దేశం పరువు తీయకు.. భారత కెప్టెన్ కు హితవు!

భారతక్రికెట్ గౌరవానికి భంగం కలిగించిన మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పై జరిమానాతో పాటు సస్పెన్షన్ వేటు పడింది.

Advertisement
Update:2023-07-26 14:30 IST

దేశం పరువు తీయకు.. భారత కెప్టెన్ కు హితవు!

భారతక్రికెట్ గౌరవానికి భంగం కలిగించిన మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పై జరిమానాతో పాటు సస్పెన్షన్ వేటు పడింది.

బంగ్లాదేశ్ తో మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో దురుసుగా, తలబిరుసుగా, క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన భారత మహిళాజట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పై విమర్శలు వెల్లువెత్తాయి. దానికితోడు భారీజరిమానాతో పాటు రెండుమ్యాచ్ ల నిషేధం వేటు సైతం పడింది.

భారత కెప్టెన్ సంస్కారం నేర్చుకోవాలి...

మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన ఆఖరి వన్డేలో అంపైర్ తప్పుడు నిర్ణయంతో అవుటైన భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అగ్గిమీద గుగ్గిలమయ్యింది.

ఆట 38వ ఓవర్లో బంగ్లా స్పిన్నర్ నహీదా అక్తర్ బౌలింగ్ లో స్వీప్ షాట్ ఆడటానికి ప్రయత్నించిన హర్మన్ ను అంపైర్ ఎల్బీడబ్లుగా ప్రకటించారు. అయితే ..హర్మన్ మాత్రం బంతి తన బ్యాటుకు తాకిందని, తాను అవుట్ కానేకాదంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది.

అంతటితో ఆగకుండా..స్టంపులను తన బ్యాట్ తో కొట్టి మరీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అదీ చాలదన్నట్లు..సిరీస్ సంయుక్త విజేతగా ట్రోఫీ అందుకొనే సమయంలో సైతం

అంపైర్ల నుద్దేశించి అనుచితంగా వ్యాఖ్యానించింది. అంపైరింగ్ చెత్తగా, పరమదారుణంగా ఉందంటూ మండిపడింది.

దీంతో..బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తానా తనజట్టు సభ్యులతో కలసి బహుమతి ప్రదానకార్యక్రమం నుంచి వాకౌట్ చేసింది.

ఆఖరివన్డే ఆడుతూ భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రవర్తించిన తీరును బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా తప్పుపట్టింది. భారత కెప్టెన్ ముందుగా సంస్కారం నేర్చుకోవాలంటూ చురకలంటించింది.

భారీజరిమానా, రెండుమ్యాచ్ ల సస్పెన్షన్...

హర్మన్ ప్రీత్ అనుచిత ప్రవర్తనను ఐసీసీ మ్యాచ్ రిఫరీ సైతం తీవ్రంగా పరిగణించారు. ఫీల్డ్ అంపైర్లు చేసిన ఫిర్యాదుతో హర్మన్ పై నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు చేపట్టారు.

క్రికెటర్ల క్రమశిక్షణ నియమావళి ప్రకారం హర్మన్ ప్రీత్ కౌర్ కు చెల్లించే 4 లక్షల రూపాయల మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాగా కోత విధించడంతో పాటు మూడు డీమెరిట్ పాయింట్లు ఇచ్చారు.

క్రికెట్లో అంపైర్లు చెప్పిందే వేదం. అంపైర్ల నిర్ణయాన్ని ప్రశ్నించడం లేదా తప్పుపట్టడం నేరం. ఐసీసీ నియమావళి 2.8 ప్రకారం తీవ్రమైన తప్పిదం. అంతేకాదు..అంపైరింగ్ ప్రమాణాల పై వ్యాఖ్యానించడం, అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు లెవెల్-1 నేరం కింద మ్యాచ్ ఫీజు నుంచి మరో 25 శాతం జరిమానాగా కోత పెట్టారు. మొత్తం మీద..నాలుగు లక్షల మ్యాచ్ ఫీజు నుంచి 3లక్షల వరకూ జరిమానాగా నష్టపోవాల్సి వచ్చింది.

