సురక్షితంగా దిగిన క్రూ డ్రాగన్.. భూమ్మీదికి చేరిన సునీత సహా మరో ముగ్గురు
భూమి దిశగా పయనం ప్రారంభించిన సునీతా బృందం.. 17 గంటల పాటు పయనించి ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది.;
సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఎనిమిది రోజుల యాత్ర కోసం అంతర్జాతీయ అంతరిక్షకేంద్రానికి (ఐఎన్‌ఎస్)కు వెళ్లి.. 9 నెలలు అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌తో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు సురక్షితంగా భూమిని చేరుకున్నారు. మంగళవారం ఐఎన్‌ఎస్ నుంచి స్సేస్‌ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో భూమి దిశగా పయనం ప్రారంభించిన సునీతా బృందం.. 17 గంటల పాటు పయనించి ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. ఆ సమయంలో ఈ వ్యోమగామ చుట్టూ డాల్ఫిన్లు కలియదిరిగిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సముద్ర జలాల్లో దిగిన క్రూ డ్రాగన్ రికవరీ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో... ఈ వ్యోమనౌక చుట్టూ అధిక సంఖ్యలో డాల్ఫిన్లు చేరి సందడి చేశాయి. నాసా సిబ్బంది దానిని బయటకు తీసుకురానున్నారు. అక్కడి నుంచి వ్యోమగాములను హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించనున్నారు.