ఒకే వన్‌డే మ్యాచ్‌లో 815 రన్స్‌

406 పరుగుల టార్గెట్‌ ను ఉఫ్‌ మని ఊదేసిన యూపీ

Advertisement
Update:2024-12-26 21:36 IST

దేశీయ అండర్‌ -23 మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఒకే మ్యాచ్‌లో ఏకంగా 815 పరుగులు బాదేశారంటే బౌండరీ బయటికి ఎన్ని బంతులను బాదేశారో అర్థం చేసుకోవచ్చు. వడోదరలోని జీడీఎఫ్‌సీ గ్రౌండ్‌ లో ఉత్తరప్రదేశ్‌, విదర్భ జట్ల మధ్య స్టేట్‌ ఏ ట్రోఫీలో భాగంగా జరిగిన అండర్‌ -23 మ్యాచ్‌ లో 406 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్‌ మని ఊదేశారు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన విదర్భ జట్టు 406 పరుగులు చేసింది. 407 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఉత్తరప్రదేశ్‌ జట్టు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 41.2 ఓవర్లలోనే టార్గెట్‌ ను పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌ లో మొత్తం 43 సిక్సర్లు, 66 ఫోర్లు బాదేశారు. అంటే 109 బాల్స్‌ బౌండరీ అవతలికి చేరాయి. సిక్సర్లతో 258 పరుగులు, బౌండరీలతో 264 పరుగులను బ్యాట్స్‌మన్లు పిండుకున్నారు. విదర్భ బ్యాట్సమన్లలో ఫైజ్‌, డానిష్‌ సెంచరీ చేయగా, యూపీ బ్యాట్సమన్లలో సమీర్‌ రిజ్వీ డబుల్‌ సెంచరీ బాదేశాడు. రిజ్వీ 105 బంతులు ఎదుర్కొని 202 పరుగులు చేశాడు. మరో బ్యాట్స్‌మన్‌ షోయబ్‌ సిద్ధిఖీ 96 పరుగులు చేశాడు. సమీర్‌ రిజ్వీని ఇటీవల ఐపీఎల్‌ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ సొంతం చేసుకుంది. ఇంకేం.. ఐపీఎల్‌లో సమీర్‌ తన బ్యాటింగ్‌ మెరుపులతో అభిమానులను అలరించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News