'ది కేరళ స్టోరీ' సినిమాతో జ‌నం మారిపోతారా..?

ముస్లిం యువకుడితో జీవితం వద్దని ఎంపీ ప్ర‌జ్ఞాసింగ్‌ యువతి మనసు మార్చే ప్రయత్నం చేశారు. 'ది కేరళ స్టోరీ' సినిమాకు తీసుకువెళ్లి చూపించారు. ఆ సినిమా చూసిన తర్వాత యువతి మారిందని తల్లిదండ్రులకు అప్పగించారు ఎంపీ.

Advertisement
Update:2023-06-08 16:47 IST

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ 20 ఏళ్ల యువతి ఓ ముస్లిం యువకుడిని ప్రేమించింది. తమ ప్రేమకు ఇంట్లో వాళ్లు అంగీకరించకపోవడంతో అతడితో కలిసి వెళ్లిపోయింది. స‌హాయం కోసం యువతి కుటుంబ సభ్యులు ఎంపీని ఆశ్రయించగా.. సదరు ఎంపీ యువతి ఆచూకీ కనుక్కొని యువకుడి వద్ద నుంచి ఆమెను తీసుకొచ్చారు. ఇటీవల వివాదాస్పదమైన 'ది కేరళ స్టోరీ' సినిమా చూపి యువతి మనసు మార్చే ప్రయత్నం చేసింది. ఇక అంతా సెట్ అయింది అనుకున్న సమయంలో ఆ యువతి ఎంపీకి ఝ‌ల‌క్‌ ఇచ్చి తిరిగి ప్రేమించిన యువకుడితో పారిపోయింది.

భోపాల్ కు చెందిన యువతి నర్సింగ్ చదువుతోంది. తన క్లాస్ మేట్ సోదరుడైన యూసుఫ్ తో ఆ యువ‌తికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ముస్లిం యువకుడితో పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో సదరు యువతి గత నెల 11వ తేదీన యూసుఫ్‌తో ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ను ఆశ్రయించారు. తమ కుమార్తెను ముస్లిం యువకుడి చెర నుంచి విడిపించి తమకు అప్పగించాలని కోరారు. దీంతో ఎంపీ ఆ యువతి ఆచూకీ కనుక్కొని ఆమెను తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

ముస్లిం యువకుడితో జీవితం వద్దని ఎంపీ ప్ర‌జ్ఞాసింగ్‌ యువతి మనసు మార్చే ప్రయత్నం చేశారు. 'ది కేరళ స్టోరీ' సినిమాకు తీసుకువెళ్లి చూపించారు. ఆ సినిమా చూసిన తర్వాత యువతి మారిందని తల్లిదండ్రులకు అప్పగించారు ఎంపీ. కొద్ది రోజులు ఇంటిపట్టునే ఉన్న యువతి ఆ తర్వాత ఇంట్లో నుంచి మళ్లీ పారిపోయి యువకుడి వద్దకు చేరింది. తమ కుమార్తె వెళ్తూ వెళ్తూ ఇంట్లో ఉన్న రూ.70 వేల నగదు, బంగారం తీసుకువెళ్లిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. 'నేను మేజర్‌నని.. ఏది తప్పో, ఏది ఒప్పో తనకు తెలుసని.. నా గురించి వెతకడం ఆపండి' అని తల్లిదండ్రులకు యువతి ఒక వీడియో మెసేజ్‌ పంపించింది. ఈ ఘటన తర్వాత యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేశామని, యువతి ఆచూకీ దొరికిన తర్వాత ఆమె ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఏది ఏమైనా 'ది కేరళ స్టోరీ' సినిమా చూపి యువతి మనసు మార్చాలని ఎంపీ సాధ్వీ ప్రయత్నించినప్పటికీ ఆమెకే సదరు యువతి ఝ‌ల‌క్‌ ఇచ్చింది.

Tags:    
Advertisement

Similar News