విరాట్ విశ్వరూపం.. పాక్‌పై ఇండియా అద్భుత విజయం
పాకిస్తాన్ బౌలర్ రవూఫ్ పరుగులు ఇవ్వకుండా ఇద్దరు బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. మూడు ఓవర్లలో 48 పరుగులు రావల్సిన సమయంలో కోహ్లీ విజృభించాడు.
భారత క్రికెట్ అభిమానులకు దీపావళి ఒక రోజు ముందే వచ్చింది. ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎలా ఉండాలని భావిస్తారో.. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా జరిగింది. దాదాపు లక్ష మంది ప్రేక్షకుల మధ్య.. ఆస్ట్రేలియాలోనే అతి పెద్ద స్టేడియం మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగిన దాయాదిల పోరులో భారత జట్టు అద్బుత విజయాన్ని సాధించింది. చివరి వరకు పాకిస్తాన్ వైపే ఉన్న మ్యాచ్‌ను కింగ్ కోహ్లీ పూర్తిగా టర్న్ చేశాడు. ఒక సారి స్టాండ్ అయితే తనను ఏ బౌలర్ కూడా బీట్ చేయలేడనే ధీమాతో కోహ్లీ తన విశ్వరూపం ప్రదర్శించాడు. చివరి 5 ఓవర్లలో 12కి పైగా రన్‌రేట్‌తో బ్యాటింగ్ చేయాల్సిన సందర్భంలో కోహ్లీ రెచ్చిపోయాడు. గత ఏడాది దుబాయ్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్‌లో పరాభవానికి టీమ్ ఇండియా పగ తీర్చుకుంది. టీ20 వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గ్రూప్2లో భాగంగా ఇవ్వాళ ఇండియా - పాకిస్తాన్ మధ్య మెల్‌బోర్న్‌లో మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ కాస్త నెమ్మదిగా ప్రారంభమైంది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే కెప్టెన్ బాబర్ అజమ్ (0) అర్షదీప్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (4) కూడా అర్షదీప్ బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో పాకిస్తాన్ జట్టు 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే షాన్ మసూద్, ఇఫ్తికర్ అహ్మద్ పాకిస్తాన్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు మొదట్లో ఆచితూచి ఆడినా.. ఆ తర్వాత బౌండరీలు, సిక్సర్లతో విరుచుకపడ్డారు. ముఖ్యంగా ఇఫ్తికర్ భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగారు.
ఇఫ్తికర్, షాన్ మసూద్ కలిసి మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని మహ్మద్ షమి విడదీశాడు. షమి బౌలింగ్‌లో ఇఫ్తికర్ ఎల్బీడబ్ల్యూగా పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత పాక్ బ్యాటర్లు ఎవరూ క్రిజ్‌లో నిలబడలేక పోయారు. షాదాబ్ ఖాన్ (5), హైదరా్ అలీ (2), మహ్మద్ నవాజ్ (9)లను తక్కువ స్కోరుకే హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. అసిఫ్ అలీ (2)ని అర్షదీప్ వెనక్కు పంపాడు. అయితే మరో ఎండ్‌లో మాత్రం షాన్ మసూద్ పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడు అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖర్లో షాహిన్ అఫ్రిది (16) కాస్త బ్యాట్ ఝులిపించి అవుట్ అయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 159 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. పాండ్యా, అర్షదీప్ చెరి 3 వికెట్లు, భువనేశ్వర్ కుమార్, షమి తలా ఒక వికెట్ తీశారు.
విఫలమైన ఓపెనర్లు..
160 పరుగుల సాధ్యమయ్యే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు పేలవ ఆరంభం లభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (4), రోహిత్ శర్మ (4) పూర్తిగా నిరాశపరిచారు. సూర్యకుమార్ యాదవ్ (15) రెండు బౌండరీలు బాది టచ్‌లో ఉన్నట్లు కనిపించినా.. హారిస్ రవూఫ్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై కీపర్ రిజ్వాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అక్షర్ పటేల్ (2) అనవసరమైన పరుగుకు ప్రయత్నించి పెవీలియన్ చేరాడు. దీంతో భారత జట్టు 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అభిమానులంతా కోహ్లీ, హార్దిక్ పాండ్యా క్రీజులో ఉండటంతో కాస్త ఆశతో ఉన్నారు. కానీ పాకిస్తాన్ బౌలర్లు బౌండరీలు రాకుండా జాగ్రత్తగా బౌలింగ్ చేశారు. సింగిల్స్, డబుల్స్ తీస్తూ పరుగులు జత చేస్తున్నా.. కావల్సిన రన్ రేట్ మాత్రం భారీగా పెరిగిపోతూ వచ్చింది.
