లడఖ్ లో జానీ మాస్టర్?.. పోక్సో యాక్ట్
గత రెండు రోజులుగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
గత రెండు రోజులుగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, అలాగే అత్యాచారం కూడా చేశాడంటూ ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మూడు రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసి, కేసును నార్సింగి పీఎస్ కు బదిలీ చేశారు. ప్రస్తుతం జానీమాస్టర్ పరారీలో ఉన్నాడు. ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇక తాజాగా జానీపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే జానీ మాస్టర్ ప్రస్తుతం లడఖ్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రత్యేక బృందం లడఖ్ బయలుదేరినట్టు తెలుస్తోంది.
మరోవైపు ఈ కేసులో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే బాధితురాలి స్టేట్‌మెంట్ కూడా రికార్డ్ చేశారు. అలాగే ఆమె నుంచి ఇప్పటికే సఖి, భరోసా బృందాలు వివరాలు సేకరించాయి. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు నార్సింగి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ జానీ అసిస్టెంట్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రకారం.. ‘2017లో జానీ మాస్టర్ పరిచయమయ్యాడు. 2019లో ఆయన టీమ్ లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరాను. ముంబైలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటు నేను, మరో ఇద్దరు అసిస్టెంట్లుగా వెళ్లాం. అక్కడ హోటల్‌లో నాపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరించాడు. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్‌లో అసభ్యంగా ప్రవర్తించేవాడు. వేధింపులు భరించలేక జానీ మాస్టర్ టీం నుంచి బయటకొచ్చేశా. అయినా కూడా సొంతంగా పని చేసుకోనివ్వకుండా, ఇతర ప్రాజెక్టులు రానీయకుండా ఇబ్బంది పెట్టాడు’బాధితురాలు పేర్కొన్నారు. దీంతో ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును నార్సింగికి బదిలీ చేశారు.