జడ్జిలపై విచారణ ఉత్తర్వులు ఆందోళనకరం
కేంద్రానికి, లోక్‌పాల్ రిజిస్ట్రార్‌కు నోటీసులు పంపిన సుప్రీంకోర్టు
హైకోర్టు జడ్జిలను విచారించే అధికారం తమకు ఉందంటూ లోక్‌పాల్ జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ ఉత్తర్వులు చాలా ఆందోళనకరమైనవి అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి, లోక్‌పాల్ రిజిస్ట్రార్‌కు నోటీసులు పంపింది. హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై దాఖలైన రెండు ఫిర్యాదులను లోక్‌పాల్ విచారిస్తున్నది. లోకాయుక్త చట్టం 2013 ప్రకారం హైకోర్టు జడ్జిలను విచారించే తమకు ఉందంటూ జనవరి 27న లోక్‌పాల్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సుమోటాగా తీసుకున్న సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా లోక్‌పాల్, లోకాయుత చట్టం 2013 న్యాయమూర్తుల పరిధిలోకి రాదని వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం జడ్జిపై ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారుడికి కూడా నోటీసులు పంపింది. సదరు హైకోర్టు న్యాయమూర్తిపై దాఖలైన పిటిషన్లను సీజేఏ అభిప్రాయానికి పంపినట్లు తెలిపింది. తదుపరి విచారణను మార్చి 18కి వాయిదా వేసింది. సదరు హైకోర్టు న్యాయమూర్తి పేరును బైటకి వెల్లడించవద్దని ఫిర్యాదుదారుడిని ఆదేశించింది.