లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం: ఏఆర్‌ ఫుడ్స్‌పై కేసు నమోదు

టీటీడీ ఫిర్యాదు మేరకు ఆహారభద్రత చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు

Advertisement
Update:2024-09-26 10:24 IST

శ్రీవారి లడ్డూ తయారీకి నాసిరకం నెయ్యి సరఫరా చేసిన గుత్తేదారుపై టీటీడీ చర్యలకు ఉపక్రమించింది.టెండర్‌ నిబంధనను అతిక్రమించి కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వార్థపూరిత శక్తులతో కలిసి కుట్రపూరిత నేరానికి పాల్పడటంతో పాటు ఆహార నాణ్యత విలువలు పాటించలేదని ఆరోపించింది.టీటీడీ ఫిర్యాదు మేరకు ఆహారభద్రత చట్టంలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

తిరుమల శ్రీవారి ప్రసాద తయారీకి అపవిత్రత పదార్థాలతో కల్తీ చేసిన నెయ్యి సరఫరా చేసిన తమిళనాడు దిండిగల్‌కు చెందిన ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ పై టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ జనరల్‌ మేనేజర్‌ మురళీకృష్ణ తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ సంస్థ సరఫరా చేసిన నెయ్యిలో అపవిత్ర పదార్థాలు కలిసినట్లు గుజరాత్‌ ఆనంద్‌లోని నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఎన్‌డీడీబీ) నిర్ధారించిందని వెల్లడించారు. వివిధ గుత్తేదారు సంస్థలు టీటీడీకి సరఫరా చేస్తున్ననెయ్యిలో నాణ్యత లోపిస్తున్నదని గుర్తించి ముందే హెచ్చరించామన్నారు. మిగతా గుత్తేదారు సంస్థలు తీరు మార్చుకుని నాణ్యత మెరుగు పరిచాయని కానీ ఎన్ని హెచ్చరికలు చేసినా ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌లో మార్పు రాలేదన్నారు. ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ ఈ ఏడాది జూన్‌ 12, 20, 25 జులై 4 తేదీల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం నాలుగు ట్యాంకర్లను సరఫరా చేసిందన్నారు. ఆ నెయ్యిని వినియోగించిన తర్వాత నాణ్యతపై అనుమానం వచ్చి హెచ్చరించినట్లు మురళీకృష్ణ చెప్పారు. ఆ తర్వాత సదరు సంస్థ జులై 6న 2, 12న 2 మొత్తం 4 ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసిందన్నారు. అప్పటికే ఆ సంస్థ సరఫరా చేసిన నెయ్యి నాణ్యతపై అనుమానాలు ఉండటంతో ఆ ట్యాంకర్ల నుంచి నమూనాలో తీసి ఎన్‌డీడీబీ ల్యాబ్‌కు పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. జులై 16, 23 తేదీల్లో ల్యాబ్‌ నివేదికలు వచ్చాయన్నారు. టీటీడీ మొదటిసారి బైటి ల్యాబ్‌లకు నెయ్యి నమూనాలు పంపినట్లు తెలిపారు. ఎన్‌డీడీబీకి పంపిన అన్ని నమూనాల్లో అపవిత్ర పదార్థాలు కలిశాయని, తీవ్రస్థాయిలో కల్తీ జరిగిందని తేలిందని మురళీ కృష్ణ తెలిపారు. ఏఆర్‌ ఫుడ్స్‌ నిబంధనల మేరకు నాణ్యమైన నెయ్యి సరఫరా చేస్తుందని విశ్వసించినట్లు తెలిపారు. కానీ దానికి భిన్నంగా వ్యవహరించినట్లు పరీక్షల్లో తేలిందని ఫిర్యాదు చేశారు.

కల్తీ నెయ్యి సరఫరా చేసిందని తేలడంతో ఏఆర్‌ ఫుడ్స్‌ కు జులై 22, 23, 27 తేదీల్లో నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. 28న రిజాయిండర్‌ నోటీసు పంపినట్లు తెలిపారు. తాము కల్తీ నెయ్యి కలపలేదని జులై 28, సెప్టెంబర్‌ 4న ఆ సంస్థ వివరణ ఇచ్చిందని మురళీ కృష్ణ చెప్పారు. టీటీడీని , కోట్లాదిమంది భక్తుల విశ్వాసాన్ని ఏఆర్‌ డెయిరీ సంస్థ ఘోరంగా మోసగించిందని, కల్తీ నెయ్యి సరఫరా చేయడాన్ని తీవ్రమైన నేరపూరిత కుట్రగా అభివర్ణించారు. కొందరు స్వార్థపూరిత శక్తులతో కలిసి ఈ కుట్రకు తెరతీసిందన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి దోషుల్ని బైటపెట్టాలని కోరారు. టీటీడీ ఫిర్యాదు మేరక ఏఆర్‌ ఫుడ్స్‌పై ఆహారభద్రతా చట్టంంలోని 51, 59 సెక్షన్లతో పాటు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

Tags:    
Advertisement

Similar News