బ్యూటీ పార్లర్‌కు వెళ్లొద్దన్న భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య
ఈ విషయమై భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మనస్తాపం చెందిన రీనా భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య సమాజంలో ఇటీవల బాగా పెరిగింది. కొంతమంది ఏ సమస్య వచ్చినా తట్టుకోలేకపోతున్నారు. పరిష్కరించుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. చావే సమస్యకు పరిష్కారం అని భావిస్తున్నారు. ఇంట్లో గొడవ జరిగిందని, వ్యాపారంలో నష్టం వచ్చిందని, పరీక్షల్లో ఫెయిలయ్యామని, పెళ్లిళ్లు కావడం లేదని.. ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
తాజాగా మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మహిళ బ్యూటీ పార్లర్ కు వెళ్లొద్దని భర్త అన్నందుకు మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ఇండోర్ నగరంలోని స్కీమ్ నంబర్-51 ప్రాంతంలో బలరాం యాదవ్, రీనా యాదవ్ (34) దంపతులు నివసిస్తున్నారు. వీరికి 15 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. అయితే రీనా యాదవ్ ఇటీవల తరచూ బ్యూటీ పార్లర్ కు వెళ్తోంది. గురువారం సాయంత్రం ఆమె బ్యూటీ పార్లర్ కు వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే బ్యూటీ పార్లర్ కు వెళ్ళవద్దని భర్త బలరాం యాదవ్ అభ్యంతరం తెలిపాడు. పదేపదే బ్యూటీ పార్లర్ కు వెళ్లడం అంత మంచిది కాదని భార్యకు సూచించాడు.
ఈ విషయమై భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మనస్తాపం చెందిన రీనా భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఫ్యాన్ కు వేలాడుతూ ఉండటాన్ని గమనించిన బలరాం పోలీసులకు సమాచారం అందించాడు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. బలరాం తోపాటు చుట్టుపక్కల వారి నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని రీనా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు ఎస్ఐ ఉమా శంకర్ యాదవ్ తెలిపారు. రీనా మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు.