ఒక్కరోజు కాలేదు.. అప్పుడే విమర్శలా?
మాజీ సీఎం ఆతిశీపై ఫైర్ అయిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా
బీజేపీ ఎన్నికల హామీలను నెరవేర్చలేదంటూ ఢిల్లీ మాజీ సీఎం ఆతిశీ చేసిన విమర్శలను కొత్త సీఎం రేఖా గుప్తా తిప్పికొట్టారు. కాంగ్రెస్ 15 ఏళ్లు, ఆప్ 13 ఏళ్లు ఢిల్లీని పాలించాయి. ఇన్నేళ్లపాటు మీరేం చేశారో చూసుకోకుండా.. అధికారంలోకి వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు కానీ మాపై విమర్శలు చేస్తారా? మొదటిరోజే మేం క్యాబినెట్ సమావేశం జరిపాం. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయుష్మాన్ భారత్ యోజనను అందుబాటులోకి తీసుకొచ్చాం. దాంతో ప్రజలకు రూ. 10 లక్షల మేర వైద్యసహాయం అందనున్నది. ఈ పథకాన్ని ఆప్ అమలు చేయలేదు. మమ్మల్ని ప్రశ్నించే హక్కు వారికి లేదు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఢిల్లీ తన హక్కులన్నీ పొందుతుంది. ముందు మీరు మీ పార్టీ గురించి చూసుకోండి. ఎంతోమంది మీ పార్టీని వీడాలని చూస్తున్నారు. కాగ్ రిపోర్ట్‌ను అసెంబ్లీలో పెడితే అందరి జాతకాలు బైటపడుతాయని ఆందోళన చెందుతున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీలో మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందించే పథకాన్ని మొదటి క్యాబినెట్ సమావేశంలో ఆమోదిస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, కానీ తొలిరోజే దాన్ని ఉల్లంఘించిందని ఆతిశీ విమర్శించారు. దీనికి సీఎం కౌంటర్ ఇచ్చారు.