అమిత్ షా తనయుడికి ఐసీసీ అందలం!

భారత హోంమంత్రి అమిత్ షా తనయుడు చరిత్ర సృష్టించారు.అతిచిన్నవయసులోనే ఐసీసీ చైర్మన్ పదవిని సాధించడం ద్వారా భారత క్రికెట్ సత్తాను చాటారు...

Advertisement
Update: 2024-08-30 05:40 GMT

భారత హోంమంత్రి అమిత్ షా తనయుడు చరిత్ర సృష్టించారు.అతిచిన్నవయసులోనే ఐసీసీ చైర్మన్ పదవిని సాధించడం ద్వారా భారత క్రికెట్ సత్తాను చాటారు...

ప్రపంచంలోనే అత్యంతభాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డులో గత ఐదేళ్లుగా చక్రం తిప్పుతున్న గుజరాతీ బ్రాండ్ యువకుడు జే షా పేరు వినగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరు గుర్తుకు రావడం సహజం. అమితా షా తనయుడిగా గుజరాత్ క్రికెట్ సంఘంలోకి అడుగుపెట్టి..అతికొద్దిసంవత్సరాలలోనే బీసీసీఐ నుంచి ఐసీసీ స్థాయికి ఎదిగిన ఘనత 35 సంవత్సరాల జే షాకు మాత్రమే దక్కుతుంది.

ఐసీసీ చైర్మన్ గా సరికొత్త రికార్డు...

ప్రపంచ క్రికెట్ వ్యవహారాలను పర్యవేక్షించే ఐసీసీ ( అంతర్జాతీయ క్రికెట్ మండలి ) అత్యున్నత పదవిని దక్కించుకోడం అంటే మాటలుకాదు. ఇంగ్లండ్, ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి దేశాల క్రికెట్ బోర్డుల నుంచి గట్టిపోటీ ఎదుర్కొనాల్సి ఉంటుంది. గతంలో ఐసీసీ చైర్మన్ పదవి సాధించిన ఘనత బారత్ కు చెందిన శశాంక్ మనోహర్ కు మాత్రమే ఉంది. ఆ తరువాత ఐసీసీ చైర్మన్ పదవిని సాధించిన ఘనత జే షాకు మాత్రమే దక్కుతుంది.

ఐసీసీ చైర్మన్ పదవి కోసం ఇటీవలే జరిగిన ఎన్నికలో జే షా 15 ఓట్లు సాధించడం ద్వారా సఫలం కాగలిగారు. డిసెంబర్ లో అధికారికంగా బార్క్ లే నుంచి ఐసీసీ అధ్యక్ష పగ్గాలు అందుకోనున్నారు. కేవలం 35 సంవత్సరాల వయసులోనే ఐసీసీ అధ్యక్షపదవికి ఎంపికైన రికార్డును జే షా సాధించారు.

అంచెలంచెలుగా....

తొలిదశలో గుజరాత్ క్రికెట్ సంఘం వ్యవహారాలలో చురుకైన పాత్ర పోషించడం ద్వారా జే షా సత్తా చాటుకోగలిగారు. దశాబ్దకాలం క్రితం కేంద్రంలో బీజెపీ అధికారంలోకి రావడంతో జే షా దశ ఒక్కసారిగా తిరిగిపోయింది. తండ్రి కేంద్ర హోంమంత్రి కూడా కావడం జే షాకు కలసి వచ్చింది. గుజరాత్ క్రికెట్ సంఘం నుంచి కీలక బీసీసీఐ కార్యదర్శి పదవిని చేపట్టడం ద్వారా జే షా ఉన్నతస్థాయికి చేరుకోగలిగారు.

తన పనితీరుతో భారత్ ను మరింత అత్యంతధనికవంతమైన క్రికెట్ బోర్డుగా తీర్చి దిద్దారు. ఐపీఎల్ ప్రసారహక్కుల తాజా వేలం ద్వారా రాబడిని ఇబ్బడిముబ్బడిగా పెంచారు. కేవలం ఐదేళ్ల కాలానికి ప్రసారహక్కులు, డిజిటల్ మీడియా హక్కుల విక్రయం ద్వారా 5వేల కోటకు పైగా ఆదాయాన్ని బీసీసీఐకి ఆర్జించి పెట్టారు.

ఆసియా క్రికెట్ మండలి చైర్మన్ గా..

ఓ వైపు బీసీసీఐ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ..మరోవైపు ఆసియాక్రికెట్ మండలి వ్యవహారాలను సైతం సమర్థవంతంగా నడుపుతూ వచ్చారు. బీసీసీఐ కార్యదర్శి హోదాలో మహిళా ఐపీఎల్ కు శ్రీకారం చుట్టారు. పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు, ఇతర సదుపాయాలు కల్పించడంలో ప్రధానపాత్ర పోషించారు.

2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ ను అత్యంత సమర్థవంతంగా , లాభసాటిగా నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్ వర్గాలలో తన పలుకుబడిని పెంచుకోగలిగారు.

సాంప్రదాయ టెస్టు క్రికెట్ పరిరక్షణ కోసం బీసీసీఐ, ఐసీసీ ద్వారా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయటంలోనూ జే షా కృషి అంతాఇంతాకాదు.

గుజరాతీ వ్యాపారవేత్తల తెలివితేటలను భారత క్రికెట్ వ్యవహారాలలో చొప్పించడం ద్వారా జే షా సఫలం కాగలిగారు. ఇప్పుడు ప్రపంచమంతా భారత క్రికెట్ బోర్డు వైపే చూసేలా ప్రముఖపాత్ర పోషించారు.

అమెరికా, కరీబియన్ ద్వీపాలు వేదికగా ముగిసిన 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో భారత్ ను విజేతగా నిలపడంలో జే షా దూరదృష్టి అంతాఇంతాకాదు. వన్డే ప్రపంచకప్ ఫైనల్లో సఫలం కాలేకపోయిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన శిక్షకుడు రాహుల్ ద్రావిడ్ ల పదవీకాలాన్ని టీ-20 ప్రపంచకప్ వరకూ కొనసాగించడం ద్వారా అనుకొన్న లక్ష్యాలను సాధించగలిగారు.

జే షాకు తప్పని విమర్శలు...

కేంద్రహోంమంత్రిగా, బీజేపీలో శక్తిమంతమైన నాయకుడిగా ఉన్న తనతండ్రి పలుకుబడి, అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేలకోట్ల రూపాయల ఆదాయం కలిగిన భారత క్రికెట్ బోర్డు లో చక్రం తిప్పుతూ పాతుకుపోడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజవాదీ పార్టీల నాయకులు దుమ్మెత్తి పోస్తున్నారు. తనతండ్రి పలుకుబడే అర్హతగా భారత్ క్రికెట్ ను గుజరాత్ లాబీలోకి తీసుకు వచ్చారంటూ చురకలు అంటిస్తున్నారు.

అయితే..ప్రతిపక్షాలు, ప్రత్యర్థుల విమర్శలు ఏమాత్రం పట్టించుకోకుండా తనపనిని తాను చేసుకొంటూ..అత్యున్నత ఐసీసీ చైర్మన్ పదవిని చేరుకోగలగడం గొప్పవిషయం కాక మరేమిటి..

Tags:    
Advertisement

Similar News