నైరుతి.. ఈసారి ముందుగానే..

గతేడాది కూడా నైరుతి రుతుపవనాలు మే 19వ తేదీనే దక్షిణ అండమాన్‌ సముద్రంలోకి ప్రవేశించినా.. ప్రతికూల పరిస్థితుల వల్ల అవి కేరళను తాకడానికి వారం రోజులు ఆలస్యమైంది.

Advertisement
Update:2024-05-14 11:55 IST

నైరుతి రుతు పవనాలు ఈ ఏడాది మూడు రోజులు ముందే ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏటా సాధారణంగా దక్షిణ అండమాన్‌ సముద్రంలోకి మే 22న ప్రవేశించే నైరుతి రుతుపవనాలు.. ఈసారి మాత్రం మే 19న ప్రవేశించే అవకాశముందని అంటున్నారు. దక్షిణ అండమాన్‌ సముద్రంతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్‌ దీవుల్లోకి ప్రవేశించే అవకాశముందని భారత వాతావరణ విభాగం సోమవారం వెల్లడించింది.

దీంతో కేరళలోకి జూన్‌ ఒకటో తేదీకల్లా ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఆ సమయంలో అరేబియా సముద్రంలో అనుకూల వాతావరణం ఉండాలని చెబుతున్నారు. అంటే.. వాటి ఆగమనానికి ముందు అరేబియా సముద్రంలో అల్ప పీడనం గాని, వాయుగుండం గాని ఏర్పడకూడదని అంటున్నారు. అదే జరిగితే నైరుతి రుతు పవనాల రాకను ఆలస్యం చేస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ నెలాఖరులోగా అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే పరిస్థితులు ఒకింత కనిపిస్తున్నాయని, అయితే అది నిర్ధారణ కావాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సి ఉందని అంటున్నారు.

గతేడాది కూడా నైరుతి రుతుపవనాలు మే 19వ తేదీనే దక్షిణ అండమాన్‌ సముద్రంలోకి ప్రవేశించినా.. ప్రతికూల పరిస్థితుల వల్ల అవి కేరళను తాకడానికి వారం రోజులు ఆలస్యమైంది. దీంతో జూన్‌ ఒకటికి బదులు 8వ తేదీన కేరళను తాకాయి. ఎల్సినో ప్రభావంతో గతేడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. కురిస్తే కుండపోత, లేదంటే వర్షాభావ పరిస్థితులతో పంటలకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం లభించలేదు.

కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు...

కోస్తాంధ్ర, రాయలసీమల్లో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణం విభాగం తెలిపింది. దక్షిణ అంతర్గత కర్ణాటక, పొరుగు ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కి.మీ.ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. దక్షిణ కర్నాటక నుంచి వాయవ్య మధ్యప్రదేశ్‌ వరకు మధ్య మహారాష్ట్ర మీదుగా ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. వీటి ఫలితంగానే ఈ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వివరించింది.

Tags:    
Advertisement

Similar News