ఏషియన్ గేమ్స్ హాకీ..ఒకే గ్రూపులో భారత్, పాక్!
చైనాలోని హాంగ్జు వేదికగా జరిగే 2022 ఆసియాక్రీడల హాకీ పురుషుల, మహిళల గ్రూపు వివరాలను నిర్వాహక సంఘం ప్రకటించింది. మాజీ చాంపియన్లు భారత్, పాక్ జట్లు ఒకే గ్రూపు నుంచి టైటిల్ వేటను ప్రారంభించనున్నాయి.
చైనాలోని హాంగ్జు వేదికగా జరిగే 2022 ఆసియాక్రీడల హాకీ పురుషుల, మహిళల గ్రూపు వివరాలను నిర్వాహక సంఘం ప్రకటించింది. మాజీ చాంపియన్లు భారత్, పాక్ జట్లు ఒకే గ్రూపు నుంచి టైటిల్ వేటను ప్రారంభించనున్నాయి.
కరోనా దెబ్బతో ఏడాది ఆలస్యంగా జరుగనున్న 2022 ఆసియాక్రీడల హాకీ పురుషుల, మహిళల గ్రూపు వివరాలను నిర్వాహక సంఘం ప్రకటించింది. వాస్తవానికి చైనా లోని హాంగ్జు నగరం ఆతిథ్యంలో గత ఏడాదే ఆసియాక్రీడలు జరగాల్సి ఉంది. కరోనా విలయంతో ఆసియాక్రీడల్ని 2023కు వాయిదా వేశారు.
సెప్టెంబర్ 24 నుంచి హాకీ సమరం..
ఆసియాక్రీడల్లో భాగంగా నిర్వహించే హాకీ పురుషుల, మహిళల గ్రూపులీగ్ మ్యాచ్ ల వివరాలను అధికారికంగా ప్రకటించారు. ఎనిమిదిసార్లు ఆసియాక్రీడల హాకీ గోల్డ్ మెడలిస్ట్ పాకిస్థాన్, మూడుసార్లు స్వర్ణ విజేత భారతజట్లు ఒకే గ్రూపు నుంచి తమ బంగారు వేటను ప్రారంభించనున్నాయి.
గ్రూపు-ఏ లీగ్ లో పాకిస్థాన్, జపాన్, బంగ్లాదేశ్, సింగపూర్, ఉజ్బెకిస్థాన్ జట్లతో భారత్ తలపడనుంది. సెప్టెంబర్ 24న తన గ్రూప్ తొలిమ్యాచ్ ను ఉజ్బెకిస్థాన్ తో భారత్ ఆడనుంది.
పురుషుల గ్రూప్ - బీ లీగ్ లో దక్షిణ కొరియా, మలేసియా, చైనా, ఒమన్, థాయ్ లాండ్, ఇండోనీసియా పోటీపడతాయి.
మహిళల గ్రూపు- ఏలో భారత్ పోరు..
మహిళల పూల్ -ఏ లో దక్షిణ కొరియా, మలేసియా, హాంకాంగ్, సింగపూర్ జట్లతో భారత్ తలపడనుంది. ఆసియాక్రీడల మహిళల హాకీపోటీలు సెప్టెంబర్ 27న ప్రారంభంకానున్నాయి.
మహిళల పూల్ -బీలో జపాన్, చైనా, థాయ్ లాండ్, కజకిస్థాన్, ఇండోనీసియాజట్లు పోటీపడతాయి.
30న పాకిస్థాన్ తో భారత్ పోరు..
పురుషుల గ్రూప్- ఏ లీగ్ లో భాగంగా సెప్టెంబర్ 30న జరిగే కీలకపోరులో భారత్, పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ లో నెగ్గినజట్టే గ్రూపు విజేతగా నిలువనుంది.
భారతజట్టు సెప్టెంబర్ 26న సింగపూర్, 28న జపాన్ జట్లతో తలపడనుంది. పాక్, జపాన్ జట్ల నుంచే భారత్ కు గట్టిపోటీ ఎదురుకానుంది.
ఆసియాక్రీడల హాకీ పోటీలకు గాంగ్సు కెనాల్ స్పోర్ట్స్ పార్క్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. పురుషుల గోల్డ్ మెడల్ మ్యాచ్ అక్టోబర్ 6న, మహిళల స్వర్ణ పతకం పోరును అక్టోబర్ 7న నిర్వహిస్తారు.
భారత్ చివరిసారిగా 2014 ఇంచెన్ ఆసియాక్రీడల్లో హాకీ బంగారు పతకం సాధించగా..పాకిస్థాన్ 2010 గాంగ్జు ఆసియాక్రీడల్లో విజేతగా నిలిచింది. 2018 జకార్తా ఆసియాక్రీడల్లో మాత్రం భారత్, పాక్ జట్లను కంగు తినిపించి..జపాన్ జట్టు బంగారు పతక విజేతగా నిలిచింది.