నేడే ప్రపంచకప్ టైటిల్ సమరం, ఇంగ్లండ్ 57 ఏళ్ల నిరీక్షణ ఫలించేనా?

2023-మహిళా ప్రపంచకప్ ఫుట్ బాల్ టైటిల్ సమరానికి ఆస్ట్ర్రేలియాలోని సిడ్నీనగర స్టేడియం వేదికగా రంగం సిద్ధమయ్యింది.

Advertisement
Update:2023-08-20 17:55 IST

2023-మహిళా ప్రపంచకప్ ఫుట్ బాల్ టైటిల్ సమరానికి ఆస్ట్ర్రేలియాలోని సిడ్నీనగర స్టేడియం వేదికగా రంగం సిద్ధమయ్యింది. హాట్ ఫేవరెట్ ఇంగ్లండ్ కు సంచలనాల స్పెయిన్ సవాలు విసురుతోంది...

న్యూజిలాండ్, ఆస్ట్ర్రేలియా దేశాల సంయుక్త ఆతిథ్యంలో గత నాలుగు వారాలుగా సాగుతున్న 32 జట్ల ఫీఫా- 2023 మహిళా ప్రపంచకప్ ఫుట్ బాల్ సమరం ముగింపు దశకు చేరింది.

ఆస్ట్ర్రేలియాలోని సిడ్నీ నగరం స్టేడియం వేదికగా జరిగే టైటిల్ పోరులో యూరోపియన్ చాంపియన్ ఇంగ్లండ్, డార్క్ హార్స్ స్పెయిన్ ఢీ కొనబోతున్నాయి. ఈ రెండింటిలో ఏ జట్టు విజేతగా నిలిచినా అది సరికొత్త చరిత్రే అవుతుంది.

ఇంగ్లండ్ ను ఊరిస్తున్న ప్రపంచకప్..

ఫుట్ బాల్ ప్రపంచకప్ టైటిల్ కోసం పురుషుల, మహిళల విభాగాలలో ఇంగ్లండ్ గత 57 సంవత్సరాలుగా ఎక్కడలేని ఓర్పుతో ఎదురుచూస్తోంది. 2023 పీఫా మహిళా ప్రపంచకప్ ఫైనల్స్ కు ఇంగ్లండ్ అలవోకగా చేరుకోడంతో టైటిల్ కు గెలుపుదూరంలో నిలిచినట్లయ్యింది. విశ్వవిజేతగా నిలవటానికి ఇంతకుమించిన సువర్ణఅవకాశం మరొకటిలేదని ఇంగ్లండ్ లోని సాకర్ అభిమానులతో పాటు విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.

1966లో ఇంగ్లండ్ పురుషుల జట్టు ప్రపంచ చాంపియన్ గా నిలిచిన తరువాత మరోసారి విజేతగా నిలవడంలో ఇంగ్లండ్ పురుషుల, మహిళలజట్లు విఫలమయ్యాయి.

2017 మహిళా ప్రపంచకప్ ఫుట్ బాల్ ఫైనల్స్ కు ఇంగ్లండ్ చేరినా టైటిల్ నెగ్గలేక రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఐదేళ్ల విరామానికి మరోసారి ఫైనల్ బెర్త్ సాధించగలిగింది.

వరుస విజయాలతో ఫైనల్ కు...

ప్రస్తుత ప్రపంచకప్ అత్యుత్తమజట్లలో ఒకటిగా బరిలో నిలిచిన ఇంగ్లండ్ హాట్ ఫేవరెట్ ముద్రతో టైటిల్ వేట మొదలు పెట్టింది. లీగ్ దశ నుంచి సెమీఫైనల్స్ నాకౌట్ వరకూ

తిరుగులేని విజయాలు సాధిస్తూ ఫైనల్లో అడుగుపెట్టడంతోనే ఇంగ్లండ్ దేశందేశమే సాకర్ మానియాలో మునిగిపోయింది.

ఫైనల్లో చోటు కోసం జరిగిన రెండో సెమీఫైనల్లో 3-1 గోల్స్ తో ఆతిథ్య ఆస్ట్ర్రేలియాను చిత్తు చేయడం ద్వారా ఇంగ్లండ్ రెండోసారి టైటిల్ సమరంలో నిలువగలిగింది.

స్పెయిన్ తో జరిగే ఆఖరిపోరులో గెలుపు తమదేనన్న ధీమా ఇంగ్లండ్ జట్టు సభ్యులతో పాటు టీమ్ మేనేజ్ మెంట్ లో సైతం కనిపిస్తోంది. పైగా ఇంగ్లండ్ జట్టుకు జాతీయ పురుషులజట్టు నాయకుడు హ్యారీ కేన్, బ్రిటీష్ రాజు చార్లెస్ -3, ప్రధాని రిషి సునక్ తో పాటు పలువురు ప్రముఖులు ఇప్పటికే అభినందన సందేశాలు పంపడం ద్వారా స్ఫూర్తిని నింపారు.

