రెండ్రోజుల్లో శుభ‌వార్త వింటారు.. - ఎంఎన్‌ఎం అధినేత కమల్‌హాసన్‌

రానున్న ఎన్నికల్లో కమల్‌హాసన్‌ తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకేతో పొత్తు పెట్టుకుంటారని తెలుస్తోంది. డీఎంకే నాయకుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ కూడా ఈ విషయాన్ని గత ఏడాది సెప్టెంబర్‌లో వెల్లడించారు.

Advertisement
Update:2024-02-19 16:53 IST

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ విధానం ఏమిటనేది రెండ్రోజుల్లో ప్రకటిస్తానని మక్కల్‌ నీది మయ్యుం (ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత కమల్‌హాసన్‌ వెల్లడించారు. తన తదుపరి చిత్రం ’థగ్‌ లైఫ్‌’ షూటింగ్‌ కోసం అమెరికా వెళ్లిన కమల్‌ సోమవారం చెన్నె తిరిగొచ్చారు. ఈ మేరకు ఆయన విమానాశ్రయంలోనే విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. రెండు రోజుల్లో శుభవార్త వింటారని ఈ సందర్భంగా చెప్పారు.

రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం తాము సిద్ధమవుతున్నామని కమల్‌ తెలిపారు. రెండు రోజుల్లోనే పొత్తుకు సంబంధించిన నిర్ణయం ప్రకటించనున్నట్టు ఆయన చెప్పారు. తమకు మంచి అవకాశాలు వస్తాయని తాను భావిస్తున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు.

రానున్న ఎన్నికల్లో కమల్‌హాసన్‌ తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకేతో పొత్తు పెట్టుకుంటారని తెలుస్తోంది. డీఎంకే నాయకుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ కూడా ఈ విషయాన్ని గత ఏడాది సెప్టెంబర్‌లో వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కమల్‌ పార్టీతో పొత్తుపై తమ పార్టీ నేతలు నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు.

గతంలో ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అప్పట్లో ఉదయనిధికి కమల్‌హాసన్‌ మద్దతుగా నిలిచారు. సనాతన ధర్మంపై మాట్లాడినందుకే చిన్న పిల్లవాడిని టార్గెట్‌ చేస్తున్నారని ఆయన విమర్శలు చేయడం గమనార్హం. కమల్‌హాసన్‌ తన పార్టీ మక్కల్‌ నీది మయ్యుమ్‌ (ఎంఎన్‌ఎం) ను 2018లో స్థాపించిన విషయం తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికలు, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన ఆయన ఓటమిని చవిచూశారు. గత ఏడాది జరిగిన ఈరోడ్‌ ఉప ఎన్నికల్లో ఎంఎన్‌ఎం పార్టీ డీఎంకే అభ్యర్థికి మద్దతిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన రానున్న లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు పెట్టుకోనున్నారని తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News