బూట్లతో కొడతామన్న టీంఎంసీనేత - బీజేపీ, సీపీఎం నేతల ఆగ్రహం
మమ్మల్ని దొంగలని, అవినీతిపరులని తిడుతున్నారు.. మీరిలాగే ప్రవర్తిస్తే మిమ్మల్ని బూట్లతో కొట్టడతాం. అంటూ తృణమూల్ ఎంపీ సౌగతరాయ్ అన్న మాటలు వివాదాస్పదమయ్యాయి. తృణమూల్, సీపీఎం, బీజేల మధ్య మాటల యుద్దానికి కారణమయ్యింది.
బెంగాల్ లో పాలక తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. వేర్వేరు కేసుల్లో పార్థ ఛటర్జీ, అనుబ్రత మండల్ లను కేంద్ర దర్యాప్తు సంస్ధలు అరెస్టు చేయడంతో బీజేపీ, సీపీఎం నేతలు టీఎంసీపై విరుచుకుపడుతున్నారు. అవినీతిలో కూరుకుపోయిన మీ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదన్న వారి వ్యాఖ్యలపై తృణమూల్ ఎంపీ సౌగతరాయ్ మండిపడ్డారు. ఎవరో కొంతమంది చేసిన పనుల వల్ల మొత్తం పార్టీని దుయ్యబడుతున్నారని, మీరు మీ లిమిట్ ని అతిక్రమిస్తే బూట్లతో కొడతామని ఆయన హెచ్చరించారు. 'మమ్మల్ని దొంగలని, అవినీతిపరులని తిడుతున్నారు.. మీరిలాగే ప్రవర్తిస్తే . .. మా పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని బూట్లతో కొట్టడమే కాదు.. మీ లొకాలిటీ నుంచి మిమ్మల్ని తరిమికొడతారు కూడా' అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈయన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో.. ఆ తరువాత కాస్త తగ్గారు. తన 'షూ' కామెంట్ ని సీరియస్ గా తీసుకోరాదని.. లోగడ నక్సలైట్లు ఇలాంటి పదాన్ని వాడేవారని అన్నారు.
కానీ దీన్ని బీజేపీ, సీపీఎం నాయకులు సీరియస్ గానే పరిగణించారు. ఈ రిటైర్డ్ ప్రొఫెసర్ వ్యాఖ్యలు తృణమూల్ కాంగ్రెస్ ట్రెండ్ కి నిదర్శనంగా నిలుస్తున్నాయని.. నాగరికత ముసుగులో ఈయన చెత్త భాష వాడుతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఆరోపించారు. త్వరలోనే బెంగాల్ ప్రజలు ఈ అవినీతి ప్రభుత్వానికి తగిన శాస్తి చేస్తారని, సౌగత రాయ్ లాంటివారు ప్రజల ఆగ్రహాన్నీ ఎదుర్కోక తప్పదని అన్నారు. సీపీఎం సెంట్రల్ కమిటీ సభ్యుడు సుజన్ చక్రవర్తి కూడా రాయ్ వ్యాఖ్యలను ఖండించారు. మమ్మల్ని ఇలా బెదిరిస్తున్నారు.. అయితే మా కేడర్ సైతం వారి రౌడీయిజాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది అన్నారు. . వేర్వేరు కేసుల్లో పార్థ ఛటర్జీ, అనుబ్రత మండల్ లను సీబీఐ అరెస్టు చేయడంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చిక్కుల్లో పడ్డారు. అందువల్లే.. ఏ అవినీతి ఉదంతం బయట పడినా తన దృష్టికి తేవాలని, కార్యకర్తలైనా, నేతలైనా దీన్ని సహించరాదని ఆమె సూచించారు.