సూర్య షో..ప్రపంచకప్ సూపర్-8లో భారత్ బోణీ!

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో భారత్ బోణీ కొట్టింది. 10వ ర్యాంకర్ అప్ఘనిస్థాన్ ను 47 పరుగులతో చిత్తు చేసింది.

Advertisement
Update: 2024-06-21 07:45 GMT

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో భారత్ బోణీ కొట్టింది. 10వ ర్యాంకర్ అప్ఘనిస్థాన్ ను 47 పరుగులతో చిత్తు చేసింది.

అమెరికా, కరీబియన్ ద్వీపాలు వేదికలుగా జరుగుతున్న 2024 టీ-20 ప్రపంచకప్ సూపర్-8 రౌండ్లో టాప్ ర్యాంకర్ భారత్ తొలిగెలుపుతో శుభారంభం చేసింది.

బార్బడోస్ కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన పోరులో అప్ఘనిస్థాన్ పై 47 పరుగులతో విజయం సాధించింది.

రోహిత్, విరాట్ వెలవెల...

డే-మ్యాచ్ గా జరిగిన ఈ పోరులో కీలక టాస్ నెగ్గిన భారత్..ముందుగా బ్యాటింగ్ ఎంచుకొంది. తుదిజట్టులోకి సిరాజ్ కు బదులుగా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను చేర్చుకోడం ద్వారా స్పిన్ బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేసుకొంది.

సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ- విరాట్ కొహ్లీలతో భారత ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ను పవర్ ప్లే ఓవర్లలో అప్ఘన్ బౌలర్లు సమర్థవంతంగా అడ్డుకొన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ (8), మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ ( 24 ) దూకుడుగా ఆడటానికి ప్రయత్నించి విఫలమయ్యారు. బ్యాటింగ్ కు అంత అనుకూలంగా లేని కెన్సింగ్టన్ ఓవల్ పిచ్ పైన నానాపాట్లు పడాల్సి వచ్చింది.

మొదటి 9 ఓవర్లలో భారత్ 63 పరుగులకే మూడు టాపార్డర్ వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 4 ఫోర్లతో 20 పరుగుల స్కోరుకు అవుటైన తరుణంలో క్రీజులోకి అడుగుపెట్టిన ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్, మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ ఆచితూచి ఆడుతూ పరిస్థితిని చక్కదిద్దటానికి ప్రయత్నించాడు.

మిస్టర్ 360 సరికొత్త రికార్డు...

ఆల్ రౌండర్ శివం దూబే సైతం కేవలం 10 పరుగుల స్కోరుకే వెనుదిరిగడంతో..జట్టు భారమంతా సూర్య-పాండ్యాల జోడీపైన పడింది. ఈ ఇద్దరూ 5వ వికెట్ కు 60 పరుగుల కీలక భాగస్వామ్యంతో గట్టిపునాది వేశారు.

పాండ్యా 32, జడేజా 7, అక్షర్ పటేల్ 12 పరుగులు సాధించడం ద్వారా సూర్యాకు తోడుగా నిలిచారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా సూర్య తనదైన శైలిలో ఆడి 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సూర్య పుణ్యమా అంటూ భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగుల స్కోరు సాధించగలిగింది.

అప్ఘన్ బౌలర్లలో కెప్టెన్ కమ్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 3 వికెట్లు, పేసర్ ఫజుల్ హక్ ఫరూకీ 3 వికెట్లు పడగొట్టారు.

చుక్కలు చూపించిన బుమ్రా...

182 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగిన అప్ఘన్ టాపార్డర్ కు భారత ఓపెనింగ్ బౌలర్ బుమ్రా పట్టపగలే చుక్కలు చూపించాడు. కట్టర్లకు యార్కర్లు జోడించడం ద్వారా వీరవిహారమే చేశాడు.

ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్ 2, రహంతుల్లా గుర్జాబ్ 11 వికెట్లను బుమ్రా పడగొడితే..ఇబ్రహీం జడ్రాన్ ను స్పిన్నర్ అక్షర్ పటేల్ అవుట్ చేయడంతో పవర్ ప్లే ఓవర్లు ముగియకుండానే అప్ఘన్ మూడు టాపార్డర్ వికెట్లు కోల్పోడం ద్వారా మరి కోలుకోలేకపోయింది.

రెండోడౌన్ బ్యాటర్ గుల్బదీన్ నయబ్ 17 పరుగులు మాత్రమే సాధించి..చైనామన్ స్పిన్నర్ కుల్దీబ్ బౌలింగ్ లో చిక్కాడు. దీంతో..అప్ఘన్ గెలుపు భారం వచ్చి అజంతుల్లా- నజీబుల్ జడ్రాన్ ల జోడీ పైన పడింది.

మిడిల్ఓవర్లలో అప్ఘన్ ను భారత్ బౌలర్లు పూర్తిస్థాయిలో కట్టడి చేయగలిగారు. అజంతుల్లా 26, నజీబుల్లా 19, మహ్మద్ నబీ 14, నూర్ అహ్మద్ 12 పరుగులు మాత్రమే చేయడంతో అప్ఘన్ జట్టు 20 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది.

భారత బౌలర్లలో బుమ్రా తన కోటా 4 ఓవర్లలో 1 మేడిన్ తో 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు, అర్షదీప్ సింగ్ 3 వికెట్లు, కుల్దీప్, జడేజా, అక్షర్ తలో వికెట్ పడగొట్టారు.

47 పరుగుల భారత విజయంలో ప్రధానపాత్ర వహించిన సూర్యకుమార్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

విరాట్ సరసన సూర్య...

టీ-20 చరిత్రలో ఇప్పటి వరకూ విరాట్ కొహ్లీ పేరుతో ఉన్న అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల రికార్డును సూర్య తెరమరుగు చేశాడు. అప్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ ద్వారా 15వసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా సూర్యకుమార్ నిలువగలిగాడు.

విరాట్ 113 అంతర్జాతీయ టీ-20ల్లో 15 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకొంటే...సూర్య కేవలం 64మ్యాచ్లు, 61 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించగలిగాడు.

సూపర్-8 రౌండ్లో తన రెండోమ్యాచ్ ను బంగ్లాదేశ్ తో భారత్ ఆడనుంది. శనివారం రాత్రి 8 గంటలకు అంటీగాలోని సర్ వివియన్ రిచర్జ్స్ స్టేడియం వేదికగా ఈ పోటీ జరుగనుంది.

Tags:    
Advertisement

Similar News