ఐపీఎల్ -16లో 200 స్కోర్ల వెల్లువ!
ఐపీఎల్ -16 సీజన్ మొదటి 20 రోజుల్లో జరిగిన 26 మ్యాచ్ ల్లో 12సార్లు 200కు పైగా స్కోర్లు నమోదు కావడం విశేషం.
ఐపీఎల్ -16వ సీజన్ సమరం అత్యున్నత ప్రమాణాలు, అరుదైన రికార్డుల కలబోతతో ఉత్కంఠభరితంగా సాగిపోతున్నాయి. మొదటి 26 మ్యాచ్ ల్లో 26 మంది వేర్వేరు ఆటగాళ్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకోడం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది...
దేశంలోని 12 నగరాలు వేదికగా 10 జట్ల నడుమ జరుగుతున్న 70 మ్యాచ్ ల ఐపీఎల్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ సమరం ఉత్కంఠను పెంచుతూ సాగిపోతోంది.
జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్- లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ముగిసిన 26వ మ్యాచ్ వరకూ పలు అరుదైన రికార్డులు నమోదయ్యాయి.
200 స్కోర్లలో అరుదైన రికార్డు..
ఐపీఎల్ -16 సీజన్ మొదటి 20 రోజుల్లో జరిగిన 26 మ్యాచ్ ల్లో 12సార్లు 200కు పైగా స్కోర్లు నమోదు కావడం విశేషం. గత 15 సీజన్ల టోర్నీ చరిత్రలో ఇలాంటి రికార్డు నమోదు కావడం ఇదే మొదటిసారి.
భారీలక్ష్యచేధనకు దిగిన జట్లు సైతం ఐదుసార్లు 200కు పైగా పరుగులు సాధించడం మరో రికార్డు.
ఏప్రిల్ 14న కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన పోరులో హైదరాబాద్ సన్ రైజర్స్ సాధించిన 228 పరుగులే ఇప్పటి వరకూ సీజన్ అత్యధిక స్కోరుగా ఉంది.
ఏప్రిల్ 17న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ తో జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ 226 పరుగులతో రెండో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది.
ఇదే మ్యాచ్ లో రెండుజట్లూ కలసి 444 పరుగులు సాధించడం మరో రికార్డుగా నమోదయ్యింది. మొదటి 26 మ్యాచ్ ల్లో ఐదింట సగటున 400కు పైగా స్కోర్లు నమోదు కావడం కూడా ఇదే తొలిసారి.
ఒకేమ్యాచ్ లో 4 క్యాచ్ ల రికార్డు..
ఒక్క మ్యాచ్ లో ఒకే ఆటగాడు నాలుగు క్యాచ్ లు పట్టడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ తో ముగిసిన 25వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఫీల్డర్ టిమ్ డేవిడ్ ఒక్కడే నాలుగు క్యాచ్ లు అందుకొని..గతంలో ముంబై తరపున ఇదే ఘనత సాధించిన మాస్టర్ సచిన్ టెండుల్కర్ సరసన నిలిచాడు.
2008లో కోల్ కతా నైట్ రైడర్స్ ప్రత్యర్థిగా ముంబై తరపున సచిన్ 4 క్యాచ్ లు పడితే..15 సంవత్సరాల విరామం తర్వాత 4క్యాచ్ లు పట్టిన మరో ముంబై ఫీల్డర్ గా టిమ్ డేవిడ్ రికార్డుల్లో చేరాడు.
ఒక్క మ్యాచ్ లో 33 సిక్సర్లు...
బెంగళూరు రాయల్ చాలెంజర్స్- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల నడుమ జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్లో 33 సిక్సర్లు నమోదయ్యాయి. చెన్నై 17 సిక్సర్లు బాదితే..బెంగళూరు 16 సిక్సర్లు సాధించింది.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు నమోదైన మూడోమ్యాచ్ గా ఈపోరు రికార్డుల్లో చోటు చేసుకొంది. 2020లో షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్ - చెన్నై సూపర్ కింగ్స్,
2018లో చెన్నై సూపర్ కింగ్స్- బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్ల నడుమ జరిగిన మ్యాచ్ ల్లో సైతం 33 సిక్సర్లు నమోదయ్యాయి.
మొదటి ఐదురౌండ్ల మ్యాచ్ ల్లో బెంగళూరు కెప్టెన్ డూప్లెసీ 19, ఆల్ రౌండర్ మాక్స్ వెల్ 16 సిక్సర్లతో అత్యధిక సిక్సర్లు బాదిన మొదటి ఇద్దరు బ్యాటర్లుగా కొనసాగుతున్నారు.