ఆఖరి 6 ఓవర్లలో భారత జట్టు 12 పరుగుల రన్‌రేట్ కంటే ఎక్కువగా పరుగులు చేయాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి విరాట్ తన విశ్వరూపం చూపించాడు. సిక్సులు, ఫోర్లు కొడుతూ పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడికి మరో ఎండ్‌లో హార్దిక్ పాండ్యా కూడా బ్యాట్ ఝులిపించాడు. ఇద్దరు కలిసి భారత జట్టును విజయం వైపు నడిపించారు. అయితే పాకిస్తాన్ బౌలర్ రవూఫ్ పరుగులు ఇవ్వకుండా ఇద్దరు బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. మూడు ఓవర్లలో 48 పరుగులు రావల్సిన సమయంలో కోహ్లీ విజృభించాడు. రవూఫ్ వేసిన 18వ ఓవర్‌లో కోహ్లీ మూడు బౌండరీలు కొట్టాడు. ఆ ఓవర్‌లో ఏకంగా 18 పరుగులు వచ్చాయి. 19వ ఓవర్‌లో చివరి రెండు బంతులను కోహ్లీ సిక్సులుగా మార్చాడు. దీంతో చివరి ఓవర్లో భారత జట్టు విజయానికి 16 పరుగులు అవసరం అయ్యాయి.
చివరి ఓవర్లో ఉత్కంఠ..
మ్యాచ్ మొత్తం ఒక ఎత్తైతే చివరి ఓవర్ అంతకు మించిన టెన్షన్ పెట్టింది. కోహ్లీతో కలిసి 100కు పైగా భాగస్వామ్యం అందించిన హార్దిక్ పాండ్యా.. మహ్మద్ నవాజ్ వేసిన తొలి బంతికే భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. ఆ తర్వాత బంతికి కార్తీక్ ఒక పరుగు, మూడో బంతికి కోహ్లీ రెండు పరుగులు చేశాడు. నాలుగో బంతికి కోహ్లీ భారీ సిక్స్ కొట్టాడు. అదే సమయంలో లెగ్ అంపైర్ దాన్ని నోబాల్‌గా ప్రకటించాడు. దీంతో ఆ బంతికి ఏడు పరుగుల లభించాయి. తర్వాత బంతి వైడ్ పోయింది. దీంతో ఫ్రీ హిట్ అలాగే ఉంది. ఈ సారి నవాజ్ వేసిన బంతి కోహ్లీని బీట్ చేసి వికెట్లను గిరాటేసింది. ఫ్రీ హిట్ కావడంతో కోహ్లీ చాకచక్యంగా వ్యవహరించి మూడు పరుగులు తీశాడు. అప్పడు పాకిస్తాన్ ప్లేయర్లు భారత బ్యాటర్లు పరుగులు ఎలా తీస్తారంటూ అంపైర్లతో వాగ్వివాదానికి దిగారు. కానీ, అంపైర్ మాత్రం మూడు బైస్ ఇచ్చాడు.
ఆ తర్వాత బంతికి దినేశ్ కార్తీక్ అనూహ్యంగా స్టంప్ అవుట్ అయ్యాడు. దీంతో చివరి బంతికి రెండు పరుగుల అవసరం అయ్యింది. అయితే నవాజ్ మరోసారి వైడ్ వేశాడు. దీంతో స్కోర్లు సమం అయ్యాయి. చివరగా రవిచంద్రన్ అశ్విన్ ఏ మాత్రం పొరపాటు చేయకుండా ఫీల్డర్ల మీదుగా బంతిని కొట్టి భారత్‌కు చిరస్మరనీయ విజయం దక్కింది. ఈ విజయంతో భారత అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. గెలుస్తామని భావించిన పాకిస్తాన్ జట్టు పూర్తి నిరాశలో కూరుకొని పోయింది. విరాట్ కోహ్లీ వారి ఆశలన్నీ అడియాసలు చేసేశాడు. ఈ విజయంతో భారత జట్టు ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. అద్బుత విజయాన్ని అందించిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
పాకిస్తాన్ : 159/8
ఇండియా : 160/6