ఏడాదిన్నరలోనే 10 లక్షల ఉద్యోగాలిచ్చాం

నేడు జరుగుతున్న రోజ్‌గార్‌ మేళాలోనూ 71, 000 మందికి పైగా యువతకు అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చామన్న ప్రధాని మోడీ

Advertisement
Update:2024-12-23 13:37 IST

తమ పాలనలో యువతకు పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. గత ఒకటిన్నర ఏళ్లలో 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. దేశ చరిత్రలో ఇది పెద్ద రికార్డ్‌ అని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో నిజాయితీ, పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. నేడు జరుగుతున్న రోజ్‌గార్‌ మేళాలోనూ 71, 000 మందికి పైగా యువతకు అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చామని తెలిపారు. దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తారని.. వారిలోని సామర్థ్యాలను వినియోగించుకోవడం ద్వారా ప్రభుత్వం మరింత ముందుకు వెళ్తుందని అన్నారు.

ఇలా ఉద్యోగాలు పొందిన వారంతా భక్తితో, నిజాయితీతో దేశం కోసం పనిచేస్తున్నారు.. ఇలాగే ముందుకు వెళితే 2047 కల్లా వికసిత భారత్‌ లక్ష్యాన్ని చేరుకోగలమని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధి యువతపైనే ఆధారపడి ఉంటుందని.. అయితే గత ప్రభుత్వాలు వారికి సరైన ఉపాధి కల్పించకపోవడం వల్ల దేశం వెనకబడిపోయిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. అందుకు అనుగుణంగా మేక్‌ ఇన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్, డిజిటల్‌ ఇండియా వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం భారత్‌ అన్నిరంగాల్లో ముందుకు వెళ్తున్నదని.. అంతరిక్షం, రక్షణ, మొబైల్‌ తయారీ, పునరుత్పాదక ఇంధనం, పర్యాటక రంగాల్లో భారత్‌ ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతున్నదని పేర్కొన్నారు.

నేడు రోజ్‌గార్‌ మేళాలో అందించిన నియామక పత్రాల్లో అధిక సంఖ్యలో యువతులు ఉన్నారని ప్రధాని పేర్కొన్నారు. మహిళలు అన్నిరంగాల్లో స్వయం ప్రతిపత్తిని సాధించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు.. అన్ని ప్రాంతాల యువతకు అనుకూలంగా ఉండటానికి 13 భారతీయ భాషల్లో రిక్రూట్‌మెంట్‌ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తున్నట్లు వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News