రూ.40 లక్షల సాయమిచ్చి నన్ను బతికించాడు.. చిరంజీవికి రుణపడి ఉంటా..

తన తండ్రికి నలుగురు భార్యలని, మూడో భార్య కుమారుడిని తన మేనేజర్ గా పెట్టుకున్నట్లు పొన్నంబలం తెలిపారు. అతడు తన ఆస్తి కోసం స్లో పాయిజన్ ఇస్తూ వచ్చాడని, అలాగే ఆహారంలో విషం పెట్టాడని, అందువల్లే తన రెండు కిడ్నీలు పాడైపోయాయని వివరించారు.

Advertisement
Update:2023-03-16 12:57 IST

రెండు కిడ్నీలు పాడైన తన చికిత్స కోసం చిరంజీవి రూ. 40 లక్షలు సహాయం చేశారని, ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ప్రముఖ తమిళ నటుడు పొన్నంబలం అన్నారు. కిడ్నీ సంబంధిత సమస్య నుంచి ఇటీవలే కోలుకున్న ఆయన తాజాగా మీడియాతో మాట్లాడాడు. మద్యం తాగడం వల్ల తన రెండు కిడ్నీలు పాడైపోలేదని, ఆస్తికోసం సొంత తమ్ముడు స్లో పాయిజన్ ఇచ్చిన కారణంగానే కిడ్నీలు పాడైనట్లు తెలిపాడు. వైద్యులను సంప్రదించిన సమయంలో తనపై విష ప్రయోగం జరిగినట్లు నిర్ధారించారని చెప్పారు.

తన తండ్రికి నలుగురు భార్యలని, మూడో భార్య కుమారుడిని తన మేనేజర్ గా పెట్టుకున్నట్లు పొన్నంబలం తెలిపారు. అతడు తన ఆస్తి కోసం స్లో పాయిజన్ ఇస్తూ వచ్చాడని, అలాగే ఆహారంలో విషం పెట్టాడని, అందువల్లే తన రెండు కిడ్నీలు పాడైపోయాయని వివరించారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందేందుకు తన వద్ద డబ్బు లేకపోవడంతో ఇబ్బంది పడ్డానని, ఆ సమయంలో తనకు చిరంజీవి గుర్తుకు వచ్చినట్లు చెప్పారు.

ఆయనకు ఫోన్ చేసి తన ఆరోగ్య సమస్యను వివరించి సాయం చేయాలని కోరానన్నారు. ఆ తర్వాత ఆయన చెన్నై అపోలో ఆసుపత్రి నిర్వాహకులతో మాట్లాడటంతో చికిత్స కోసం అక్కడ చేరినట్లు తెలిపారు. తన వద్ద నుంచి ఆసుపత్రి సిబ్బంది ఎలాంటి ఫీజులు తీసుకోలేదని, తన చికిత్సకు అయిన రూ. 40 లక్షలను చిరంజీవే కట్టారని వెల్లడించారు. తన ఆరోగ్య సమస్యను చిరంజీవి దృష్టికి తీసుకుపోయినప్పుడు లక్షో, రెండు లక్షలో సాయం చేస్తారని అనుకున్నానని.. కానీ ఆయన తన చికిత్సకు అయిన మొత్తాన్ని భరించారని చెప్పారు. చిరంజీవికి ఎప్పటికీ రుణపడి ఉంటానని పొన్నంబలం తెలిపారు. పొన్నంబలం హిట్లర్, ఘరానా మొగుడు, మెకానిక్ అల్లుడు, అల్లరి ప్రియుడు, ఎదురులేనిమనిషి, గుడుంబా శంకర్, బుజ్జిగాడు తదితర తెలుగు సినిమాల్లో నటించాడు.

Tags:    
Advertisement

Similar News