భారత టెస్టుజట్టులో 12 ఏళ్ళ తర్వాత ఉనద్కత్ కు చోటు!
బంగ్లాదేశ్ తో రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో పాల్గొనే భారత టెస్టుజట్టులో వెటరన్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ కు చోటు దక్కింది. గాయంతో జట్టుకు దూరమైన షమీ స్థానంలో ఉనద్కత్ కు చాన్స్ దొరికింది.
బంగ్లాదేశ్ తో రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో పాల్గొనే భారత టెస్టుజట్టులో వెటరన్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ కు చోటు దక్కింది. గాయంతో జట్టుకు దూరమైన షమీ స్థానంలో ఉనద్కత్ కు చాన్స్ దొరికింది...
సౌరాష్ట్ర్ర కెప్టెన్, వెటరన్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ కు పుష్కరకాలం తర్వాత భారత టెస్టుజట్టులో చోటు దక్కింది. ఐసీసీ టెస్టులీగ్ లో భాగంగా ఈ నెల 14 నుంచి
బంగ్లాదేశ్ తో జరుగనున్న రెండుమ్యాచ్ ల సిరీస్ లో పాల్గొనే భారతజట్టులో 31 సంవత్సరాల ఉనద్కత్ పాల్గోనున్నాడు.
సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ భుజం గాయంతో జట్టుకు అందుబాటులో లేకపోడంతో..ఉనద్కత్ కు అవకాశం కల్పించారు.
పట్టువదలని విక్రమార్కుడు..
దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తూ పదేపదే సత్తా చాటుకొంటూ వస్తున్న వెటరన్ జయదేవ్ ఉనద్కత్ ను 12 సంవత్సరాల సుదీర్ఘవిరామం తర్వాత బీసీసీఐ ఎంపిక సంఘం కరుణించింది.
2010 దక్షిణాఫ్రికా సిరీస్ లో భాగంగా సెంచూరియన్ పార్క్ వేదికగా జరిగిన టెస్టుమ్యాచ్ లో మాత్రమే ఆడిన అనుభవం ఉనద్కత్ కు ఉంది. లైన్ అండ్ లెంగ్త్ తో కుదురుగా బౌల్ చేసే ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ గా ఉనద్కత్ కు పేరుంది. 2010 తర్వాత నుంచి బీసీసీఐ తనను పట్టించుకోకున్నా ఉనద్కత్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా
దేశవాళీ క్రికెట్ టోర్నీలలో పాల్గొంటూ నిలకడగా రాణిస్తూ వస్తున్నాడు. ఐపీఎల్ లో సైతం తానేమిటో నిరూపించుకొంటూ తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.
దేశవాళీ క్రికెట్లో సౌరాష్ట్ర్ర జట్టుకు నాయకుడిగా వ్యవహరిస్తున్న ఉనద్కత్ ఇటీవలే ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో కేవలం తన బౌలింగ్ ప్రతిభతోనే తనజట్టును విజేతగా నిలిపాడు. ప్రస్తుత సీజన్లో భాగంగా ఆడిన మొత్తం 10 మ్యాచ్ ల్లో 19 వికెట్లు పడగొట్టడం ద్వారా నంబర్ వన్ బౌలర్ గా నిలిచాడు.
7 వన్డేలు, 10 టీ-20 మ్యాచ్ లు...
12 సంవత్సరాల క్రితమే భారత టెస్ట్ క్యాప్ అందుకొన్న ఉనద్కత్ కు 7 వన్డేలు, 10 టీ-20 మ్యాచ్ లు ఆడిన రికార్డు ఉంది. తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 96 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 353 వికెట్లు పడగొట్టిన ఘనత సైతం ఉంది.
భారత టీమ్ మేనేజ్ మెంట్ నుంచి పిలుపు రావడంతో రాజ్ కోట నుంచే వీసా పేపర్లు నింపే పనిలో ఉనద్కత్ మునిగిపోయాడు. బంగ్లాదేశ్ తో డిసెంబర్ 14 నుంచి చిట్టగాంగ్, మీర్పూర్ వేదికలుగా రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ జరుగనుంది. ఈ రెండుమ్యాచ్ ల్లోనూ ఉనద్కత్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.
దేశవాళీ క్రికెట్లో సౌరాష్ట్ర్ర జట్టుకు సారథిగా రంజీట్రోఫీని, విజయ్ హజారే ట్రోఫీలను అందించిన ఉనద్కత్ తన కెరియర్ లో రెండోటెస్టు మ్యాచ్ కోసం కొండంత ఆశతో ఎదురుచూస్తున్నాడు.
స్టార్ బౌలర్లు జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, స్వింగ్ బౌలర్ దీపక్ చహార్ గాయాలతో జట్టుకు దూరం కావడంతో..ఉమ్రాన్ మాలిక్, నవదీప్ సైనీ లాంటి పలువురు బౌలర్లు అందుబాటులో ఉన్నా..అనుభవజ్ఞుడైన జయదేవ్ ఉనద్కత్ వైపే భారత టీమ్ మేనేజ్ మెంట్ మొగ్గు చూపింది.
బంగ్లాదేశ్ తో భారత తొలిటెస్టుమ్యాచ్ చోటాగ్రామ్ వేదికగా డిసెంబర్ 14 నుంచి 18 వరకూ, రెండోటెస్టుమ్యాచ్ మీర్పూర్ నేషనల్ స్టేడియం వేదికగా డిసెంబర్ 22 నుంచి 26 వరకూ జరుగనున్నాయి.