ప్రపంచకప్ లో నేడే టైటిల్ సమరం!

ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో నేడు జరిగే టైటిల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ కు మాజీ చాంపియన్ అర్జెంటీనా సవాలు విసురుతోంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8-30 గంటలకు ఈ సూపర్ సండే ఫైట్ ప్రారంభంకానుంది.

Advertisement
Update:2022-12-18 10:44 IST

ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో నేడు జరిగే టైటిల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ కు మాజీ చాంపియన్ అర్జెంటీనా సవాలు విసురుతోంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8-30 గంటలకు ఈ సూపర్ సండే ఫైట్ ప్రారంభంకానుంది...

ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను గత నాలుగువారాలుగా అలరిస్తూ వచ్చిన ప్రపంచ ఫుట్ బాల్ సంబంరం ముగింపు దశకు చేరుకొంది. 32 దేశాలజట్లు గ్రూప్ లీగ్ నుంచి నాకౌట్ రౌండ్ వరకూ తలపడితే చివరకు..రెండు అత్యుత్తమజట్లు ఫ్రాన్స్, అర్జెంటీనా టైటిల్ సమరానికి అర్హత సాధించగలిగాయి.

మిడ్ ఫీల్డ్ మాంత్రికుడు

, ప్రపంచ అత్యుత్తమ ఆటగాడు లయనల్ మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా మూడోసారి ప్రపంచకప్ గెలుచుకోవాలని తహతహలాడుతోంది. మరోవైపు బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ తో బ్రెజిల్ సరసన నిలవాలని ప్రస్తుత చాంపియన్ ఫ్రాన్స్ భావిస్తోంది.

36 ఏళ్ళ నిరీక్షణ...

1986లో చివరిసారిగా ప్రపంచకప్ నెగ్గిన అర్జెంటీనా ఆ తర్వాత నుంచి మరో టైటిల్ కోసం గత 36 సంవత్సరాలుగా ఎదురుచూస్తూనే వస్తోంది. పైగా..లయనల్ మెస్సీ కెరియర్ లో సైతం ఇదే ఆఖరి ప్రపంచకప్ కావడంతో..ఆరునూరైనా టైటిల్ నెగ్గాలన్న పట్టుదలతో పోటీకి దిగుతోంది.

గ్రూప్ లీగ్ ప్రారంభమ్యాచ్ లో సౌదీ అరేబియా చేతిలో ఓటమితో టోర్నీని ఆరంభించిన అర్జెంటీనా ఆ తర్వాత నుంచి విజయపరంపర కొనసాగించింది. గ్రూప్-సీ లీగ్ టాపర్ గా ప్రీ-క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన అర్జెంటీనా...నాకౌట్ మ్యాచ్ ల్లో ఆస్ట్ర్రేలియా, క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్, సెమీఫైనల్లో క్రొయేషియాను చిత్తు చేయడం ద్వారా ఆరోసారి ఫైనల్లో అడుగుపెట్టింది.

ఆరోసారి టైటిల్ సమరంలో అర్జెంటీనా..

1978, 1986 ప్రపంచకప్ టోర్నీలలో విశ్వవిజేతగా నిలిచిన అర్జెంటీనా ప్రస్తుత ప్రపంచకప్ ద్వారా ఆరోసారి ఫైనల్ చేరుకోగలిగింది. 1990, 2014 ప్రపంచకప్ టోర్నీల ఫైనల్స్ చేరినా..రన్నరప్ గానే మిగలాల్సి వచ్చింది.

మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా జట్టులో అల్వేరేజ్, ఎంజో ఫెర్నాండేజ్, ఎమిలియానో మార్టినెజ్ లతో కూడిన మెరికల్లాంటి ఆటగాళ్లున్నారు. అంతేకాదు..ఇప్పటి వరకూ ఆడిన ప్రస్తుత ప్రపంచకప్ మ్యాచ్ ల్లో 5 గోల్స్ సాధించడం ద్వారా మెస్సీ...గోల్డెన్ బూట్ రేస్ లో సైతం ఫ్రెంచ్ స్ట్ర్రయికర్ ఎంబప్పేతో పోటీలో ఉన్నాడు.

