ఛాంపియన్స్ ట్రోఫీలో జెర్సీ వివాదం
ఆటగాళ్ల జెర్సీలపై ఆతిథ్య దేశం పేరు ఉండటంపై భారత్ అభ్యంతరం
ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్నది. దీనికి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నది. అయితే అక్కడి వెళ్లేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పడంతో టీమిండియా ఆడే మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. చాలా రోజుల పాటు పెద్ద ఎత్తున చర్చలు జరిగిన అనంతరం ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చింది. ఇప్పుడు మరో వివాదం చోటు చేసుకున్నది. ఆటగాళ్ల జెర్సీలపై ఆతిథ్య దేశం పేరు ఉండటంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి అంగీకరించమని స్పష్టం చేసింది. దీనిపై తాజాగా ఐసీసీ కూడా స్పందించింది.
టోర్నమెంట్‌కు సంబంధించిన లోగోనూ ప్రతి జట్టూ తమ జెర్సీకి యాడ్ చేసుకోవాలి. అన్ని జట్లూ ఈ నిబంధనను పాటించాల్సిన అవసరం ఉన్నదని ఐసీసీ అధికారవర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు బీసీసీఐపై పీసీబీ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. క్రికెట్‌లోకి రాజకీయాలను తెస్తున్నదని ఆరోపించింది. బీసీసీఐ క్రికెట్‌లోకి రాజకీయాలను తెస్తున్నది. దీనివల్ల ఆటకు నష్టం జరుగుతున్నది. ముందు వాళ్లు పాకిస్థాన్‌కు జట్టును పంపడానికి తిరస్కరించారు. ప్రారంభోత్సవానికి కెప్టెన్ కూడా పంపడం లేదు. ఇప్పుడేమో టీమిండియా జెర్సీలపై ఆతిథ్య దేశం (పాకిస్థాన్) పేరు వద్దంటున్నారని ఓ పీసీబీ అధికారి అన్నారు.