పాండ్యా షో, దుబాయ్ థ్రిల్లర్ లో భారత్ విన్నర్!

ఆసియాకప్ -2022 టైటిల్ వేటను ఏడుసార్లు విజేత భారత్ కళ్లు చెదిరే విజయంతో ప్రారంభించింది. గ్రూప్-ఏ లీగ్ ప్రారంభపోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను 5 వికెట్లతో అధిగమించింది. 2021 టీ-20 ప్రపంచకప్ ఓటమికి బదులుతీర్చుకొంది.

Advertisement
Update:2022-08-29 09:44 IST

ఆసియాకప్ -2022 టైటిల్ వేటను ఏడుసార్లు విజేత భారత్ కళ్లు చెదిరే విజయంతో ప్రారంభించింది. గ్రూప్-ఏ లీగ్ ప్రారంభపోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను 5 వికెట్లతో అధిగమించింది. 2021 టీ-20 ప్రపంచకప్ ఓటమికి బదులుతీర్చుకొంది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న 2022 ఆసియాకప్ టీ-20 టోర్నీ గ్రూప్ -ఏ లీగ్ ప్రారంభమ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ సంచలన విజయం సాధించింది.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఆఖరిఓవర్ వరకూ సస్పెన్స్ థ్రిల్లర్లా సాగిన పోరులో భారత్ 5 వికెట్ల విజయంతో శుభారంభం చేసింది. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన హార్థిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

భారత పేసర్ల సరికొత్త రికార్డు...

బ్యాటింగ్ కు అంతగా అనువుకాని దుబాయ్ స్టేడియం పిచ్ పై...ముందుగా టాస్ నెగ్గిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకొ్న్నాడు.

ప్రారంభ ఓవర్లలోనే పాక్ స్టార్ ప్లేయర్లు బాబర్ అజామ్, ఫకర్ జమాన్ లను కేవలం 10 పరుగుల స్కోర్లకే భారత పేసర్లు భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్ పెవీలియన్ దారి పట్టించారు.

అయితే...పాక్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ తనదైనశైలిలో దూకుడుగా ఆడుతూ భారత్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. మిడిల్ ఓవర్లలో బౌలింగ్ కు దిగిన పేస్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో షార్ట్ పిచ్ బంతులు విసిరి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలు చేశాడు.

మిడిలార్డర్ ఆటగాళ్లలో ఇఫ్తీకర్ 28, కుష్ దిల్ 2, షదాబ్ ఖాన్ 10, అసీఫ్ అలీ 9, నవాజ్ 1, హారిస్ రవూఫ్ 13 పరుగులు సాధించారు. భారత స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఒకే ఓవర్లో వెంటవెంటనే రెండు వికెట్లు పడగొట్టడంతో..పాక్ జట్టు ఒకదశలో 128 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. టెయిల్ ఎండర్లు దహానీ- రవూఫ్ ఆదుకొన్నారు. దహానీ 6 బాల్స్ లో 2 బౌండ్రీలతో 16 పరుగులు సాధించడంతో పాక్ జట్టు 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటయ్యింది.

భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 26 పరుగులిచ్చి 4 వికెట్లు, హార్థిక్ పాండ్యా 25 పరుగులిచ్చి 3 వికెట్లు, అర్షదీప్ 33 పరుగులిచ్చి 2 వికెట్లు, ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టారు.

మొత్తం 10 వికెట్లను భారత పేస్ బౌలర్లే పడగొట్టడం విశేషం. ఓ టీ-20 మ్యాచ్ లో 10కి 10 వికెట్లు పేస్ బౌలర్లే పడగొట్టడం ఇదే మొదటిసారి. లెగ్ స్పిన్నర్ చహాల్, లెఫ్టామ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా వికెట్లు పడగొట్టక పోయినా పాక్ బ్యాటర్లను కట్టడి చేయగలిగారు.



జడేజా, పాండ్యా పవర్ తో గట్టెక్కిన భారత్...

20 ఓవర్లలో 148 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ కు పాక్ యువఫాస్ట్ బౌలర్లు నసీమ్ షా, షానవాజ్ దహానీ ప్రారంభఓవర్లలోనే నిప్పులు చెరిగే బౌలింగ్ తో చుక్కలు చూపించారు.

తొలి ఓవర్ మూడో బంతికే ఓపెనర్ రాహుల్ ను టీనేజ్ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా..డకౌట్ గా పెవీలియన్ దారి పట్టించాడు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్- మాజీ కెప్టెన్ విరాట్..తమ అనుభవాన్నంతా ఉపయోగించి క్రీజులో నిలదొక్కుకోడానికి ప్రయత్నించారు.

