వింబుల్డన్ లో సరికొత్త 'టాప్ సీడింగ్' స్టార్!

వింబుల్డన్ -2023 గ్రాండ్ స్లామ్ టోర్నీ పురుషుల, మహిళల సింగిల్స్ లో కార్లోస్ అల్ కరాజ్, ఇగా స్వియాటెక్ లకు టాప్ సీడింగ్స్ దక్కాయి. గ్రాండ్ స్లామ్ కింగ్ నొవాక్ జోకోవిచ్ 2వ సీడ్ గా టైటిల్ వేటకు దిగనున్నాడు.

Advertisement
Update:2023-06-29 14:27 IST

వింబుల్డన్ -2023 గ్రాండ్ స్లామ్ టోర్నీ పురుషుల, మహిళల సింగిల్స్ లో కార్లోస్ అల్ కరాజ్, ఇగా స్వియాటెక్ లకు టాప్ సీడింగ్స్ దక్కాయి. గ్రాండ్ స్లామ్ కింగ్ నొవాక్ జోకోవిచ్ 2వ సీడ్ గా టైటిల్ వేటకు దిగనున్నాడు....

లండన్ లోని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ పచ్చిక కోర్టులు వేదికగా జరిగే వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ టాప్ సీడ్ అనగానే...రోజర్ ఫెదరర్, యాండీ ముర్రే, నడాల్ లేదా జోకోవిచ్ పేర్లు మాత్రమే గత కొన్ని సంవత్సరాలుగా గుర్తుకు రావడం ఆనవాయితీగా మారింది. అయితే..మరికొద్దిరోజుల్లో ప్రారంభంకానున్న 2023 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ లో నయా టాప్ సీడ్ గా స్పెయిన్ యువఆటగాడు, 21 సంవత్సరాల కార్లోస్ అల్ కరాజ్ బరిలోకి దిగబోతున్నాడు.

మహిళల సింగిల్స్ లో పోలిష్ స్టార్ ఇగా స్వియాటెక్ కు నంబర్ వన్ సీడింగ్ దక్కింది.

ర్యాంకింగ్స్ ఆధారంగానే సీడింగ్స్...

వింబుల్డన్ నిర్వాహక సంఘం కాలానుగుణంగా సీడింగ్ విధానాన్ని మార్చుతూ వస్తోంది. గతంలో గ్రాస్ కోర్టు టైటిల్స్ ఎక్కువ సాధించిన ఆటగాళ్లకే టాప్ సీడింగ్స్ దక్కేవి. అయితే..ప్రస్తుత 2023 సీజన్ నుంచి ప్రపంచ ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ ర్యాంక్ లో నిలిచిన క్రీడాకారులకే టాప్ సీడింగ్స్ ఇవ్వాలని నిర్ణయించారు.దీంతో..23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్, సెర్బియన్ థండర్ నొవాక్ జోకోవిచ్ రెండో సీడ్ కు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది.

తన కెరియర్ లో ఇప్పటికే 7 వింబుల్డన్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జోకోవిచ్..8వ వింబుల్డన్ టైటిల్ వేటకు 2వ సీడ్ గా పోటీకి దిగనున్నాడు. కొద్దిరోజుల క్రితమే ముగిసిన 2023 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను నెగ్గడం ద్వారా తన గ్రాండ్ స్లామ్ ట్రోఫీల సంఖ్యను 23కు పెంచుకొన్న జోకోవిచ్ 8వ వింబుల్డన్ టైటిల్ తో 24వ గ్రాండ్ స్లామ్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

క్వీన్స్ క్లబ్ టైటిల్ తో అల్ కరాజ్....

వింబుల్డన్ కు సన్నాహకంగా లండన్ లో జరిగే క్వీన్స్ క్లబ్ గ్రాస్ కోర్ట్ టైటిల్ ను నెగ్గడం ద్వారా అల్ కరాజ్ తిరిగి నంబర్ వన్ ర్యాంక్ కు చేరుకోడం ద్వారా టాప్ సీడింగ్ ను దక్కించుకోగలిగాడు.

తన కెరియర్ లో 3వ వింబుల్డన్ టోర్నీ ఆడనున్న అల్ కరాజ్ కు ..గత రెండుటోర్నీలలో కనీసం 4వ రౌండ్ చేరిన రికార్డు సైతం లేకపోడం విశేషం. 2021 వింబుల్డన్ టోర్నీ ద్వారా తొలిసారిగా బరిలోకి దిగిన అల్ కరాజ్ 2వ రౌండ్ తోనే నిష్క్ర్రమించాడు. ఆ తర్వాతి ఏడాది నాలుగోరౌండ్ వరకూ రాగలిగాడు.

ఫెదరర్ రికార్డుకు జోకో గురి...

వింబుల్డన్ చరిత్రలో అత్యధికంగా 8 సింగిల్స్ టైటిల్స్ సాధించిన రికార్డు రోజర్ ఫెదరర్ పేరుతో ఉంది. ఇప్పటికే ఏడు వింబుల్డన్ టైటిల్స్ నెగ్గిన జోకోవిచ్ ప్రస్తుత 2023 టైటిల్ నెగ్గడం ద్వారా ఫెదరర్ 8 టైటిట్స్ రికార్డును సమం చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు.

36 సంవత్సరాల జోకోవిచ్ గత నాలుగేళ్లుగా వింబుల్డన్ ట్రోఫీలు అందుకొంటూ వస్తున్నాడు. ప్రస్తుత 2023 గ్రాండ్ స్లామ్ సీజన్లోని మొదటి రెండు ( ఆస్ట్ర్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ ) టైటిల్స్ నెగ్గిన జోకోవిచ్ వరుసగా మూడోటైటిల్ సాధించగలనన్న ధీమాతో ఉన్నాడు. డేనియల్ మెద్వదేవ్ కు మూడవ సీడ్, నార్వే ప్లేయర్ కాస్పర్ రూడ్ కు 4వ సీడ్ దక్కాయి.

11.2 శాతం పెరిగిన ప్రైజ్ మనీ...

వింబుల్డన్‌ 2023 టోర్నీ పారితోషికాన్ని భారీమొత్తంలో పెంచినట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది. గత ఏడాది విజేతలకు ఇచ్చిన మొత్తం కంటే..ఈ ఏడాది వింబుల్డన్‌ విజేతలుగా నిలిచే వారికి ఇచ్చే పారితోషికాన్ని 11.2 శాతం మేర పెంచినట్లు నిర్వాహక సంఘం తెలిపింది.

మొత్తంగా 44.7 మిలియన్‌ పౌండ్లను విజేతలకు ఇవ్వనున్నారు. పురుషుల, మహిళల సింగిల్స్‌ విజేతలు 2.35 మిలియన్‌ పౌండ్లను దక్కించుకోనున్నారు.

పురుషుల, మహిళల సింగిల్స్‌ విజేతలు చెరో 2.35 మిలియన్‌ పౌండ్లను దక్కించుకోనున్నారు. తొలి రౌండ్‌లో ఓడిన ఆటగాడికి సైతం 55వేల పౌండ్లు దక్కనున్నాయి. ఇది గత ఏడాదికంటె పది శాతం ఎక్కువ.

లండన్ లోని ఆల్ -ఇంగ్లండ్ క్లబ్ లోని గ్రాండ్ కోర్టుల్లో సోమవారం నుంచి 2023 వింబుల్డన్ పోటీలు జరుగనున్నాయి.

Tags:    
Advertisement

Similar News