ఇండియా పేరుపై పాక్ హక్కు కోరుతోందా.. ట్వీట్ వైరల్..!
సౌత్ ఏసియా ఇండెక్స్ ఇచ్చిన ట్వీట్‌తో ఈ అంశం తెరపైకి వచ్చింది. ఇండియా పేరును ఐక్య రాజ్య సమితి స్థాయిలో అధికారికంగా వదులుకుంటే..ఈ పేరుపై పాకిస్థాన్ హక్కు కోరవచ్చునని తెలిపింది.
ఇండియా పేరును భారత్‌గా మారుస్తున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో ఇండియా పేరుపై పాకిస్థాన్ హక్కు కోరుతోందా..! అంటే అవుననే సమాధానం వస్తోంది. సౌత్ ఏసియా ఇండెక్స్ ఇచ్చిన ట్వీట్‌తో ఈ అంశం తెరపైకి వచ్చింది. ఇండియా పేరును ఐక్య రాజ్య సమితి స్థాయిలో అధికారికంగా వదులుకుంటే..ఈ పేరుపై పాకిస్థాన్ హక్కు కోరవచ్చునని తెలిపింది. ఇండియా అంటే ఇండస్ రీజియన్‌ను సూచిస్తుందని..ఈ రీజియన్‌లో ప్రస్తుత పాకిస్థాన్ కూడా ఉందని ఈ ట్వీట్ సారాంశం.
దేశ విభజన తర్వాత ఏర్పాటైన కొత్త దేశానికి ఇండియా అని బ్రిటిషర్లు పేరు పెట్టడాన్ని పాకిస్థాన్ నేత జిన్నా వ్యతిరేకించారని సౌత్ ఏసియా ఇండెక్స్ తెలిపింది. ఈ దేశానికి హిందుస్థాన్ అని కానీ, భారత్ అని కానీ పేరు పెట్టాలని జిన్నా కోరారని తెలిపింది. 1947లో స్వాతంత్య్రం వచ్చిన ఒక నెల తర్వాత ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు గౌరవాధ్యక్షునిగా ఉండాలని జిన్నాను లూయిస్ మౌంట్ బాటన్ ఆహ్వానించారని..ఐతే ఆ ఆహ్వానాన్ని జిన్నా తిరస్కరించారని ట్వీట్‌లో రాసుకొచ్చింది. ఈ ఆహ్వాన పత్రికలో హిందూస్థాన్‌కు బదులుగా ఇండియా అని ఉపయోగించినందుకే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జిన్నా మౌంట్ బాటన్‌కు రాసిన లేఖలో..హిందూస్థాన్..ఇండియా అనే పదాన్ని స్వీకరించదని..ఇది కచ్చితంగా తప్పుదోవపట్టించడమేనని రాశారని గుర్తు చేసింది. గందరగోళాన్ని సృష్టించే ఉద్దేశంతోనే ఇండియా పేరును ప్రతిపాదించారని జిన్నా లేఖలో రాసినట్లు సౌత్ ఏసియా ఇండెక్స్ ట్వీట్‌లో వివరించింది.
జీ-20 సమావేశాలకు హాజరయ్యే వివిధ దేశాల అగ్రనేతల గౌరవార్ధం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 9న విందు ఇవ్వబోతున్నారు. ఇందుకోసం రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వానపత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించారు. ప్రధానమంత్రి మోదీ విదేశీ పర్యటనకు సంబంధించిన పత్రాల్లోనూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని ప్రింట్ చేశారు. జీ-20 సదస్సు కోసం ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకంలోనూ ఇండియా బదులుగా భారత్ అని రాసుకొచ్చారు. దీంతో ఇండియా పేరును భారత్‌గా మారుస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది. పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌లో ఇందుకు సంబంధించిన బిల్లు కూడా ప్రవేశపెడతారని తెలుస్తోంది.