ప్రపంచకప్ ఫుట్ బాల్ చరిత్రలోనే అత్యధికంగా 25 మ్యాచ్ లు ఆడిన మెస్సీ..ఈరోజు జరిగే టైటిల్ పోరులో పవర్ ఫుల్ ఫ్రాన్స్ ను కంగు తినిపించడం ద్వారా తనజట్టును విజేతగా నిలపాలన్న పట్టుదలతో ఉన్నాడు.

పవర్ ఫుల్ ఫ్రాన్స్...

ఇక...డిఫెండింగ్ చాంపియన్ హోదాలో వరుసగా రెండోసారి ఫైనల్స్ చేరిన ఫ్రాన్స్ హాట్ ఫేవరెట్ గా టైటిల్ సమరంలో పోటీపడుతోంది. ఆరునూరైనా టైటిల్ నెగ్గి తీరాలన్న పట్టుదలతో ఉంది.

పవర్ సాకర్ కు మరో పేరైన ఫ్రాన్స్ జట్టు ప్రస్తుత టో్ర్నీ గ్రూప్ లీగ్ దశ నుంచి సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్ వరకూ ఒక్క ఓటమి మాత్రమే చవిచూసింది. డైనమైట్ల లాంటి పలువురు ఆటగాళ్లతో కూడిన ఫ్రాన్స్ ను అడ్డుకోడం, నిలువరించడం అర్జెంటీనాకు ఏమాత్రం తేలికకాదు. కేవలం మెస్సీ ప్రతిభపైనే అర్జెంటీనా ఆధారపడితే..ఫ్రాన్స్ జట్టులో

పలువురు మ్యాచ్ విన్నర్లు ఉండటం అదనపు బలంగా మారింది.

సూపర్ స్ట్ర్రయికర్ ఎంబప్పే కు పగ్గాలు వేయకుంటే అర్జెంటీనాకు కష్టాలు తప్పవు. ఇప్పటికే ప్రస్తుత టోర్నీలో ఎంబప్పే సాధించిన ఐదుగోల్సూ ..ఫీల్డ్ గోల్సే కావడం విశేషం.

ఎంబప్పే సైతం 5 గోల్స్ తో మెస్సీతో సమఉజ్జీగా గోల్డెన్ బూట్ కోసం పోటీపడుతున్నాడు.

ఫైనల్లో మెస్సీ మ్యాజిక్ చేస్తాడా?..లేక ఎంబప్పే అదరగొడతాడా? అన్న ఆసక్తితో సాకర్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

విజేతకు 538కోట్ల భారీనజరానా!

ఈరోజు జరిగే టైటిల్ సమరంలో విజేతగా నిలిచిన జట్టు..ఫిఫా ప్రపంచకప్ తో పాటు 538 కోట్ల రూపాయల భారీనజరానా అందుకోనుంది. క్రీడాచరిత్రలోనే అతిపెద్ద ప్రైజ్ మనీ ఇదే కావడం విశేషం.

2018 ప్రపంచకప్ ఫైనల్లో క్రొయేషియాను చిత్తు చేసి విజేతగా నిలిచిన ఫ్రాన్స్ కు ప్రస్తుత ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనా లాంటి మేటిజట్టు ప్రత్యర్థిగా నిలిచింది.

ఖతర్ రాజధాని దోహాలోని లూసెయిల్ స్టేడియం వేదికగా రాత్రి 8-30 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్స్ హోరాహోరీగా సాగుతుందా..లేక ఏకపక్షంగా ముగుస్తుందా?

తెలుసుకోవాలంటే మరికొద్దిగంటలపాటు సస్పెన్స్ భరించక తప్పదు.

Tags:    
Advertisement

Similar News