ఐపీఎల్ తో బీసీసీఐకి భారీమిగులు!

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డులో మిగులు నిధులు పొంగిపొరలుతున్నాయి. ఐపీఎల్ నిర్వహణతో బీసీసీఐ తలరాత ఒక్కసారిగా మారిపోయింది.

Advertisement
Update:2024-08-29 10:04 IST

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డులో మిగులు నిధులు పొంగిపొరలుతున్నాయి. ఐపీఎల్ నిర్వహణతో బీసీసీఐ తలరాత ఒక్కసారిగా మారిపోయింది.

అమెరికాతో సహా ప్రపంచ ప్రముఖ దేశాలన్నీ ఓ వైపు లోటు బడ్జెట్లతో, నిధుల లేమితో ఉక్కిరిబిక్కిరవుతుంటే..మరోవైపు భారత క్రికెట్ బోర్డు మాత్రం వందల కోట్ల రూపాయల మిగులుతో కళకళలాడుతోంది.

1970 దశకం వరకూ నిధుల కోసం అల్లాడుతూ వచ్చిన బీసీసీఐ పరిస్థితి..2008 లో ఐపీఎల్ లీగ్ ప్రారంభంతో ఒక్కసారిగా మారిపోయింది. ఏటా రెండుమాసాలపాటు జరిగే ఐపీఎల్ నిర్వహణతో గత 17 సీజన్లుగా కనకవర్షం కురిపించుకొంటోంది.

ఫ్రాంచైజీల హక్కుల విక్రయం, ప్రత్యక్షప్రసార హక్కుల విక్రయాల ద్వారా వేలకోట్ల రూపాయలు సంపాదించడమే కాదు..వందలాది స్వదేశీ, విదేశీ క్రికెటర్లను సైతం కోటీశ్వరులుగా మార్చి వేసింది.

2023 సీజన్లో 116 శాతం మిగులు...

2023 ఐపీఎల్ సీజన్ నిర్వహణ ద్వారా బీసీసీఐ సాధించిన మిగులు మొత్తం 116 శాతంగా ఉంది. బీసీసీఐ అధికారిక లెక్కల ప్రకారం మిగులు మొత్తం 5120 కోట్ల రూపాయలకు పెరిగింది.

2022 సీజన్ ఐపీఎల్ నిర్వహణ ద్వారా 2367 కోట్ల రూపాయలు మిగులు దక్కితే..2023 సీజన్లో ఆ మొత్తం 5120 కోట్ల రూపాయలకు చేరింది. ఐపీఎల్ 17వ సీజన్ నిర్వహణతో మొత్తం 11వేల 769 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరింది. ఈ మొత్తం లో 66 శాతం ( 6648 కోట్ల రూపాయలు) నిర్వహణకు పోగా..మిగులు మొత్తంగా 5120 కోట్ల రూపాయలు ఉన్నట్లు బీసీసీఐ వివరించింది.

ప్రసార హక్కుల విక్రయంతో పెరిగిన మిగులు...

ఐపీఎల్ 2023- 2027 సీజన్ల కాలానికి సరికొత్తగా ప్రసారహక్కుల విక్రయం ద్వారా బీసీసీఐ రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. గతంలో ఎన్నడూలేనంతగా 48వేల 390 కోట్ల రూపాయలు మీడియా హక్కుల ద్వారా దక్కాయి.

ఐపీఎల్ మీడియా హక్కులను డిస్నీస్టార్ 23వేల 575 కోట్ల రూపాయలకు, డిజిటల్ హక్కులను జియో సినిమా 23వేల 758 కోట్ల రూపాయలకు, టైటిల్ హక్కులను టాటా సన్స్ 2500 కోట్లరూపాయలకు దక్కించుకొన్నాయి.

మొత్తం మీద..ఐపీఎల్ నిర్వహణతో నికర మిగులును సాధిస్తూ రావడం ద్వారా బీసీసీఐ ప్రపంచ ధనిక క్రికెట్ బో్ర్డుగా తన ప్రత్యేకతను కాపాడుకోగలుగుతోంది.

Tags:    
Advertisement

Similar News