ప్రపంచకప్ సూపర్-8 రౌండ్లో బంగ్లాతో నేడు భారత్ పోరు!

భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నా ప్రత్యర్థి బంగ్లాదేశ్ ను తక్కువ అంచనా వేస్తే అంతకు మించిన పొరపాటు మరొకటి లేదు.

Advertisement
Update:2024-06-22 09:57 IST

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ సూపర్-8 రౌండ్ మ్యాచ్ లు కరీబియన్ ద్వీపాలలోని వేదికల్లో చకచకా ముగిసిపోతున్నాయి. తరచూ వానతో అంతరాయం కలుగుతున్నా తుదిఫలితాలు సాధ్యమవుతున్నాయి.

టీ-20 టాప్ ర్యాంకర్, హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటైన భారత్ సెమీఫైనల్స్ కు గురిపెట్టింది. సూపర్ - 8 రౌండ్ ప్రారంభమ్యాచ్ లో 10వ ర్యాంకర్ అప్ఘనిస్థాన్ ను 47 పరుగులతో చిత్తు చేసిన రోహిత్ సేన వరుసగా రెండో గెలుపుతో సెమీఫైనల్ నాకౌట్ రౌండ్లో చోటు ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.

లోస్కోరింగ్ పిచ్ పైన సమరం...

బ్యాటింగ్ కు అంతగా అనువుకాని, లోస్కోరింగ్ మ్యాచ్ ల వేదికగా ఉన్న అంటీగా సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా ఈ రోజు జరిగే రెండోరౌండ్ పోరులో 9వ ర్యాంకర్ బంగ్లాదేశ్ తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నా ప్రత్యర్థి బంగ్లాదేశ్ ను తక్కువ అంచనా వేస్తే అంతకు మించిన పొరపాటు మరొకటి లేదు.

స్పిన్ బౌలర్ల స్వర్గం లాంటి అంటీగా వికెట్ పైన రెండుజట్లలోని ఫింగర్ స్పిన్నర్లు మ్యాచ్ విన్నర్లుగా నిలిచే అవకాశం ఉంది.

100 నుంచి 122 పరుగుల స్కోర్లే...

అంటీగా స్టేడియం వేదికగా ఇటీవలి కాలంలో జరిగిన మ్యాచ్ ల్లో నమోదైన అత్యధిక మ్యాచ్ విన్నింగ్ సగటు స్కోరు 122 పరుగులు మాత్రమే. ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్లు 100కు పైగా పరుగులు సాధించడమే గగనమైపోతోంది.

ఈమ్యాచ్ లో టాస్ నెగ్గిన జట్టు ముందుగా బ్యాటింగ్ కు దిగే సాహసం చేయదనడంలో ఏమాత్రం సందేహం లేదు. టాస్ నెగ్గిన జట్టు మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకోడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

భారత ఓపెనింగ్ జోడీకి అసలు పరీక్ష...

పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత్ ను..ఓపెనర్ల వరుస వైఫల్యాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుత ప్రపంచకప్ లో గ్రూప్ లీగ్ నుంచి సూపర్-8 తొలిరౌండ్ వరకూ నాలుగుమ్యాచ్ లు ఆడిన భారత ఓపెనింగ్ జోడీ విరాట్- రోహిత్ కనీసం ఒక్క హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయలేకపోయారు.

ఓపెనర్ గా తన తొలి ప్రపంచకప్ ఆడుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ గత నాలుగు గేమ్ ల్లో 30 పరుగులు మాత్రమే చేయడం చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.

ఐర్లాండ్ పైన 2, పాకిస్థాన్ పైన 4 పరుగులు చేసిన విరాట్..అమెరికాతో మ్యాచ్ లో డకౌట్ గా వెనుదిరిగాడు. సూపర్ -8 రౌండ్లో అప్ఘనిస్థాన్ పైన ఆపసోపాలు పడి 24 పరుగుల స్కోరే సాధించగలిగాడు.

మరోవైపు..కెప్టెన్ రోహిత్ శర్మ తన తొలిపోరులో ఐర్లాండ్ పై హాఫ్ సెంచరీ సాధించడం మినహా మిగిలిన మూడు ఇన్నింగ్స్ లోనూ స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించలేకపోయాడు.

మిడిలార్డర్లో శివం దూబే, రవీంద్ర జడేజా సైతం విఫలమవుతూ వస్తున్నారు. వన్ డౌన్ రిషభ్ , రెండోడౌన్ సూర్యకుమార్, స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ మాత్రమే నిలకడగా రాణిస్తూ భారత్ కు కొండంత అండగా ఉన్నారు.

నిలకడలేమికి మరోపేరు బంగ్లాదేశ్...

టీ-20 9వ ర్యాంకర్ బంగ్లాదేశ్ బ్యాటింగ్ పరిస్థితి సైతం భారత్ కు ఏమాత్రం భిన్నంగా లేదు. ఓపెనర్ లిట్టన్ దాస్, తౌఫిక్ హృదయ్, సాంటో, షకీబుల్ లాంటి స్టార్ బ్యాటర్లు నిలకడలేమితో కొట్టిమిట్టాడుతున్నారు.

చచ్చీచెడీ సూపర్-8 రౌండ్ చేరిన బంగ్లాజట్టు..సూపర్-8 తొలిరౌండ్ పోరులో ఆస్ట్ర్రేలియా చేతిలో 28 పరుగుల పరాజయంతో డీలా పడిపోయింది. సెమీస్ అవకాశాలు సజీవంగా నిలుపుకోవాలంటే భారత్ తో జరిగే పోరులో బంగ్లాజట్టు నెగ్గితీరాల్సి ఉంది.

ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో కూడిన పవర్ ఫుల్ భారత బౌలింగ్ ఎటాక్ ను ఎదుర్కొనడం బంగ్లాజట్టుకు అంతతేలికకాదు.

భారత్ 12- బంగ్లాదేశ్ 1

టీ-20 ఫార్మాట్లో భారత్, బంగ్లాజట్లు ఇప్పటి వరకూ 13సార్లు తలపడితే..భారత్ 12 విజయాలు, బంగ్లాజట్టు ఒకే ఒక్క గెలుపు రికార్డుతో ఉన్నాయి.

టీ-20 ప్రపంచకప్ లో మాత్రం బంగ్లాపై నాలుగుకు నాలుగు మ్యాచ్ లూ నెగ్గిన తిరుగులేని రికార్డు భారత్ కు సొంతం. ఈ రోజు జరిగే సూపర్ - 8 రౌండ్లో సైతం విజయం తమదేనన్న ధీమాతో రోహిత్ సేన బరిలోకి దిగుతోంది.

టాన్జిద్ హసన్, షకీబుల్ హసన్, టాస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్, మెహిదీ హసన్ లతో కూడిన బంగ్లా బౌలింగ్ ఎటాక్ ను భారత బ్యాటర్లు ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్న గలరన్న అంశంపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.

బ్యాటింగ్ లో సూర్యకుమార్, బౌలింగ్ లో బుమ్రాల జోరుకు బంగ్లాదేశ్ బేజారెత్తిపోక తప్పదా?.. తెలుసుకోవాలంటే ఈరోజు రాత్రి 12 గంటల వరకూ వేచిచూడక తప్పదు.

Tags:    
Advertisement

Similar News