తొలిరోజునే బంగ్లాను కూల్చిన భారత్!

బంగ్లాదేశ్ తో రెండోటెస్ట్ తొలిరోజు ఆటలోనే భారత బౌలర్లు చెలరేగిపోయారు. ఆతిథ్యజట్టును తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగులకే పరిమితం చేశారు.

Advertisement
Update:2022-12-22 18:40 IST

బంగ్లాదేశ్ తో రెండోటెస్ట్ తొలిరోజు ఆటలోనే భారత బౌలర్లు చెలరేగిపోయారు. ఆతిథ్యజట్టును తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగులకే పరిమితం చేశారు.

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండోటెస్టు తొలిరోజు ఆటను భారత్ సంపూర్ణ ఆధిపత్యంతో ముగించింది. టాస్ ఓడినా..భారత బౌలర్లు సమర్థవంతంగా బౌల్ చేసి బంగ్లాదేశ్ ను 227 పరుగుల స్కోరుకే కుప్పకూల్చారు. సమాధానంగా తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 19 పరుగుల స్కోరు సాధించారు.

భారతజట్టులో ఉనద్కత్ కు చోటు...

అంతకుముందు..తుదిజట్లలో భారత్ ఒకటి, బంగ్లాజట్టు రెండుమార్పులతో బరిలోకి దిగాయి. పేస్ బౌలింగ్ కు అనువుగా ఉన్న మీర్పూర్ పిచ్ పైన కీలక టాస్ నెగ్గిన బంగ్లాజట్టు బ్యాటింగ్ ఎంచుకొంది. తుదిజట్టులోకి ఫాస్ట్ బౌలర్ టాస్కిన్ , మాజీ కెప్టెన్ మోమినుల్ హక్ లను తీసుకొంది. భారత్ మాత్రం తొలిటెస్టులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన కుల్దీప్ యాదవ్ ను పక్కన పెట్టి లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ ను తుదిజట్టులో చోటు కల్పించిందింది.

శాంతో- జకీర్ లతో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాజట్టు మొదటి వికెట్ కు 39 పరుగుల భాగస్వామ్యంతో నిలదొక్కుకొంటున్న తరుణంలో జకీర్ హసన్ ను ఉనద్కత్ పడగొట్టాడు. దశాబ్ద విరామం తర్వాత భారత టెస్టుజట్టులో చోటు సంపాదించిన వెటరన్ ఉనద్కత్ తన రెండోటెస్టు మ్యాచ్ లో వికెట్ పడగొట్టాడు. తొలిటెస్టు సెంచరీ హీరో జకీర్ కేవలం 15 పరుగులకే దొరికిపోయాడు.

మరో ఓపెనర్ సాంతోను ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ అవుట్ చేశాడు. శాంతో 24 పరుగులకే వెనుదిరగడంతో బంగ్లాజట్టు 39 పరుగుల స్కోరు వద్దే ఓపెనర్లు ఇద్దరి వికెట్లు నష్టపోయింది.

మాజీ కెప్టెన్ మోమినుల్ ఒంటరి పోరాటం చేసినా... కెప్టెన్ షకీబుల్ 16, ముష్ ఫికుర్ 26, లిట్టన్ దాస్ 25, నజ్ముల్ హుస్సేన్ 24 స్కోర్లతో అండగా నిలువ లేకపోయారు.

నిప్పులు చెరిగిన ఉమేశ్...

టీ విరామానికే 185 పరుగులకే 5 వికెట్లు నష్టపోయిన బంగ్లాను ఆ తర్వాత ఉమేశ్ యాదవ్ మెరుపు ఫాస్ట్ బౌలింగ్ తో కకావికలు చేశాడు. వరుసగా మూడు వికెట్లు పడగొట్టి 227 పరుగులకే ప్రత్యర్థిని కుప్పకూల్చడంలో ప్రధానపాత్ర వహించాడు.

మోమినుల్ 12 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 16వ టెస్టు హాఫ్ సెంచరీ సాధించి..స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్ లో 9వ వికెట్ గా అవుటయ్యాడు.

భారత బౌలర్లలో ఉమేశ్, అశ్విన్ చెరో 4 వికెట్లు, ఉనద్కత్ 2 వికెట్లు పడగొట్టారు.

ఆట ముగియటానికి 14 ఓవర్లు మాత్రమే మిగిలిఉండగా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. రాహుల్ 3, గిల్ 14 పరుగుల స్కోర్లతో క్రీజులో నిలిచారు.

టెస్టు రెండు, మూడురోజుల్లో భారత్ పూర్తిగా బ్యాటింగ్ చేసి 400కు పైగా స్కోరు సాధించగలిగితే..మరో భారీవిజయంతో సిరీస్ ను స్వీప్ చేసే అవకాశాలు లేకపోలేదు. చోటాగ్రామ్ లో ముగిసిన తొలిటెస్టులో 188 పరుగులతో నెగ్గిన భారత్...రెండోటెస్టులో సైతం అదేస్థాయి విజయం సాధించాలన్న లక్ష్యంతో ఉంది.

12 సంవత్సరాల తర్వాత తన రెండోటెస్ట్ మ్యాచ్ ఆడిన జయదేవ్ ఉనద్కత్ అంచనాలకు తగ్గట్టుగా బౌల్ చేసి 2వికెట్లు సాధించాడు.

Tags:    
Advertisement

Similar News