అంతేకాదు..మొత్తం 7 డీమెరిట్ పాయింట్ల కారణంగా రెండుమ్యాచ్ ల సస్పెన్ష్ వేటుకు సైతం హర్మన్ గురికావాల్సి వచ్చింది. భారత్ త్వరలో ఆడే ఓ టెస్టుమ్యాచ్ లేదా..రెండు వన్డేలు లేదా రెండు టీ-20 మ్యాచ్ లకూ హర్మన్ దూరంగా ఉండాల్సి వస్తుంది.

ఐసీసీ మ్యాచ్ రిఫరీ చేసిన ఆరోపణలను హర్మన్ ప్రీత్ అంగీకరించింది. జరిమానాతో పాటు శిక్షను సైతం భరించడానికి సమ్మతి తెలిపింది.

ఐసీసీ క్రికెటర్ల క్రమశిక్షణ నియమావళి ప్రకారం లెవిల్ -1 తప్పిదం ప్రకారం మ్యాచ్ ఫీజులో 50నుంచి 100 శాతం వరకూ జరిమానా విధించడంతో పాటు మందలింపు, రెండు డీమెరిట్ పాయింట్లు ఇస్తారు.

అదే లెవిల్ -2 తప్పిదానికి పాల్పడితే 4 డీమెరిట్ పాయింట్లతో మ్యాచ్ ఫీజు లో కోత విధించడం, సస్పెన్షన్ విధించడం ఉంటుంది.

హర్మన్ పై మాజీల గరంగరం..

అంతర్జాతీయ క్రీడల్లో భారత్ కు ప్రాతినిథ్యం వహించే క్రీడాకారులంతా..క్రీడారాయబారులేనని, ఆటతో పాటు మర్యాదగా,హుందాగా ప్రవర్తించడం ప్రధానమని..అయితే భారత మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అనుచితంగా ప్రవర్తించడం గర్హనీయమని భారత మాజీ కెప్టెన్, చీఫ్ సెలెక్టర్ శాంతా రంగస్వామి మండిపడ్డారు.

తాను గొప్ప ప్లేయర్ నని హర్మన్ భావిస్తే అది ఆమె ఇష్టమని, అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడే సమయంలో అనుచితంగా ప్రవర్తిస్తూ దేశం పరువుతీసే అధికారం ఎవ్వరూ ఇవ్వలేదని గుర్తు చేశారు. భారత్- బంగ్లా క్రికెట్ సంబంధాలకు ఇది గండికొట్టే చర్య అంటూ విమర్శించారు.

భారత మాజీ ఆల్ రౌండర్, వన్డే ప్రపంచకప్ హీరో మదన్ లాల్ సైతం..హర్మన్ ప్రీత్ కౌర్ ప్రవర్తన పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. జట్టుకు కెప్టెన్ గా ఉండి అమర్యాదగా ప్రవర్తించినందుకు హర్మన్ ను జట్టు నుంచి తొలగించాలని సూచించారు.

గతంలో నకిలీ సర్టిఫికెట్లతో పంజాబ్ ప్రభుత్వంలో డీఎస్పీ ఉద్యోగం సంపాదించడం ద్వారా తీవ్రవిమర్శలు ఎదుర్కొన్న హర్మన్ ప్రీత్ కౌర్.. ప్రస్తుతం మరో వివాదంలో చిక్కుకొని పీకలోతు కష్టాలలో కూరుకుపోయింది.

మహిళా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు నాయకత్వం వహిస్తున్న హర్మన్ ప్రీత్..టెస్టు, వన్డే, టీ-20 ఫార్మాట్లలో భారతజట్లకు కెప్టెన్ గా వ్యవహరిస్తోంది.

హర్మన్ తీరును బీసీసీఐ సైతం తీవ్రంగా పరిగణించే అవకాశాలు లేకపోలేదు.

Tags:    
Advertisement

Similar News