తన కెరియర్ లో 100వ టీ-20 మ్యాచ్ ఆడుతున్న విరాట్ కొహ్లీ అడపాదడపా తన ట్రేడ్ మార్క్ షాట్లు ఆడినా పూర్తిఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయలేకపోయాడు.

మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ సైతం దూకుడు ప్రదర్శించలేకపోయాడు.

పాక్ స్పిన్ జోడీ షదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ కుదురైన బౌలింగ్ తో ఆకట్టుకొన్నారు. అప్పటికే 18 బంతులు ఎదుర్కొని ఓ సిక్సర్ తో 12 పరుగులు సాధించిన రోహిత్...ఓ భారీషాట్ కు వెళ్ళి అవుట్ కావడంతో భారత్ రెండో వికెట్ నష్టపోయింది.

జడేజాకు బ్యాటింగ్ ప్రమోషన్...

రోహిత్ శర్మ అవుట్ కావడంతోనే లోయర్ ఆర్డర్ లో ఆడే రవీంద్ర జడేజాకు ప్రమోషన్ ఇచ్చి రెండోడౌన్ లో బ్యాటింగ్ కు దించడం భారత్ కు కలిసొచ్చింది. పాక్ స్పిన్ జోడీని నిలువరించడంతో పాటు...స్ట్ర్రయిక్ రొటేట్ చేయడంలో జడేజా తనవంతు పాత్ర నిర్వర్తించాడు.

మరోవైపు...విరాట్ కొహ్లీ 34 బాల్స్ లో 3 బౌండ్రీలు, ఓ సిక్సర్ హిట్ తో 35 పరుగులు చేయడం ద్వారా నిలదొక్కుకొన్నట్లే కనిపించాడు. ఓ మిస్ హిట్ షాట్ తో స్పిన్నర్ నవాజ్ కు చిక్కాడు.

ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తో కలసి జడేజా నాలుగో వికెట్ కు 36 పరుగుల కీలక భాగస్వామ్యంతో భారత పోరాటం కొనసాగించాడు. సూర్యకుమార్ 18 బాల్స్ లో ఒకే ఒక్క బౌండ్రీతో 18 పరుగుల స్కోరుకు పాస్ట్ బౌలర్ నసీమ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. దీంతో గెలుపు భారం మరోసారి వచ్చి హార్థిక్ పాండ్యా భుజం మీద పడింది.

పాండ్యా- జడేజా కీలక భాగస్వామ్యం..

రవీంద్ర జడేజా- హార్థిక్ పాండ్యా జోడీ 5వ వికెట్ కు సాధించిన 52 పరుగుల కీలక భాగస్వామ్యమే భారత్ ను విజేతగా నిలిపింది. ఆఖరి 10 ఓవర్లలో 86 పరుగులు చేయాల్సిన భారత్ ను పాండ్యా- జడేజా జోడీ ఆదుకొంది. జడేజా 29 బాల్స్ లో 35 పరుగులకు అవుట్ కాగా, పాండ్యా 17 బాల్స్ లో 33 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే హార్థిక్ పాండ్యా సిక్సర్ బాదడం ద్వారా భారత్ కు 5 వికెట్ల విజయం ఖాయం చేశాడు.

బౌలర్ గా 3 వికెట్లు, బ్యాటర్ గా 33 పరుగుల నాటౌట్ స్కోరు సాధించిన హార్థిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆడిన గత 19 టీ-20 మ్యాచ్ ల్లో పాకిస్థాన్ కు ఇది రెండో ఓటమి మాత్రమే కావడం మరో విశేషం.

పాకిస్థాన్ స్లో ఓవర్ రేటు కారణంగా...ఇన్ సైడ్ రింగ్ లో అదనపు ఫీల్డర్ ను విధిగా ఉంచాల్సిరావడం కూడా భారత్ కు కలిసొచ్చింది. ఐసీసీ తాజా నిబంధనల ప్రకారం స్లో ఓవర్ రేటుకు పెనాల్టీకి బదులుగా ఫీల్డింగ్ నిబంధనను సరికొత్తగా ప్రవేశపెట్టారు.

గ్రూప్- ఏ లీగ్ ఆఖరి రెండురౌండ్ల మ్యాచ్ ల్లో హాంకాంగ్ తో భారత్, పాక్ జట్లు తలపడాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News