వెంకటేష్ మహా కామెంట్స్‌ ఎఫెక్ట్ : కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ కు కౌంటర్

కేజీఎఫ్ పై తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు కనిపించడం లేదని, అయితే ఆ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగించిన భాష మాత్రం సరైనది కాదని అంగీకరిస్తున్నట్లు చెప్పారు.

Advertisement
Update:2023-03-07 20:56 IST

టాలీవుడ్ యువ దర్శకుడు వెంకటేష్ మహా కన్నడ మూవీ కేజీఎఫ్‌పై విమర్శలు చేసిన నేపథ్యంలో కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా టాలీవుడ్ పై కౌంటర్లు మొదలయ్యాయి. మామూలుగా టాలీవుడ్, శాండల్ వుడ్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. తెలుగు అగ్ర హీరోలు నటించిన ప్రతి సినిమాను కన్నడ ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. టాలీవుడ్ హీరోలకు తెలుగు రాష్ట్రాల తర్వాత కర్ణాటకలోనే ఎక్కువ ఆదరణ లభిస్తోంది.

ఇటీవల కాలంలో కన్నడలో నిర్మితమైన సినిమాలకు తెలుగులో కూడా ఆదరణ దక్కుతోంది. ఈ రెండు ఇండస్ట్రీల్లోని నటీనటుల మధ్య, ఇతర విభాగాలకు చెందిన వారి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే తెలుగు దర్శకుడు వెంకటేష్ మహా కన్నడ మూవీ కేజీఎఫ్ పై విమర్శలు చేసి నేపథ్యంలో అతడిపై టాలీవుడ్ తో పాటు కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి విమర్శలు వస్తున్నాయి.

'కేజీఎఫ్' హీరో క్యారెక్టర్ నీచ్ కమిన్ కుత్తే.. తన తల్లి కలను నెరవేర్చడం కోసం బంగారాన్ని సంపాదించి చివరికి దానిని సముద్రంలో పడేశాడు. అలాంటి వ్యక్తి గురించి సినిమాలు చేస్తే మనం చప్పట్లు కొడుతున్నాం' అని వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం సృష్టించాయి. వెంకటేష్ మహా కేజీఎఫ్ మూవీపై విమర్శలు చేయడం పట్ల కన్నడ సినీ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు కన్నడ ఇండస్ట్రీ నుంచి చిన్న సినిమాలు మాత్రమే వచ్చాయని.. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ తీసిన తర్వాత కన్నడ నుంచి భారీ సినిమాలు రావడం, వాటికి ఆదరణ కూడా దక్కుతుండడంతో తెలుగు ఇండస్ట్రీ ఓర్చుకోలేకపోతోందని కన్నడ ప్రేక్షకులు విమర్శలు చేశారు.

ఇదిలా ఉండగా, వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. సినిమాను సినిమాగానే చూడాలని అంత విజయం సాధించిన సినిమాపై విమర్శలు తగవని నెటిజన్లు వెంకటేష్ మహాకు హితవు పలికారు. అయితే వెంకటేష్ మహా తాను చేసిన వ్యాఖ్యలను సమర్దించుకున్నారు. దీనిపై క్షమాపణ చెప్పేది లేదని స్పష్టం చేశారు. కేజీఎఫ్ పై తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు కనిపించడం లేదని, అయితే ఆ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగించిన భాష మాత్రం సరైనది కాదని అంగీకరిస్తున్నట్లు చెప్పారు.

టాలీవుడ్ కు కౌంటర్ ఇచ్చిన దర్శన్

కేజీఎఫ్ పై తెలుగు దర్శకుడు విమర్శలు చేసి నేపథ్యంలో కన్నడ అగ్ర హీరో దర్శన్ టాలీవుడ్ దిగ్గజ దర్శకుడైన రాజమౌళిని తక్కువ చేస్తూ మాట్లాడాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..'రాజమౌళి పేరు ఎత్తగానే అందరూ ఆహా ఓహో అంటుంటారు.. ఆయనేమి ఎక్స్ట్రార్డినరీ డైరెక్టర్ కాదు. రాజమౌళి కేవలం ఒక దర్శకుడు మాత్రమే.' అని కామెంట్స్ చేశాడు. కన్నడ అగ్ర దర్శకుడు అయిన ప్రశాంత్ నీల్ మూవీ కేజీఎఫ్ పై వెంకటేష్ మహా విమర్శలు చేసి నేపథ్యంలో తెలుగు ఇండస్ట్రీకి కౌంటర్ ఇచ్చేందుకే దర్శన్ ఈ వ్యాఖ్యలు చేశాడని ప్రచారం జరుగుతోంది.

దర్శన్ రాజమౌళిని తక్కువ చేసి మాట్లాడడంపై తెలుగు ప్రేక్షకులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా దర్శన్ పై ట్రోల్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇన్నాళ్లు తెలుగు, కన్నడ సినీ ఇండస్ట్రీల మధ్య మంచి సంబంధాలు ఉండగా తొలిసారి ఒక ఇండస్ట్రీపై మరొక ఇండస్ట్రీ విమర్శలు చేసుకోవడం మొదలైంది.

Tags:    
Advertisement

Similar News