ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాకు భారత ఆటగాడి అర్హత!

2024 గ్రాండ్ స్లామ్ సీజన్ తొలిటోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాకి భారత ఆటగాడు సుమిత్ నాగాల్ మూడేళ్ల తర్వాత అర్హత సాధించాడు.

Advertisement
Update:2024-01-14 08:30 IST

2024 గ్రాండ్ స్లామ్ సీజన్ తొలిటోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాకి భారత ఆటగాడు సుమిత్ నాగాల్ మూడేళ్ల తర్వాత అర్హత సాధించాడు.

రామనాథన్ కృష్ణన్, విజయ్ అమృత్ రాజ్, రమేశ్ కృష్ణన్, లియాండర్ పేస్ లాంటి ఎందరో మేటి సింగిల్స్ ప్లేయర్లను అందించిన భారత్ కు కష్టకాలం మొదలయ్యింది.

రానురాను గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీల పురుషుల సింగిల్స్ మెయిన్ డ్రాకు భారత క్రీడాకారులు అర్హత సాధించడమే గగనమైపోతోంది.

పురుషుల డబుల్స్ లో రోహన్ బొపన్న లాంటి వెటరన్ స్టార్లు భారత పతాకాన్ని రెపరెపలాడిస్తూ వస్తున్నా..పురుషుల సింగిల్స్ లో ఉనికిని కాపాడుకోడమే కష్టంగా మారింది.

ఒకే ఒక్కడు సుమిత్ నాగాల్

భారత టెన్నిస్ పురుషుల సింగిల్స్ లో సాకేత్ మైనేని , రామ్ కుమార్ లాంటి ఆటగాళ్ళున్నా.. గ్రాండ్ స్లామ్ (ఆస్ట్ర్రేలియన్, అమెరికన్ , వింబుల్డన్, ఫ్రెంచ్) టోర్నీల సింగిల్స్ మెయిన్ డ్రాకు అర్హత సాధించేవారే కరువయ్యారు. సానియా మీర్జా రిటైర్మెంట్ తో మహిళల సింగిల్స్ లో సైతం అదే పరిస్థితి కనిపిస్తోంది.

ప్రస్తుత 2024 గ్రాండ్ స్లామ్ సీజన్ తొలిటోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ మెయిన్ డ్రా కు భారత ఆటగాడు సుమిత్ నాగల్ అర్హత సాధించడం ద్వారా భారత పరువు దక్కించాడు.

మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ అర్హత పోటీలలో సుమిత్ నాగల్ సఫలం కావడమే కాదు..మూడేళ్ల విరామం తర్వాత మెయిన్ డ్రాకు అర్హత సంపాదించ గలిగాడు.

క్వాలిఫైయింగ్ ఆఖరి రౌండ్ మ్యాచ్ లో స్లవేకియా ఆటగాడు అలెక్స్ మోల్ కాన్ ను 6-4, 6-4తో సుమిత్ అధిగమించాడు. తన కెరియర్ లో ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీ మెయిన్ డ్రాకు నాలుగోసారి అర్హత సంపాదించగలిగాడు.

అంతర్జాతీయ టెన్నిస్ పురుషుల సింగిల్స్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం 139వ స్థానంలో కొనసాగుతున్న సుమిత్ క్వాలిఫైయింగ్ ఫైనల్ రౌండ్ మ్యాచ్ లో గాయం బాధిస్తున్నా పోరాడి ఆడి గంటా 4 నిముషాల సమయంలో ప్రత్యర్థిని అధిగమించగలిగాడు.

క్వాలిఫైయింగ్ రౌండ్ తొలిపోరులో జెఫ్రీ బ్లాంకోనెక్స్ ను, రెండోరౌండ్లో ఆస్ట్ర్రేలియా ఆటగాడు ఎడ్వర్డ్ వింటర్ ను సుమిత్ ఓడించగలిగాడు. 2021 తర్వాత ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాకు చేరుకోడం సుమిత్ కు ఇదే తొలిసారి.

2019 అమెరికన్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించిన సుమిత్ టోర్నీ తొలిరౌండ్లో దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్ తో పోటీపడే అరుదైన అవకాశాన్ని దక్కించుకొన్నాడు.

2020లో గ్రాండ్ స్లామ్ టోర్నీ రెండోరౌండ్ వరకూ వెళ్లిన సుమిత్ ఆ తర్వాత నుంచి గాయాల కారణంగా వెనుక బడుతు వచ్చాడు.

తన కెరియర్ లో ఇప్పటి వరకూ నాలుగుసార్లు గ్రాండ్ స్లామ్ మెయిన్ డ్రాకు చేరుకొన్న సుమిత్ ..మూడుసార్లు ఆస్ట్ర్రేలియన్, ఓసారి అమెరికన్ ఓపెన్ కు అర్హత సాధించగలిగాడు.

Tags:    
Advertisement

Similar News