విరాట్ కొహ్లీకి ఇదేమి శాపం?

ఐపీఎల్ 17వ సీజన్లో సైతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుస పరాజయాల పరంపర కొనసాగుతోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ పరుగుల మోత మోగిస్తున్నా జట్టు తలరాత ఏమాత్రం మారడం లేదు.

Advertisement
Update:2024-04-07 13:36 IST

ఐపీఎల్ 17వ సీజన్లో సైతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుస పరాజయాల పరంపర కొనసాగుతోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ పరుగుల మోత మోగిస్తున్నా జట్టు తలరాత ఏమాత్రం మారడం లేదు.

ఐపీఎల్ ఆల్ టైమ్ గ్రేట్ బ్యాటర్ విరాట్ కొహ్లీ పరుగుల వెల్లువెత్తిస్తున్నా..శతకం బాదినా విమర్శలు మాత్రం తప్పడం లేదు. ప్రస్తుత 17వ సీజన్లో సైతం బెంగళూరు పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. గత ఐదుమ్యాచ్ ల్లో వరుసగా నాలుగో ఓటమితో రాయల్ చాలెంజర్స్ ఉక్కిరిబిక్కిరవుతోంది.

నత్తనడక సెంచరీతో

ప్రస్తుత ఐపీఎల్ మొదటి ఐదురౌండ్ల మ్యాచ్ ల్లోనే విరాట్ కొహ్లీ ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో ..300కు పైగా పరుగులు సాధించడమే కాదు..ఆరెంజ్ క్యాప్ సాధించినా..

బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కు ఒరిగింది ఏమీలేకుండా పోయింది.

జైపూర్ సవాయి మాన్ సింగ్ స్టేడియం వేదికగా మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన 5వ రౌండ్ పోరులో విరాట్ కొహ్లీ నత్తనడక ( 67బంతుల) సెంచరీతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల పరాజయంతో చతికిల పడింది.

క్రికెట్ అంటే..జట్టులోని 11 మంది ఆటగాళ్లు కలసి ఆడితేనే విజయం సాధ్యమని..కేవలం ఒక్కరి వల్ల కాదని మరోసారి తేలిపోయింది. ఓపెనింగ్ జోడీ డూప్లెసిస్- విరాట్ కొహ్లీ మొదటి వికెట్ కు సెంచరీ భాగస్వామ్యంతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చినా...విరాట్ 67 బంతుల్లో నత్తనడక సెంచరీ సాధించినా బెంగళూరుకు ఓటమి తప్పలేదు.

రాజస్థాన్ రాయల్స్ ప్రత్యర్థిగా విరాట్ కు ఇదే తొలిశతకం, ఐపీఎల్ లో 8వ శతకం కాగా..తన కెరియర్ లో సాధించిన నత్తనడక సెంచరీగా నమోదయ్యింది.

విరాట్ మొత్తం 72 బంతులు ఎదుర్కొని 4 సిక్సర్లు, 12 ఫోర్లతో 113 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడంతో ప్రత్యర్థి రాజస్థాన్ ఎదుట బెంగళూరు 184 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది.

సమాధానంగా 184 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికే లక్ష్యం చేరడం ద్వారా వరుసగా నాలుగో విజయంతో లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచింది.

ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ డకౌట్ కాగా...కెప్టెన్ సంజు శాంసన్ తో కలసి మరో ఓపెనర్ జోస్ బట్లర్ రెండో వికెట్ కు 148 పరుగుల భాగస్వామ్యంతో విజయం ఖాయం చేశాడు.

సంజు శాంసన్ 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులకు అవుట్ కాగా..బట్లర్ 58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచాడు.

ఐపీఎల్ లో బట్లర్ కు ఇది ఆరవ శతకం కాగా...ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

మనీశ్ పాండే సరసన విరాట్...

2008 నుంచి 2024 వరకూ ఐపీఎల్ చరిత్రలో అతి ఎక్కువ బంతులు ఎదుర్కొని నత్తనడకన సాధించిన సెంచరీ రికార్డు ఇప్పటి వరకూ బెంగళూరుకే చెందిన మనీశ్ పాండే పేరుతో ఉంది. 2009 సీజన్లో మనీశ్ 67 బంతులు ఎదుర్కొని సెంచరీ సాధించగా..ప్రస్తుత 2024 సీజన్లో బెంగళూరుకే చెందిన విరాట్ కొహ్లీ సైతం 67 బంతుల్లోనే శతకం బాదడం ద్వారా చెత్తరికార్డును మూటగట్టుకోవాల్సి వచ్చింది.

66 బంతుల్లో శతకాలు బాదిన వారిలో సచిన్ టెండుల్కర్, బట్లర్, డేవిడ్ వార్నర్ ఉన్నారు.

ఐపీఎల్ చరిత్రలోనే విరాట్ కొహ్లీ అత్యధికంగా 8 శతకాలు బాదిన బెంగళూరు బ్యాటర్ కాగా..క్రిస్ గేల్ 6 సెంచరీలతో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు.

టీ-20 చరిత్రలో అత్యధికంగా 11 సెంచరీలు బాదిన ఘనత పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ పేరుతో ఉంది. విరాట్ కొహ్లీ 9 సెంచరీలతో రెండోస్థానంలో ఉన్నాడు.

విరాట్ తన జట్టు విజయం కోసం కంటే..వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడుతున్నాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విరాట్ పరుగుల మోత మోగించినా..సెంచరీ సాధించినా..బెంగళూరుకు పరాజయాలు తప్పక పోడం ఓ శాపంగా మారింది.


Tags:    
Advertisement

Similar News