ఇక..అత్యధిక సిక్సర్లు బాదించుకున్న బౌలర్ గా ముంబై లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా ఓ చెత్త రికార్డును మూటకట్టుకొన్నాడు. పియూష్ ఏకంగా 185 సిక్సర్లు సమర్పించుకొన్నాడు.
6వేల పరుగుల మొనగాడు రోహిత్ శర్మ..
ఐపీఎల్ లో 6వేల పరుగుల మైలురాయిని చేరిన నాలుగో క్రికెటర్ గా ముంబై ఇండియన్స్ ఓపెనర్ కమ్ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల్లో చేరాడు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ తో జరిగిన పోటీలో ముంబై తరపున ముందుగా బ్యాటింగ్ కు దిగిన రోహిత్ 14 పరుగుల స్కోరు చేయడం ద్వారా 6వేల పరుగులు సాధించిన మరో ముగ్గురు మొనగాళ్ల సరసన నిలువగలిగాడు.
2008 నుంచి క్రమం తప్పకుండా ఐపీఎల్ లో పాల్గొంటూ వస్తున్న రోహిత్ 28 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. దీంతో 6వేల 14 పరుగులు సాధించినట్లయ్యింది.
రోహిత్ ప్రస్తుత సీజన్ 5వ రౌండ్ వరకూ 231 మ్యాచ్ లు ఆడి ఓ సెంచరీ, 41 హాఫ్ సెంచరీలతో ఈ ఘనతను సాధించాడు.
రోహిత్ కంటే ముందుగా 6వేల పరుగుల రికార్డును అందుకొన్న దిగ్గజ బ్యాటర్లలో విరాట్ కొహ్లీ, శిఖర్ ధావన్ , డేవిడ్ వార్నర్ ఉన్నారు.
విరాట్ ప్రస్తుత సీజన్ 5వరౌండ్ ముగిసే వరకూ ఆడిన 228 మ్యాచ్ ల్లో 6వేల 844 పరుగులు సాధించాడు. ఇందులో 5 సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ 210 మ్యాచ్ ల్లో 6వేల 477 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 167 మ్యాచ్ ల్లోనే 6వేల 109 పరుగులు సాధించడం ద్వారా మూడో స్థానంలో నిలిచాడు.
కీపర్ గా మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు...
బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్ తో ముగిసిన పోరులో చెన్నై కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రెండుక్యాచ్ లు పట్టడం ద్వారా 175 మందిని అవుట్ చేసిన
ఏకైక వికెట్ కీపర్ గా రికార్డు నెలకొల్పాడు. 232 మ్యాచ్ ల్లో 136 క్యాచ్ లు, 39 స్టంపింగ్స్ తో మహీ ఈ ఘనత సాధించాడు.
ఆరుగురు బ్యాటర్లు రెండేసి డకౌట్లు..
ప్రస్తుత సీజన్ మొదటి 25 మ్యాచ్ లు, ఐదురౌండ్లలో ..మొత్తం ఆరుగురు బ్యాటర్లు రెండేసి సార్లు డకౌట్లుగా వెనుదిరిగారు. వీరిలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్,
కోల్ కతా ఆల్ రౌండర్ సునీల్ నరైన్, పంజాబ్ ఓపెనర్ ప్రభుసిమ్రన్ సింగ్, ఢిల్లీ ఆల్ రౌండర్ మిషెల్ మార్ష్, బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ రెండుసార్లు సున్నా పరుగులకు అవుటయ్యారు.
డాషింగ్ బ్యాటర్ మిషెల్ మార్ష్ మూడుమ్యాచ్ ల్లో నాలుగు పరుగులు సాధించడం ద్వారా చెత్త సగటు రికార్డు సాధించాడు.
26 మ్యాచ్ లు..26 మందికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు..
ప్రస్తుత సీజన్ గత 20 రోజుల్లో చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ జట్ల ప్రారంభమ్యాచ్ నుంచి జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్- లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ముగిసిన 26వ మ్యాచ్ వరకూ..26మంది వేర్వేరు ఆటగాళ్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకోడం మరో అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.
16 సీజన్ల ఐపీఎల్ చరిత్రలో 26 మంది వేర్వేరు క్రికెటర్లు 26 వేర్వేరు మ్యాచ్ ల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు నిలవడం ఇదే మొదటిసారి.