భారత ఫుట్ బాల్ కు నిబంధనల ఉరి!

గత నాలుగేళ్లుగా నిలకడగా రాణిస్తున్న భారత ఫుట్ బాల్ జట్టును ఆసియాక్రీడల్లో పాల్గోనివ్వకుండా నిబంధనల పేరుతో ప్రభుత్వం అడ్డుకొంటూ తీవ్రవిమర్శలు ఎదుర్కొంటోంది.

Advertisement
Update:2023-07-18 13:00 IST

గత నాలుగేళ్లుగా నిలకడగా రాణిస్తున్న భారత ఫుట్ బాల్ జట్టును ఆసియాక్రీడల్లో పాల్గోనివ్వకుండా నిబంధనల పేరుతో ప్రభుత్వం అడ్డుకొంటూ తీవ్రవిమర్శలు ఎదుర్కొంటోంది.

ప్రపంచంలోనే నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ కు మనదేశంలో ఆదరణ అంతంత మాత్రమే. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వమేనని పలువురు విమర్శకులు అంటున్నారు.

అత్యంత జనాదరణ కలిగిన ఫుట్ బాల్ ను ప్రోత్సహించాల్సింది పోయి నిబంధనల పేరుతో ప్రభుత్వం నిరుత్సాహ పరుస్తోందని ప్రస్తుత పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి.

అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్యలో 204 దేశాలకు సభ్యత్వం ఉంటే..జనాభాపరంగా ప్రపంచంలోనే రెండు అతిపెద్ద దేశాలలో ఒకటైన భారత ఫుట్ బాల్ ర్యాంక్ 100గా ఉంది. గత నాలుగేళ్లుగా నిలకడగా రాణిస్తూ వస్తున్న భారత్ 104వ స్థానం నుంచి 100వ ర్యాంక్ కు ఎదగటానికి నానాపాట్లు పడాల్సి వచ్చింది. ప్రభుత్వప్రోత్సాహం అంతంత మాత్రంగానే ఉన్నా ఫుట్ బాల్ సమాఖ్య చొరవ, పూనిక కారణంగా భారత్ తన అస్థిత్వాన్ని కాపాడుకొంటూ వస్తోంది.

ఆసియాడ్ కు మోకాలడ్డిన ప్రభుత్వం...

ఇటీవలే ముగిసిన శాఫ్ ఫుట్ బాల్ టైటిల్ ను తొమ్మిదోసారి గెలుచుకోడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పిన భారతజట్టును నిబంధనల పేరుతో అడ్డుకోడం ద్వారా ఆసియాక్రీడల్లో పాల్గోనివ్వకుండా ప్రభుత్వం మరోసారి మోకాలడ్డింది.

నిబంధనల ప్రకారం ఆసియాలో మొదటి ఎనిమిదిస్థానాలలో నిలిస్తేనే ఏ క్రీడలోనైనా భారతజట్లు , అథ్లెట్లు ఆసియాక్రీడల్లో పాల్గొనటానికి అనుమతించేలా ప్రభుత్వం ఓ విధానాన్ని పాటిస్తోంది. అయితే..కొన్ని కొన్ని క్రీడల్ని ప్రోత్సహించడంలో భాగంగా మినహాయింపు ఇస్తూ వస్తోంది.

గతంలో ఆసియాక్రీడల్లో భారత్ కు పతకాలు సాధించిపెట్టిన భారత్ ఫుట్ బాల్ ప్రమాణాలు గత రెండుదశాబ్దాలుగా దిగజారిపోతూ వచ్చాయి. దీనికి ప్రభుత్వమే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఫుట్ బాల్ అభివృద్ధికి నానాపాట్లు..

భారత్ లో ఫుట్ బాల్ అభివృద్ధికి, ప్రమాణాలు మెరుగుపరచడం కోసం జూనియర్ స్థాయి నుంచే జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య పలు రకాల ప్రణాళికలను అమలు చేస్తోంది.

2017లో ప్రపంచ అండర్ -17 ఫుట్ బాల్ టోర్నీని భారత్ వేదికగా నిర్వహించడం ద్వారా అట్టడుగుస్థాయి నుంచే ఫుట్ బాల్ అభివృద్ధికి చర్యలు తీసుకొంది. పురుషుల, మహిళల, జూనియర్, సబ్ జూనియర్ విభాగాలలో సైతం భారత ఫుట్ బాల్ ప్రమాణాలు క్రమేణా మెరుగుపడుతూ వస్తున్నాయి.

