఫ్రాన్స్ గోల్ కీపర్ హుగో లోరిస్‌ను తాకి వెనక్కు వచ్చింది. అయితే అక్కడే ఉన్న మెస్సీ దాన్ని తన్ని గోల్‌ పోస్టులోకి పంపాడు. అది నెట్‌కు తాకకపోయినా.. లైన్ దాటింది కాబట్టి అర్జెంటీనాకు ఒక గోల్ వచ్చింది. ఇప్పుడు ఈ గోల్ పైనే వివాదం చెలరేగుతోంది.

మెస్సీ గోల్ చేసే సమయంలో డగౌట్‌లో ఉన్న అర్జెంటీనా రిజర్వ్ ఆటగాళ్లు మైదానంలోకి అడుగు పెట్టారు. అప్పటికి మెస్సీ కొట్టిన బంతి గోల్ పోస్టు లైన్ దాటలేదు. ఫిఫా నిబంధనల ప్రకారం ఏదైనా జట్టు ఆటగాడు గోల్ చేసే సమయంలో.. అదే జట్టుకు చెందిన ఆటగాళ్లు, సబ్‌స్టిట్యూట్‌లు, అధికారులు మైదానంలోకి వస్తే రిఫరీ ఆ గోల్‌ను అంగీకరించరు. గోల్ కొట్టిన తర్వాత తిరిగి ఆటను ప్రారంభించే లోపు రిఫరీ ఈ విషయాన్ని గుర్తిస్తే సదరు గోల్‌ను రద్దు చేసే అవకాశం ఉంటుంది.

కాగా, ఫైనల్‌లో అర్జెంటీనా-ఫ్రాన్స్ మ్యాచ్‌కు లైన్ రిఫరీగా వ్యవహరించిన సైమన్ మార్సినెక్ ఈ విషయాన్ని గమనించలేదు. అతడు మ్యాచ్‌ను చూస్తూ ఉండిపోయాడు. అంతే కాకుండా మ్యాచ్ అధికారులు కూడా అంత ఉత్కంఠతలో ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయారు. దీంతో ఆ గోల్ రద్దు కాకుండా పోయింది.



 

ఒక వేళ ఆ గోల్‌ను రిఫరీలు రద్దు చేసి ఉంటే.. అర్జెంటీనా వరల్డ్ కప్ గెలిచేదో లేదో అనేది అనుమానమే. అయితే ఇప్పుడు ఈ విషయంపై ఫ్రాన్స్ జట్టు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నది. కానీ, మ్యాచ్ ఫలితంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. అర్జెంటీనా ప్రపంచ విజేత అనే విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోనక్కరలేదు. కేవలం మ్యాచ్ రిఫరీలు, అధికారులకు మాత్రం మెమోలు జారీ చేసే అవకాశం ఉంటుందని యూరో స్పోర్ట్స్ అనే పత్రిక పేర్కొన్నది.

Tags:    
Advertisement

Similar News