కేజ్రీవాల్‌ను విచారించడానికి ఈడీకి అనుమతిచ్చిన ఢిల్లీ ఎల్జీ
లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతులు మంజూరు చేసినట్లు ఎల్జీ కార్యాలయం ఓ ప్రకటన
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఢిల్లీ మద్యం కేసులో మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతులు మంజూరు చేశారు. ఈ మేరకు ఎల్జీ కార్యాలయం ఓ ప్రకటన చేసింది.
మనీలాండరింగ్‌తో ముడిపడిన ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌ను విచారించడానికి ఈ నెల 5న ఎల్జీని అనుమతులు కోరారు. సీఆర్‌పీసీ ప్రకారం.. మనీలాండరింగ్‌కు సంబంధించి ప్రజాప్రతినిధులను విచారించాలంటే ముందస్తు అనుమతులు తప్పనిసరి. అందుకే ఎల్జీని అనుమతులు కోరారు. ఇక, ఇటీవల ఈ కేసులో తనపై విచారణ ప్రక్రియను నిలిపివేయాలని కేజ్రీవాల్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చిన విషయం విదితమే. మద్యం విదానానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈ ఏడాది మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. జూన్ 27 నుంచి సీబీఐ జ్యూడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. ఆ తర్వాత సెప్టెంబర్‌లో ఆయనకు బెయిల్ వచ్చింది.