సోషల్ మీడియా డిప్రెషన్‌ను ఎదుర్కోండిలా..
లైక్స్, వ్యూస్ రావట్లేదని డిప్రెషన్‌తో సూసైడ్ చేసుకుంటున్నారు. ఇలాంటి డిప్రెషన్, యాంగ్జైటీ నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఐఐటీలో చదువుతున్న రామ్‌కు గేమింగ్ అంటే ఇష్టం. అతనికి టెక్నాలజీని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలుసు. అందుకే ఒక యూట్యూబ్ చానెల్ పెట్టి, తన గేమింగ్ స్కిల్స్‌ను ప్రమోట్ చేసుకోవాలనుకున్నాడు. అదే తనకు నిజమైన సక్సెస్ అనుకున్నాడు. కానీ అనుకున్న విధంగా సబ్‌స్క్రైబర్లు పెరగకపోవడంతో, తాను ఫెయిల్ అవుతున్నట్టు భావించి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. అదే బాధతో సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. సోషల్ మీడియాకు ఇంతలా అడిక్ట్ అవుతున్న రామ్ లాంటి వాళ్లు చాలామందే ఉన్నారు. లైక్స్, వ్యూస్ రావట్లేదని డిప్రెషన్‌తో సూసైడ్ చేసుకుంటున్నారు. ఇలాంటి డిప్రెషన్, యాంగ్జైటీ నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సోషల్ మీడియాకు ఎక్కువగా అడిక్ట్ అవ్వడం వల్ల ఐడెంటిటీ క్రైసిస్‌లో పడతారు. నిజమైన ప్రపంచాన్ని మర్చిపోయి సోషల్ మీడియాలో కనిపించే వర్చువల్ ప్రపంచాన్నే నిజమైన ప్రపంచంగా భావిస్తారు. అందులో వారికి గుర్తింపు లభించకపోతే ఫెయిల్ అయినట్టు భావిస్తుంటారు. దీనివల్ల క్రమంగా ఒంటరితనం, డిప్రెషన్ లాంటివి పెరుగుతాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్, స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి వాటిలో యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీలను చూసి టీనేజీ పిల్లలు అట్రాక్ట్ అవుతుంటారు. అందుకే లైక్స్, వ్యూస్ గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్లు తాము అనుకున్న విధంగా వ్యూస్, లైక్స్ రాకపోతే తాము దేనికి పనికిరామని, తమకంటూ ఎవరూ లేరని ఒక నిర్ణయానికొస్తారు.
సోషల్ మీడియా డిప్రెషన్‌తో బాధపడుతున్నవాళ్లను ఈజీగా గుర్తించొచ్చు. అలాంటివాళ్లు ఎప్పుడూ ఒంటరిగా బాధపడుతూ కనిపిస్తారు. కోప్పడుతూ, విసుక్కుంటూ ఉంటారు. ఎవరితో కలవరు. అందుకే ఇలాంటి లక్షణాలతో ఎవరైనా కనిపిస్తే వాళ్లతో ప్రేమగా మాట్లాడాలి. వాళ్లు మనసు విప్పి మాట్లాడితే డిప్రెషన్ తగ్గుతుంది. అలాగే సోషల్ మీడియా డిప్రెషన్‌ను ఎదుర్కోవాలంటే ముందుగా స్క్రీన్ టైం తగ్గించాలి. మొబైల్ నోటిఫికేషన్స్‌ను ఆఫ్ చేయాలి. రోజులో కొంత టైం మాత్రమే మొబైల్ వాడాలి. పేరెంట్స్ కూడా పిల్లల ముందు మొబైల్ వాడకాన్ని తగ్గించాలి.
ఇక వీటితో పాటుగా సమయానికి నిద్రపోవడం, రోజూ వ్యాయామం చేయడం, హెల్దీ డైట్ తీసుకోవడం వంటి అలవాట్లు ఫాలో అయితే మెదడులో హార్మోన్స్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి. డిప్రెషన్ తగ్గుతుంది. బాగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నామని గుర్తించినప్పుడు సైకియాట్రిస్ట్‌ను సంప్రదించాలి. బిహేవియరల్ థెరపీ వంటి ట్రీట్‌మెంట్స్‌తో డిప్రెషన్ నుంచి ఈజీగా బయటపడొచ్చు.