ప్రపంచకప్ సూపర్-8 లో నేడు భారత్ తొలిఫైట్!

2024 టీ-20 ప్రపంచకప్ కు గురిపెట్టిన టాప్ ర్యాంకర్ భారత్ సూపర్- 8 రౌండ్లో తొలిఫైట్ కి సిద్ధమయ్యింది. అప్ఘనిస్థాన్ తో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది.

Advertisement
Update:2024-06-20 10:53 IST

2024 టీ-20 ప్రపంచకప్ కు గురిపెట్టిన టాప్ ర్యాంకర్ భారత్ సూపర్- 8 రౌండ్లో తొలిఫైట్ కి సిద్ధమయ్యింది. అప్ఘనిస్థాన్ తో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది.

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ను 17 సంవత్సరాల విరామం తరువాత మరోసారి సొంతం చేసుకోడానికి భారత్ ఉరకలేస్తోంది. ప్రస్తుత 2024 ప్రపంచకప్ రెండోదశ సూపర్ - 8 రౌండ్ లో తొలిపోరుకు సిద్ధమయ్యింది.

బార్బడోస్ లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా..భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 8-30 గంటలకు ప్రారంభమయ్యే పోరులో సంచలనాల అప్ఘనిస్థాన్ తో తలపడనుంది.

హాట్ ఫేవరెట్ గా రోహిత్ సేన...

టీ-20 ర్యాంకింగ్స్ టాపర్ గా నిలిచిన భారత్ ప్రస్తుత ప్రపంచకప్ గ్రూపు లీగ్ లో విజయాల హ్యాట్రిక్ తో సూపర్- 8 రౌండ్లో అడుగుపెట్టింది. ఓపెనర్ విరాట్ కొహ్లీ మినహా మిగిలిన స్టార్ బ్యాటర్లంతా ఫామ్ లో ఉండడంతో భారత బ్యాటింగ్ భీకరంగా కనిపిస్తోంది.

గ్రూప్- ఏ లీగ్ మూడురౌండ్లలోనూ దారుణంగా విఫలమైన విరాట్ కొహ్లీ తనవంతుగా భారీస్కోరు సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు. గత మూడురోజులుగా..నెట్ ప్రాక్టీసులోనే గడిపాడు.

బ్యాటింగ్ తో పాటు స్పిన్ బౌలర్లకు అనువుగా ఉండే బార్బడోస్ ఓవల్ పిచ్ పైన పరుగులు వెల్లువెత్తే అవకాశం లేకపోలేదు.

ఇదీ..టీమ్ మేనేజ్ మెంట్ వ్యూహం....

ప్రత్యర్థి అప్ఘనిస్థాన్ ను తక్కువగా అంచనావేస్తే చిక్కులు తప్పవని గ్రహించిన భారత టీమ్ మేనేజ్ మెంట్ పటిష్టమైన వ్యూహంతో పోటీకి దిగుతోంది. ముందుగా బ్యాటింగ్ కు దిగాల్సి వస్తే భారీస్కోరు సాధించడం మినహా వేరేదారి లేదని చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ భావిస్తున్నారు. బ్యాటింగ్ తో పాటు స్ట్ర్రోక్ మేకర్లపాలిట స్వర్గంగా ఉన్న పిచ్ పైన భారతజట్టు 200కు పైగా పరుగుల స్కోరు సాధించడం ఏమంత కష్టంకాబోదని టీమ్ మేనేజ్ మెంట్ అంటోంది.

ప్రారంభ ఓవర్లలో అప్ఘన్ పేసర్లపై రోహిత్, విరాట్ , రిషభ్ పంత్ విరుచుకు పడితే...మిడిల్ ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్, శివం దూబే..స్పిన్నర్ల పనిపట్టడం సులువవుతుందని అంచనావేస్తున్నారు.

అయితే...రషీద్ ఖాన్, నూర్ మహ్మద్, మహ్మద్ నబీలతో కూడిన అప్ఘన్ స్పిన్ ఎటాక్ ను ఎదుర్కొనాలంటే ..భారత బ్యాటర్లు స్థాయికి తగ్గట్టుగా ఆడక తప్పదు.

టాస్ నెగ్గితే బ్యాటింగ్ కే ప్రాధాన్యం..

ఈ కీలకపోరులో ఏజట్టు టాస్ నెగ్గినా ..మరో ఆలోచన లేకుండా ముందుగా బ్యాటింగ్ ఎంచుకోడం ఖాయంగా కనిపిస్తోంది. 175 నుంచి 200 వరకూ స్కోరు సాధించగలిగితే..చేజింగ్ కు దిగేజట్టును ఒత్తిడిలోకి నెట్టడం ద్వారా విజయం సాధించవచ్చునన్న ఆశతో ఉన్నాయి.

భారత తుదిజట్టు నుంచి మహ్మద్ సిరాజ్ ను పక్కన పెట్టి..చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ ను చేర్చుకొనే అవకాశం ఉంది. అప్ఘన్ బ్యాటర్లకు..లెఫ్టామ్ స్పిన్నర్లను ఎదుర్కొనడం ప్రధాన బలహీనతగా ఉండడంతో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ కీలకపాత్ర పోషించనున్నారు.

పేస్ బౌలింగ్ జోడీ జస్ ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ లతో పాటు వైస్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా సైతం కీలక వికెట్లు పడగొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు.

అప్ఘన్ ప్రత్యర్థగా ఓటమి ఎరుగని భారత్..

టీ-20 ఫార్మాట్లో 10వ ర్యాంకర్ అప్ఘనిస్థాన్ ప్రత్యర్థిగా టాప్ ర్యాంకర్ భారత్ కు తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటి వరకూ తలపడిన 8 అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ల్లో భారత్ 7-0 రికార్డుతో అజేయంగా నిలిచింది. ఓ మ్యాచ్ ఫలితం లేకుండానే ముగిసింది.

మరోవైపు..స్పిన్ జాదూ రషీద్ ఖాన్ నాయకత్వంలోని అప్ఘన్ జట్టు మాత్రం..టాప్ ర్యాంకర్ భారత్ పై తొలివిజయం కోసం ఎదురుచూస్తోంది. సూపర్- 8 తొలిరౌండ్లో భారత్ కు షాక్ ఇవ్వడం ద్వారా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాలన్న లక్ష్యంతో ఉంది.

ప్రతిగెలుపు కీలకమే...

సూపర్-8 రౌండ్ ఒకే గ్రూపులో నంబర్ -1 భారత్, 2వ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియా, 9వ ర్యాంక్ బంగ్లాదేశ్, 10వ ర్యాంకర్ అప్ఘనిస్థాన్ జట్లు ఉండడంతో ప్రతిమ్యాచ్ కీలకంగా తయారయ్యింది.

మూడురౌండ్లలో కనీసం 2 విజయాలు సాధించిన జట్టుకు సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్ చేరే అవకాశం ఉండడంతో విజయమే లక్ష్యంగా నాలుగుజట్లూ బరిలోకి దిగుతున్నాయి.

ఈరోజు రాత్రి 8-30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కు వానముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరించింది. వరుణుడు కరుణిస్తే..పూర్తిస్థాయిలో మ్యాచ్ జరుగనుంది.

సూపర్-8 రౌండ్ ప్రారంభరౌండ్ మ్యాచ్ ల్లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ 8 వికెట్లతో ఆతిథ్య వెస్టిండీస్ ను చిత్తు చేస్తే...పసికూన అమెరికాపై దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది.

Tags:    
Advertisement

Similar News