ప్రేమ పెళ్లి వీడియో వైరల్.. కూతురిని చంపి బూడిద మాయం చేసిన తండ్రి
ప్రేమికులను పోలీస్ స్టేషన్ కు పిలిచిన పోలీసులు ఐశ్వర్యను తన కుటుంబీకులతో ఇంటికి పంపారు. ఈనెల 3న పెరుమాళ్ బంధువులతో కలిసి ఐశ్వర్యను కొట్టి వేధించాడు.
తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్న కూతుర్ని ఇంటికి తీసుకొచ్చిన తండ్రి బంధువులతో కలిసి వేధించి చంపాడు. ఆధారాలు లేకుండా చేసేందుకు కూతురి మృతదేహాన్ని కాల్చి బూడిద కూడా మాయం చేశాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించి 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తంజావూరు జిల్లా ఒరత్తనాడుకు చెందిన పెరుమాళ్ కూతురు ఐశ్వర్య(19), పూవలూరుకు చెందిన భాస్కర్ కుమారుడు నవీన్(19) చదువుకునే రోజుల్లోనే ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ తిరుపూర్ జిల్లా అరవప్పాలయంలోని ఓ ప్రైవేట్ బనియన్ కంపెనీలో పనిచేస్తున్నారు. వేర్వేరు వర్గాలకు చెందిన వీరిద్దరూ డిసెంబర్ 31న స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
అనంతరం అదే ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. అయితే వీరి ప్రేమ పెళ్లికి సంబంధించిన వీడియో వాట్సాప్ లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ఐశ్వర్య తండ్రి పెరుమాళ్ పల్లడం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ప్రేమికులను పోలీస్ స్టేషన్ కు పిలిచిన పోలీసులు ఐశ్వర్యను తన కుటుంబీకులతో ఇంటికి పంపారు. ఈనెల 3న పెరుమాళ్ బంధువులతో కలిసి ఐశ్వర్యను కొట్టి వేధించాడు. ఆ తర్వాత ఆమెను హత్య చేసి మృతదేహాన్ని దహనం చేశాడు. స్నేహితులు ఇచ్చిన సమాచారంతో నవీన్ ఒరత్తనాడుకు చేరుకొని ఐశ్వర్యను కుటుంబీకులు హత్య చేసినట్లు వట్టతిక్కోట్టై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం తంజావూరు ఎస్పీ అసిస్రావత్ ఆధ్వర్యంలో పోలీసులు ఐశ్వర్య మృతదేహాన్ని దహనం చేసిన శ్మశాన వాటికను సందర్శించారు.
మృతదేహాన్ని దహనం చేసిన తర్వాత బూడిద కూడా దొరకకుండా మాయం చేయడంతో పోలీసులు దిగ్భ్రాంతి చెందారు. పరువు హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఐశ్వర్య తండ్రి పెరుమాళ్, తల్లి రోజా, ఐశ్వర్య అమ్మమ్మ మలర్, పెరుమాళ్ సోదరి అగదాసి, 16ఏళ్ల బాలిక సహా 11 మందిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. మరో వర్గానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు కన్న కూతుర్ని పరువు కోసం హత్య చేయడం తీవ్ర కలకలం రేపింది.