అంచనాలకు అందని స్పెయిన్...

ప్రపంచ మేటిజట్లన్నీ క్వార్టర్ ఫైనల్ దశలోనే సంచలన పరాజయాలతో టోర్నీ నుంచి నిష్క్ర్రమిస్తే...ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన స్పెయిన్ అనూహ్యంగా ఫైనల్స్ చేరడం ద్వారా టైటిల్ రేస్ లో నిలవడం ద్వారా అందర్నీ ఆశ్చర్యంలో పడవేసింది.

క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్, సెమీఫైనల్లో స్వీడన్ లాంటి మేటిజట్లను కంగుతినిపించిన స్పెయిన్ ఫైనల్స్ బెర్త్ తో ఇంగ్లండ్ కు ప్రధానప్రత్యర్థిగా నిలిచింది.

స్పెయిన్ జట్టులోని 15మంది ప్రధాన ప్లేయర్లు జట్టు శిక్షకుడిపైన తిరుగుబాటు చేసి జట్టుకు దూరమయ్యారు. అయితే స్పానిష్ ఫుట్ బాల్ సమాఖ్య అండగా నిలవడంతో

అంతగా అనుభవం లేని యువక్రీడాకారిణులతో స్పెయిన్ జట్టు తన అదృష్టం పరీక్షించుకొని ఫైనల్స్ వరకూ రావడంలో సఫలం కాగలిగింది.

స్పెయిన్ జట్టు మహిళా ప్రపంచకప్ ఫైనల్స్ చేరడం ఇదే మొదటిసారి. అందివచ్చిన ఈ అవకాశాన్ని స్పానిష్ జట్టు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. అయితే..పవర్ ఫుల్ ఇంగ్లండ్ ను అధిగమించగలిగితేనే విశ్వవిజేతగా నిలువగలుగుతుంది.

ఈ రెండుజట్లూ యూరోపియన్ టోర్నీ సెమీఫైనల్లో తలపడిన సమయంలో ఇంగ్లండ్ 2-1 గోల్స్ తో విజేతగా నిలిచింది. ప్రపంచకప్ ఫైనల్లో సైతం అదే ఫలితాన్నిపునరావృతం చేయాలని ఇంగ్లండ్, దెబ్బకు దెబ్బ తీయాలని స్పెయిన్ పట్టుదలతో ఉన్నాయి.

హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన 75వేల టికెట్లు...

భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి జరిగే ప్రపంచకప్ ఫుట్ బాల్ ఫైనల్స్ కు సిడ్నీలోని ఫుట్ బాల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. మొత్తం 75వేల సీటింగ్ సామర్థ్యం కలిగిన స్టేడియం కిటకిటలాడనుంది. మొత్తం టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోవడంతో నిర్వాహక సంఘం గాల్లో తేలిపోతోంది.

స్పెయిన్ రాణి లిటిజియా ఫైనల్ మ్యాచ్ తిలకించడానికి ఇప్పటికే ఆస్ట్ర్రేలియా చేరుకోగా..ఇంగ్లండ్ రాజు విలియమ్ స్వదేశానికే పరిమితం కావడం విమర్శలకు తావిస్తోంది.

ఏజట్టు నెగ్గినా తెరమీదకు సరికొత్త చాంపియన్..

ప్రపంచకప్ మహిళా ఫుట్ బాల్ చరిత్రలో వరుసగా మూడో టైటి్ల్ సాధించాలన్న అమెరికా ఆశలు క్వార్టర్ ఫైనల్స్ దశలోనే అడియాసలయ్యాయి. నార్వే, జర్మనీ, జపాన్ జట్లకు మాత్రమే ఇప్పటి వరకూ ఫిఫా మహిళా ప్రపంచకప్ అందుకొన్న రికార్డు ఉంది.

ఈరోజు జరిగే ఫైనల్లో ఇంగ్లండ్ లేదా స్పెయిన్ జట్లలో ఏది నెగ్గినా నయాచాంపియన్ ఆవిష్కరణ జరుగనుంది. ఇంగ్లండ్ 57 ఏళ్ల ప్రపంచకప్ లేమినుంచి బయటపడుతుందా? లేక స్పెయిన్ నయాప్రపంచకప్ ఫుట్ బాల్ చాంపియన్ గా సరికొత్త చరిత్రకు తెరతీస్తుందా? తెలుసుకోవాలంటే కొద్దిగంటలపాటు సస్పెన్స్ భరించక తప్పదు.

Tags:    
Advertisement

Similar News