వినేశ్ ఫోగట్ పిటిషన్‌పై తీర్పు 16కు వాయిదా
సాధారణంగా కాస్ 24 గంటల్లో తీర్పు ఇస్తుందని, ఈసారి వారు తీర్పు గడువును ఒకటి కంటే ఎక్కువసార్లు పొడిగించారని ఆయన తెలిపారు.
రెజ్లర్ వినేశ్ ఫోగట్ పిటిషన్‌పై తీర్పు మళ్లీ వాయిదా పడింది. పారిస్ ఒలింపిక్స్‌లో తనపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ రెజ్లర్ వినేశ్ ఫోగట్ వేసిన పిటిషన్‌పై వాదనలు విన్న కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (కాస్).. ఈనెల 16వ తేదీ శుక్రవారం తీర్పు వెల్లడించాలని నిర్ణయించింది. వినేశ్ వ్యవహారంపై కాస్ తీర్పు వాయిదా పడటం ఇది మూడోసారి. అయితే తీర్పు వాయిదా వేయడానికి కారణాలు మాత్రం కాస్ వెల్లడించలేదు. ఈ తీర్పు భారత్‌కు అనుకూలంగా వస్తే వినేశ్‌కు రజత పతకం ఇవ్వాల్సి ఉంటుంది.
ఒలింపిక్స్ 50 కేజీల విభాగంలో అదిరే విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లిన వినేశ్.. 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా తుది పోరులో తలపడేందుకు అనర్హురాలిగా ప్రకటించడం యావత్ క్రీడా ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో వినేశ్ తరఫున వాదించిన ఇద్దరు సీనియర్ న్యాయవాదులలో ఒకరైన విదుష్పత్ సింఘానియా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వినేశ్ కోసం అందరూ ప్రార్థించండి.. మెడల్ రాకపోయినా ఆమె ఛాంపియనే.. అని చెప్పారు. సాధారణంగా కాస్ 24 గంటల్లో తీర్పు ఇస్తుందని, ఈసారి వారు తీర్పు గడువును ఒకటి కంటే ఎక్కువసార్లు పొడిగించారని ఆయన తెలిపారు.
తీర్పు ఇచ్చే అడాక్ ప్యానెల్ 24 గంటల కాలపరిమితిని కలిగి ఉందని, దీన్నిబట్టి ఈ అంశం గురించి ప్యానెల్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు అర్థమవుతోందని సింఘానియా చెప్పారు. న్యాయమూర్తి మహిళ అయితే తమకు మరింత మంచిదని ఆయన తెలిపారు. గతంలో తాను చాలా కేసులు వాదించానని, ఇక్కడ సక్సెస్ రేటు చాలా తక్కువని ఆయన చెప్పారు. వినేశ్ ఫోగట్ విషయంలో చరిత్రాత్మక తీర్పు ఇవ్వాలని న్యాయమూర్తిని కోరుతున్నామని ఆయన అన్నారు. ఇది కొంచెం కష్టమే అయినా ఏదైనా అద్భుతం జరగాలని ఆశిద్దామని చెప్పారు. వినేశ్‌కు పతకం దక్కాలని అందరూ ప్రార్థించాలని కోరారు. ఒకవేళ మెడల్ రాకపోయినా ఆమె ఛాంపియనే అని ఆయన పునరుద్ఘాటించారు. తీర్పు వెలువడనున్న నేపథ్యంలో వినేశ్ ఇంకా స్వదేశానికి బయలుదేరలేదు. త్వరలో ఆమె భారత్‌కు వచ్చే అవకాశముంది. సోమవారం తన లగేజీని తీసుకొని ఒలింపిక్ క్రీడాగ్రామం నుంచి వినేశ్ బయటికి వచ్చేసింది.