భారత ఫుట్ బాల్ శిక్షకుడు ఇగోర్ స్టిమాక్, కెప్టెన్ సునీల్ ఛెత్రీ సైతం తమవంతు పాత్ర నిర్తిస్తున్నారు. గత నాలుగేళ్ల కాలంలో భారతజట్టు ఆసియాస్థాయిలో చెప్పుకోదగిన విజయాలు సాధిస్తూనే వస్తోంది.

తమదేశం తరపున అత్యధిక గోల్స్ సాధించిన మొదటి ముగ్గురు ఆటగాళ్లలో క్రిస్టియానో రొనాల్డో, లయనల్ మెస్సీల తర్వాతి స్థానం భారత కెప్టెన్ సునీల్ ఛెత్రీది మాత్రమే.

భారత ఫుట్ బాల్ ర్యాంక్ సైతం 104 నుంచి 100వ స్థానానికి మెరుగుపడింది. అయితే..భారత ప్రభుత్వం మాత్రం..ఆసియా మొదటి ఎనిమిది ర్యాంకుల్లో నిలువగలిగితేనే భారతజట్టును ఆసియాక్రీడల్లో పాల్గోనిస్తామంటూ మెలికపెట్టింది.

ప్రధానికి భారత కోచ్ వేడుకోలు...

భారత ఫుట్ బాల్ జట్టును నిబంధనల పేరుతో గత ఆసియాక్రీడల్లో పాల్గోనివ్వకుండా చేశారని, త్వరలో జరిగే ఆసియా క్రీడల్లో సైతం భారతజట్టును పాల్గోనివ్వకుండా అడ్డుకొంటున్నారంటూ జాతీయ ఫుట్ బాల్ శిక్షకుడు ఇగోర్ స్టిమాక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాని జోక్యం చేసుకోవాలని, భారత జట్టును ఆసియాక్రీడల్లో పాల్గొనేలా అనుమతించాలని వేడుకొంటూ ప్రధానికి ఓ లేఖను వ్రాశారు. ఇది తన వ్యక్తిగత విన్నపమంటూ ఆ లేఖలో అభ్యర్థించారు.

కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ కు సైతం భారత ఫుట్ బాల్ కోచ్ తన లేఖను పిన్ చేశారు. ఆసియాక్రీడలు లాంటి అంతర్జాతీయ పోటీలలో పాల్గొంటేనే జట్టు సత్తా ఏమిటో తెలుస్తుందని, పైగా మెరుగైనజట్లతో పోటీపడితేనే ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. అండర్ -17, అండర్ -23 ప్రపంచ ఫుట్ బాల్ అర్హత పోటీలలో భారతజట్ల ప్రదర్శన గొప్పగా ఉందంటూ గుర్తుచేశారు.

ఫుట్ బాల్ లో మెరుగైన ర్యాంక్ కలిగిన జట్లను దిగువ ర్యాంక్ జట్లు ఓడించేఅవకాశం ఉందని, ప్రమాణాలకు, ప్రతిభకు ర్యాంకులతోపనిలేదని తన లేఖలో వివరించారు.

భారత ఫుట్ బాల్ జట్టును ఆసియాక్రీడల్లో పాల్గోనివ్వకుండా కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ విధించిన నిబంధనలే అడ్డుకొంటున్నాయని, ప్రధాని జోక్యం చేసుకొని న్యాయం చేయాలని కోరారు.

2022లో జరగాల్సిన ఆసియాక్రీడల్ని కరోనా కారణంగా ఏడాది ఆలస్యంగా చైనాలోని హాంగ్జు నగరం వేదికగా సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకూ నిర్వహించనున్నారు.సెప్టెంబర్ 10 నుంచే ఆసియాక్రీడల ఫుట్ బాల్ పోటీలు ప్రారంభంకానున్నాయి.

తొమిదేళ్ల విరామం తర్వాత ఆసియాక్రీడల్లో భాగంగా నిర్వహిస్తున్న క్రికెట్ పురుషుల, మహిళల విభాగాలలో భారతజట్లు పాల్గొనబోతున్నాయి. బీసిసిఐ ఇప్పటికే జట్ల వివరాలను ప్రకటించింది.

Tags:    
Advertisement

Similar News