అన్‌డాకింగ్ పూర్తి.. కొన్ని గంటల్లో భూమ్మీదికి సునీత
సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ తిరుగు ప్రయాణం ప్రారంభం;
సుమారు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ మరికొన్ని గంటల్లో భూమ్మీదికి రానున్నారు. వీరి తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. వ్యోమగాములను భూమీ మీదికి తీసుకురావడానికి అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్సేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్‌లోకి వీరు చేరుకున్నారు. అనంతరం ఈ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయి పుడమికి తిరిగి బయలుదేరింది.
స్సేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ ఐఎన్‌ఎస్‌ను వీడే అన్‌డాకింగ్ దృశ్యాలను అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నది. ఈ ప్రక్రియనంతా నాసా కేంద్రంలో శాస్త్రవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు. ఐఎన్‌ఎస్ నుంచి విడిపోయిన ఈ వ్యోమ నౌక కక్ష్యలో తిరుగుతున్నది. అంతకుముందు హ్యాచ్ మూసివేత ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. తిరగు ప్రయాణం కోసం వ్యోమగాములు తమ వస్తువులను ప్యాక్ చేసుకుని క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో కూర్చున్నారు. భూమ్మీదికి వచ్చే ముందు ఐఎన్ఎస్‌లో వ్యోమగాములంతా ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు.