కుస్తీ సంఘం అధ్యక్షుడిపై రెండు ఎఫ్ఐఆర్ లు.. అయినా తగ్గేది లేదంటున్న రెజ్లర్లు!
మహిళా వస్తాదులపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజెపీ ఎంపీ, భారత కుస్తీ సంఘం అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.
మహిళా వస్తాదులపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజెపీ ఎంపీ, భారత కుస్తీ సంఘం అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. అయినా.. తాము నిరసన వీడేదిలేదంటూ జంతర్ మంతర్ దగ్గర నిరాహారదీక్ష చేస్తున్న రెజ్లర్లు తెగేసి చెప్పారు.
దేశంలో అసలు ఏం జరుగుతోంది. ప్రపంచ, ఒలింపిక్స్ కుస్తీ పోటీలలో దేశానికి పతకాలు సాధించడం ద్వారా గౌరవం తెచ్చిన మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ అధికార పార్టీ ఎంపీ పై కేసు నమోదు చేయటానికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ‘బేటీ బచావో.. అంటూ ప్రచారంతో హడావిడి చేసే కేంద్ర ప్రభుత్వం తమ పార్టీకే చెందిన నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయటానికి ఎందుకు మీనమేషాలు లెక్కపెట్టింది. ఓ హత్యానేరం కేసుతో సహా 40 ఎఫ్ఐఆర్ లు నమోదైన ఓ వ్యక్తిని ఎందుకు కాపాడుతూ వస్తోందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సుప్రీంకోర్టు జోక్యంతోనే..
ఉత్తరప్రదేశ్ లోని కేసరిగంజ్ నియోజక వర్గం నుంచి బీజెపీ టికెట్ పై లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నబ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ భారత కుస్తీ సమాఖ్య అధ్యక్షుడిగా గత కొద్ది సంవత్సరాల నుంచి తిరుగులేని అధికారం చేలాయిస్తున్నారు. ఓ మైనర్ తో సహా పలువురు మహిళా వస్తాదులపై లైంగిక వేధింపులకు పాల్పడటం ద్వారా తీవ్రవిమర్శలు ఎదుర్కొంటూ వస్తున్నాడు.
బ్రిజ్ భూషణ్ నుంచి తమను కాపాడాలని, తగిన న్యాయం చేయాలని భారత వస్తాదుల బృందం కొద్దిమాసాల క్రితమే మొరపెట్టుకొంది. ప్రభుత్వం, కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ తమ గోడును వినకుండా..ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీకే అండగా నిలవడంతో విసిగిపోయి మరోసారి నిరసన చేపట్టారు. పదేపదే ఫిర్యాదు చేసినా బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు చేయటానికి ఢిల్లీ పోలీసులు మీనమేషాలు లెక్కిస్తూ ఉండటంతో..న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహారదీక్షలు చేస్తున్న రెజ్లర్లు దేశసర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
విచారణ కమిటీ ఓ తమాషా..
రెజ్లర్లపై లైంగిక ఆరోపణలపై విచారణకు కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ.. భారత ఒలింపిక్స్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష నేతృత్వంలో ఓ కమిటీని నియమించినా.. విచారణ ఓ తంతుగా మారింది. విచారణ కమిటీ నివేదిక వచ్చే వరకూ కుస్తీ సమాఖ్య అధ్యక్షుడి విధులకు దూరంగా ఉండాలన్న ఆదేశాన్ని పక్కన పెట్టి మరీ బ్రిజ్ భూషణ్ పెత్తనం చెలాయిస్తూ ఉండటంతో విసిగిపోయిన రెజ్లర్లు మరోసారి నిరసన బాట పట్టారు. తమకు న్యాయం చేయాలంటూ సుప్రీం గడప తొక్కారు.
