వికెట్ల వేటలో భారత్
రెండో టెస్ట్ రెండో ఇన్సింగ్స్‌లో ఏడువికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్
కాన్పూర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్సింగ్స్‌లో బంగ్లాదేశ్ ఏడు వికెట్లు కోల్పోయింది. షద్‌మాన్ ఇస్లాం హాఫ్ సెంచరీ చేసి ఆకాశ్‌దీప్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన లిటన్ దాస్ ఒక్క రన్ మాత్రమే చేసి జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం బంగ్లా జట్టు 34 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 109 రన్స్‌తో ఆడుతున్నది. టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్రజడేజా 3 వికెట్లు పడగొట్టగా.., ఆకాశ్ దీప్ ఒక వికెట్ తీశారు. అంతకుముందు భారత్ తన మొదటి ఇన్సింగ్స్‌లో వేగంగా బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.
ఐదు ప్రపంచ రికార్డులను నమోదు చేసిన భారత్
భారత్-బంగ్లాదేశ్ ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ ఆసక్తికరంగా మారింది. వర్షం కారణంగా రెండు, మూడు రోజుల్లో ఒక్క బాల్ పడకుండానే రద్దయిన మ్యాచ్ ఎట్టకేలకు నాలుగో రోజు ప్రారంభమైంది. ఆట ప్రారంభం నుంచే భారత బ్యాటర్లు దూకుడుగా ఆడారు. టీ20 వలె ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ (72), కెప్టెర్ రోహిత్ శర్మ (23) దంచికొట్టడంతో భారత్ 18 బంతుల్లోనే 50 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (39) బాధ్యతాయుతమైన ఇన్సింగ్స్ ఆడగా.. రిషభ్ పంత్ (9) నిరాశపరిచాడు. తర్వాత వచ్చిన స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (47), కేఎల్ రాహుల్ (68) ల అద్భుతమైన ఇన్సింగ్స్‌తో అలరించారు. ఈ నేపథ్యంలో నే టీమిండియా ఈ మ్యాచ్‌లో ఐదు ప్రపంచ రికార్డులను నమోదు చేసింది. టెస్ట్ క్రికెట్‌లో వేగంగా 50, 100, 150, 200, 250 పరుగులు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఇప్పటికే మొదటి టెస్ట్ గెలిచిన భారత్ రెండో టెస్ట్ లోనూ గెలుపే లక్ష్యంగా ఆడుతున్నది.