అర్జెంటీనా సాకర్ దిగ్గజం సరికొత్త చరిత్ర!
ప్రపంచ సాకర్ ఆధునిక ఫుట్ బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ లయనల్ మెస్సీ మరో అరుదైన ప్రపంచ రికార్డు సాధించాడు.
ప్రపంచ సాకర్ ఆధునిక ఫుట్ బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ లయనల్ మెస్సీ మరో అరుదైన ప్రపంచ రికార్డు సాధించాడు. తనజట్టును కోపా అమెరికా కప్ ఫైనల్స్ చేర్చడం ద్వారా ఈ ఘనత సంపాదించాడు.
ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలోనే ఇప్పటి వరకూ మరే ఆటగాడూ సాధించలేని రికార్డును అర్జెంటీనా కెప్టెన్ లయనల్ మెస్సీ నమోదు చేశాడు. 38 సంవత్సరాల వయసులోనే ఈ ఘనత సాధించాడు.
బ్రెజిల్ జోడీని మించిన మెస్సీ...
ప్రపంచ ఆధునిక ఫుట్ బాల్ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా రికార్డుల మోత మోగిస్తున్న లయనల్ మెస్సీ నాయకుడుగా అర్జెంటీనాను వరుసగా రెండోసారి కోపా అమెరికా ఫుట్ బాల్ ఫైనల్స్ కు చేర్చాడు.
2021లో అర్జెంటీనాకు కోపా అమెరికా కప్ ట్రోఫీ అందించిన మెస్సీ..ఆ తరువాత విశ్వఫుట్ బాల్ విజేతగా కూడ నిలిపాడు. అంతటితో ఆగిపోకుండా..అమెరికా వేదికగా జరుగుతున్న 2024 కోపా అమెరికా కప్ టోర్నీలో సైతం అర్జెంటీనాను టైటిల్ రౌండ్ కు చేర్చగలిగాడు.
కెనడాతో జరిగిన తొలి సెమీఫైనల్లో అర్జెంటీనా 2-0 గోల్స్ తో నెగ్గడంలో మెస్సీ ప్రధానపాత్ర పోషించాడు. జూనియర్ అల్వారెజే, లయనల్ మెస్సీ చెరో గోలు సాధించడంతో అర్జెంటీనా వరుసగా రెండోసారి కోపా అమెరికా టైటిల్ రౌండ్లో అడుగుపెట్టగలిగింది.
మియామీలోని హార్డ్ రాక్ స్టేడియం వేదికగా ఈనెల 14న జరిగే టైటిల్ పోరులో కొలంబియాతో అర్జెంటీనా అమీతుమీ తేల్చుకోనుంది.
7వ అంతర్జాతీయ టోర్నీ ఫైనల్స్ లో మెస్సీ...
2024 కోపా అమెరికా కప్ ఫైనల్స్ కు అర్జెంటీనా చేరడంతోనే మెస్సీ పేరుతో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదయ్యింది. ఏడు అంతర్జాతీయ ఫుట్ బాల్ చాంపియన్షిప్ లో పాల్గొన్న ఒకే ఒక్క ఆటగాడిగా మెస్సీ చరిత్ర సృష్టించనున్నాడు.
తన కెరియర్ లో ఐదవసారి కోపా కప్ ఫైనల్స్ ఆడనున్న మెస్సీకి 2007, 2015, 2016, 2021 టోర్నీల ఫైనల్స్ ఆడిన రికార్డు ఉంది. అంతేకాదు 2014, 2022 ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీల ఫైనల్స్ లోనూ మెస్సీ పాల్గొన్నాడు.
ఇప్పటి వరకూ బ్రెజిల్ దిగ్గజ జోడీ కఫు, కార్లోస్ ల పేరుతో ఉన్న ఆరు అంతర్జాతీయ ఫుట్ బాల్ టోర్నీల రికార్డును మెస్సీ 7 టోర్నీలతో అధిగమించగలిగాడు.
ఆదివారం జరిగే ఫైనల్స్ లో అర్జెంటీనా విజేతగా నిలువగలిగితే..కోపా అమెరికా కప్ ను 16వసారి అందుకోగలుగుతుంది.
ప్రపంచ ఫుట్ బాల్ లోనే అత్యంత పురాతన ఫుట్ బాల్ టోర్నీలలో ఒకటిగా పేరున్న కోపా అమెరికా కప్ ను కేవలం దక్షిణ అమెరికా దేశాలజట్ల కోసమే నిర్వహించేవారు. అయితే..గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా, కెనడాజట్లు సైతం కోపా అమెరికాకప్ లో పాల్గొనగలుగుతున్నాయి.