ఢిల్లీ పోలీసుల నిర్లక్ష్యాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న కుస్తీ సంఘం అధ్యక్షుడిపై కేసు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో..బ్రిజ్ భూషణ్ పై రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. న్యూఢిల్లీలోని కానాట్ ప్లేస్ పోలీసు స్టేషన్లో జాతీయ కుస్తీ సమాఖ్య అధ్యక్షుడిపై పోక్సో చట్టం కింద ఓ కేసు ( మైనర్ బాలికల పై లైంగిక వేధింపుల కేసు ), మేజర్లపై లైంగిక వేధింపులకు గాను మరో కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసు కమిషనర్ సుప్రీంకోర్టుకు విన్నవించారు.
న్యాయం జరిగే వరకూ తగ్గేది లేదంటున్న రెజ్లర్లు..
లైంగిక వేధింపులకు పాల్పడిన కుస్తీ సమాఖ్య అధ్యక్షుడిపై బలహీనమైన కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోడానికి ప్రయత్నిస్తున్నారని, ఢిల్లీ పోలీసులపైన, ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీపైన తమకు నమ్మకం లేదని, బ్రిజ్ భూషణ్ నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ..నిరసనకు దిగిన వస్తాదులు ఆరోపిస్తున్నారు. బ్రిజ్ భూషణ్ ను తక్షణమే అరెస్టు చేసి కటకటాల వెనుక వేయాలని నిరసన చేపట్టిన ఏడుగురు మహిళా వస్తాదులు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకూ తాము నిరసన వీడేది లేదని తేల్చి చెప్పారు.
బ్రిజ్ భూషణ్ పై ఇప్పటికే 40 ఎఫ్ఐఆర్ లు..
జాతీయ కుస్తీ సంఘం అధ్యక్షుడు, బీజెపీ ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఓ హత్యానేరంతో సహా మొత్తం 40 ఎఫ్ఐఆర్ లు నమోదై ఉన్నాయని.. సుప్రీంకోర్టుకు రెజ్లర్ల తరపున వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. బ్రిజ్ భూషణ్ నుంచి రెజ్లర్ల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, వారికి ఢిల్లీ పోలీసులే రక్షణ కల్పించాలని కోరారు. ప్రస్తుత రెండు కేసులతో బీజెపీ ఎంపి పై మొత్తం 42 కేసులు నమోదైనట్లయ్యింది.
పదవి వీడేది లేదు- బ్రిజ్ భూషణ్..
మరోవైపు.. తాను ఏవిధమైన తప్పు చేయలేదని, ఎవ్వరినీ లైంగికంగా వేధించలేదని, తన పదవిని వీడేదే లేదంటూ కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే.. మహిళా వస్తాదులను లైంగికంగా వేధించిన బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ను వెనకేసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం పై పలువురు క్రీడాభిమానులు మండిపడుతున్నారు. ఇదేనా కమలం పార్టీ చెప్పే ‘బేటీ బచావో..’? ఇదేనా ఆడబిడ్డలకు మోదీ చేసే న్యాయం? అంటూ నిలదీస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత కీర్తిపతాకను ఎగురవేసిన క్రీడాకారిణులు.. ఢిల్లీ నడిరోడ్డుపై ఆందోళన చేస్తున్నా.. మోదీ సర్కారు నిమ్మకు నీరెత్తని తీరును ప్రశ్నిస్తున్నారు..
కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో రోడ్డెక్కిన రెజ్లర్లు, లెక్కకు మిక్కిలి పతకాలతో క్రీడా జగత్తును తమవైపు తిప్పుకున్న స్టార్ రెజ్లర్లు.. ఇప్పుడు న్యాయం కోసం ఇతర క్రీడా ప్రముఖుల మద్దతు అర్థిస్తున్నారు.తమకు అండగా నిలవాల్సిన భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉష.. కక్ష కట్టినట్లు కటువుగా మాట్లాడుతుంటే, పతకాలు సాధించినప్పుడు అభినందించడంలో ముందుండే క్రికెటర్లు తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం పట్ల రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
సమాఖ్య అధ్యక్షుడిపై తీవ్ర ఆరోపణలు వచ్చినా.. కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన రెజ్లర్లు.. ఇతర క్రీడాకారులు ఈ అంశంపై నోరు మెదపకపోవడంపై గుర్రుగా ఉన్నారు. విశ్వ వేదికలపై పతకాలు సాధించిన వెంటనే ఆకాశానికెత్తుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెట్టే క్రికెటర్లు.. రెజ్లర్ల పోరాటంపై నోరు మెదపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని అంటున్నారు. అక్కడెక్కడో అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన జాత్యహంకార హత్యపై మూకుమ్మడిగా స్పందించిన క్రీడాలోకం.. ఇప్పుడు గళమెత్తకపోవడం తమను మరింత బాధిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
12 గంటలపాటు వారి మొరవిన్నా- క్రీడామంత్రి..
రెజ్లర్ల సమస్యలు తెలుసుకోడానికి తాను వారితో 12 గంటలపాటు గడిపానని..వారికి తగిన న్యాయం చేయటానికి అందరికీ ఆమోదయోగ్యమైన ఓ విచారణ కమిటీని నియమించిన విషయాన్ని కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ గుర్తు చేశారు. అయితే.. నిరసన చేస్తున్న వస్తాదుల బృందానికి నాయకత్వం వహిస్తున్న బజరంగ్ పూనియా మాత్రం..కేంద్ర క్రీడామంత్రివి కేవలం కంటితుడుపు మాటలేనని, తమతో 12 గంటలు గడిపినా..తమ గోడును 12 నిముషాలపాటు వినే ఓపిక ఆయనకు లేకుండా పోయిందని, ఈ ప్రభుత్వం పైన, ఢిల్లీ పోలీసులపైన తమకు నమ్మకం పోయిందని, దేశసర్వోన్నత న్యాయస్థానమే తమకు ఇక న్యాయం చేయాలని వేడుకొన్నారు.
నీరజ్ చోప్రా, సానియా మద్దతు..
జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన రెజ్లర్లకు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, భారత మహిళా టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జాతో సహా పలువురు క్రీడాకారులు మద్దతుగా నిలిచారు. ‘న్యాయం కోరుతూ మన క్రీడాకారులు వీధుల్లోకి రావడం ఎంతగానో బాధిస్తున్నది. మన దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ప్రపంచ వేదికపై మనల్ని గర్వపడేలా చేసేందుకు వారు ఎంతో శ్రమించారు’అని నీరజ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
రెజ్లర్ల మెదడు మోకాళ్లలో ఉంటుందని కొందరు సెటైర్లు వేస్తుంటారు... కానీ మా మనసు, మెదడు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి. ఇతర క్రీడాకారులే ఒకసారి సరిచూసుకోవాలి. అసలు వారి దగ్గర స్పందించే హృదయాలు ఉన్నాయో.. లేవో.. అన్న అనుమానాన్ని ఒలింపిక్స్ పతక విజేత సాక్షి మాలిక్ వ్యక్తం చేసింది.
ఈ దేశమంతా క్రికెట్‌ను ఆరాధిస్తుంది. కానీ, ఒక్క క్రికెటర్ కూడా తమ ఆందోళనపై స్పందించలేదంటూ మరో ప్రముఖ వస్తాదు వినేశ్ ఫొగట్ వాపోయింది. మాకు అనుకూలంగా మాట్లాడమని మేం ఆడగడం లేదు. న్యాయం కోసం స్పందించమంటున్నాం. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమానికి క్రికెటర్లు మద్దతు పలికారు. ఆ మాత్రం మద్దతుకు మేం అర్హులం కాదా. వారెందుకు భయపడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు మీ మద్దతు పొందడానికి అర్హులం కాకపోతే.. మాకు పతకాలు వచ్చినప్పుడు అభినందిస్తూ పోస్ట్‌లు పెట్టకండి అంటూ మండిపడింది.