దక్షిణాఫ్రికాకు అచ్చిరాని ఈడెన్ గార్డెన్స్...
కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ సఫారీజట్టుకు వరుసగా రెండోసారి గుండెకోతను మిగిల్చింది
2023-ఐసీసీవన్డే ప్రపంచకప్ ఫైనల్స్ కు ఐదుసార్లువిజేత ఆస్ట్ర్రేలియా 8వ సారి చేరుకొంది. ఫైనల్లో భారత్ తో అమీతుమీ తేల్చుకోనుంది...
భారతగడ్డపై నాలుగోసారి జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్స్ కు ఐదుసార్లు విజేత ఆస్ట్ర్రేలియా చేరుకొంది. లీగ్ దశలో అదరగొట్టిన దక్షిణాఫ్రికా సెమీఫైనల్స్ నాకౌట్ లో తేలిపోయింది.
కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్స్ లోస్కోరింగ్ సమరంలో ఆస్ట్ర్రేలియా 3 వికెట్లతో సఫారీ టీమ్ ను అధిగమించింది.
దక్షిణాఫ్రికాకు అచ్చిరాని ఈడెన్ గార్డెన్స్...
ప్రపంచకప్ తొలిదశ రౌండ్ రాబిన్ లీగ్ లో సెంచరీల హోరు, పరుగుల జోరుతో చెలరేగిపోయిన దక్షిణాఫ్రికా సెమీఫైనల్ నాకౌట్ రౌండ్లో మరోసారి విఫలమయ్యింది. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ సఫారీజట్టుకు వరుసగా రెండోసారి గుండెకోతను మిగిల్చింది.
లీగ్ దశలో భారత్ చేతిలో 85 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా..సెమీఫైనల్లో 212 పరుగులకే ఆలౌటయ్యింది. టాస్ నెగ్గి ముందు బ్యాటింగ్ ఎంచుకొన్న దక్షిణాఫ్రికాను కంగారూ బౌలర్లు దెబ్బ మీద దెబ్బ కొట్టి కోలుకోనివ్వకుండా చేశారు.
ఫాస్ట్ బౌలర్ల జోడీ స్టార్క్, హేజిల్ వుడ్, పార్ట్ టైమ్ బౌలర్ ట్రావిస్ హెడ్ ల జోరుకు సఫారీటీమ్ బేజారెత్తిపోయింది. ఓపెనర్లు డీ కాక్, బువుమా, వన్ డౌన్ డ్యూసెన్ సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుట్ కాగా మర్కరమ్ 10, క్లాసెన్ 47 పరుగులకు వెనుదిరిగారు.
కిల్లర్ మిల్లర్ ఫైటింగ్ సెంచరీ...
ఒకదశలో 119 పరుగులకే 5 టాపార్డర్ వికెట్లు నష్టపోయిన దక్షిణాఫ్రికాను మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ఫైటింగ్ సెంచరీతో ఆదుకొన్నాడు. 116 బంతుల్లో 8 బౌండ్రీలు, 5 సిక్సర్లతో మిల్లర్ 101 పరుగులు సాధించడంతో సఫారీటీమ్ 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటయ్యింది.
కంగారూ బౌలర్లలో స్టార్క్, కమిన్స్ చెరో 3 వికెట్లు, హేజిల్ వుడ్, హెడ్ చెరో 2 వికెట్లు పడగొట్టడం ద్వారా సఫారీజట్టుకు పగ్గాలు వేయగలిగారు.
ట్రావిడ్ హెడ్ ఆల్ రౌండ్ షో...
మ్యాచ్ నెగ్గాలంటే 213 పరుగులు చేయాల్సిన ఆస్ట్ర్రేలియాకు ఓపెనింగ్ జోడీ డేవిడ్ వార్నర్- ట్రావిస్ హెడ్ మొదటి 6 ఓవర్లలోనే 61 పరుగుల భాగస్వామ్యంతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు.
వార్నర్ 29, మార్ష్ 0, స్టీవ్ స్మిత్ 30 పరుగులకు అవుట్ కావడంతో కంగారూజట్టుకు కష్టాలు మొదలయ్యాయి. మిడిల్ ఓవర్లలో సఫారీ స్పిన్ జోడీ కేశవ్ మహారాజ్, టబ్రీజ్ షంషీ కీలక వికెట్లు పడగొడుతూ ఒత్తిడి పెంచారు. డబుల్ సెంచరీ హీరో మాక్స్ వెల్ డకౌట్ గా వెనుదిరిగాడు.
మరోవైపు..ట్రావిస్ హెడ్ తనకు లభించిన అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని 62 పరుగులతో టాప్ స్కోరర్ గా తనజట్టును విజయం అంచులకు చేర్చాడు. 48 బంతుల్లో 2 సిక్సర్లు, 9 ఫోర్లతో హెడ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
193 పరుగులకే 7 వికెట్లు నష్టపోయిన ఆస్ట్ర్రేలియాను పేసర్లజోడీ స్టార్క్- కమిన్స్ ఆదుకొని మరో 16 బంతులు మిగిలిఉండగానే 3 వికెట్ల విజయంతో ఫైనల్స్ బెర్త్ ఖాయం చేశారు. స్టార్క్ 16, కమిన్స్ 14 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
సఫారీబౌలర్లలో కోట్జే, షంషీలకు చెరో 2 వికెట్లు, కేశవ్ మహారాజ్, రబడ, మర్కరమ్ చెరో వికెట్ పడగొట్టారు. ఆల్ రౌండ్ షోతో రాణించిన ట్రావిస్ హెడ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
దక్షిణాఫ్రికాకు మరో గుండె కోత...!
ప్రపంచకప్ టోర్నీలలో సెమీస్ వరకూ వచ్చి పరాజయాలు పొందటం దక్షిణాఫ్రికాకు ఇది ఐదవసారి. ఆస్ట్ర్రేలియాతో ఆడిన గత నాలుగుమ్యాచ్ ల్లోనూ తిరుగులేని విజయాలు సాధించిన సఫారీజట్టుకు ఈ నాకౌట్ పోరులో ఎదురైన ఓటమి గుండెకోతనే మిగిల్చింది.
48 సంవత్సరాల ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటికే 5సార్లు విజేతగా నిలిచిన ఆస్ట్ర్రేలియాకు ఫైనల్స్ చేరడం ఇది 8వసారి. రౌండ్ రాబిన్ లీగ్ దశలో రెండు వరుస పరాజయాల తరువాత 8 వరుస విజయాలతో సెమీస్ కు అర్హత సాధించడం, లోస్కోరింగ్ సెమీస్ లో సఫారీలను అధిగమించడం ద్వారా ఆస్ట్ర్రేలియా మరోసారి సత్తా చాటుకోగలిగింది.
అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగే టైటిల్ పోరులో టాప్ ర్యాంకర్ భారత్ తో ఆస్ట్ర్రేలియా పోటీపడనుంది.